కరోనా కౌగిలింత.. చూస్తే ఉప్పొంగును మనసంతా (వీడియో)

by vinod kumar |   ( Updated:2024-05-31 15:10:07.0  )
కరోనా కౌగిలింత.. చూస్తే ఉప్పొంగును మనసంతా (వీడియో)
X

దిశ,వెబ్ డెస్క్:కరోనా..కరోనా..కరోనా ప్రపంచంలో ఏ మూల చూసినా ఈ మహమ్మారి వైరసే కనిపిస్తుంది.దీనివలన ఎన్నో రంగాలు అతలాకుతలమయ్యాయి. ఎంతమంది ఆత్మీయులను పోగొట్టుకోవాల్సివచ్చింది. ఎన్నో బంధాలను వదిలేయాల్సివచ్చింది. చివరికి సొంత భార్యను , కన్న బిడ్డలను కూడా దూరం పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఇంట్లో ఉన్నవాళ్ల పరిస్థితి ఇది అయితే.. కరోనా చికిత్స తీసుకుంటున్న రోగుల పరిస్థితి మరింత దారుణం. ఒకరిని ముట్టుకొనేది లేదు. ఒకరిని పట్టుకొనేది లేదు. కనీసం తనివితీరా పట్టుకొని ఏడవడానికి కూడా ఒక మనిషి ఉండడు. అంతటి క్షోభను అనుభవించి కరోనా నుండి బయటికి వచ్చి తన సొంత వాళ్ళని కౌగిలించుకున్నప్పుడు వచ్చే ఆనందం వర్ణనాతీతం. అలాంటి మరువలేని అద్భుత క్షణాలను ఆస్వాదించారు అమెరికాకు చెందిన ఒక వృద్ధ జంట. కరోనా కారణంగా ఏడాది క్రితం విడిపోయిన వారిద్దరూ మళ్ళీ కలిసినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

అమెరికాకు చెందిన వృద్ధ దంపతులు రాబర్ట్ కౌచ్, మార్లెన్. అమెరికాలో కరోనా కేసు లు ఎక్కువ కావడంతో వారిద్దరిని వేర్వేరు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. అక్కడ నిబంధనల ప్రకారం ఒకరిని ఒకరు కలుసుకోవడానికి వీల్లేదు. దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే ఆ నిబంధనలను తొలగించారు. దీంతో రాబర్ట్ తన భార్య మార్లెన్ ని కలవడానికి అధికారులు అనుమతినిచ్చారు. ఏడాది తరువాత భార్యను చూసిన రాబర్ట్ ఒక్కసారిగా ఆమెను గట్టిగా హత్తుకొని భావోద్వేగానికి గురయ్యాడు. వారి కళ్ళలో ఆనందోత్సహాలు తొణికిసలాడాయి. ముదిమి వయసు వచ్చేవరకు తనకు తోడుగా ఉన్న భార్యను గట్టిగా హత్తుకొని, ఆనందంతో డాన్స్ చేసాడు. ప్రస్తుతం వీరి డాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. కరోనా మహమ్మారి వలన దూరమైన ఈ జంట భావోద్వేగం చూస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed