అదనపు కట్నం కోసం చున్నితో ఉరి.. పెట్రోల్‌తో‌ నిప్పు..!

by Sumithra |
Murder
X

దిశ, నల్లగొండ: అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చిన ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని అక్కలాయిగూడెంలో ఆదివారం రాత్రి జరిగింది. మృతురాలి తండ్రి నల్లబెల్లి ముత్యాలు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెళ్లం గ్రామానికి చెందిన జ్యోతి(29)ని, జిల్లా కేంద్రంలోని అక్కలాయిగూడేనికి చెందిన మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఉద్యోగి పరుశురాములుకు ఇచ్చి 14ఏండ్ల క్రితం వివాహం చేశారు. కొన్నేండ్లు కాపురం సజావుగానే చేసినా, అనంతరం అదనపు కట్నం తీసుకురావాలని భార్య జ్యోతిని వేధించేవాడు. మూడేళ్లక్రితం ఇదే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పెద్దమనుషుల సమక్షంలో నచ్చజెప్పి కాపురానికి పంపించారు.

ఈ నేపథ్యంలో పరశురాములు ఆదివారం రాత్రి తన భార్య జ్యోతిని చున్నీతో ఉరేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే జ్యోతి మృతిచెందింది. నల్లగొండ వన్ టౌన్ సీఐ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సోమవారం సాయంత్రం జ్యోతి బంధువులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టగా.. సీఐ వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. మృతురాలి తండ్రి ముత్యాలు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జ్యోతి భర్త పరుశురాం, అత్తమామలు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story