- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు రాజధానులకు అనుకూలంగా భారీ ర్యాలీ.. ఆ సభకు కౌంటర్‌గానేనా..?
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతియే ఉండాలని ఆ ప్రాంత రైతులు, మహిళలు 45 రోజులు మహా పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. శుక్రవారం తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు అమరావతి జేఏసీ ప్రయత్నాలు చేపట్టింది. హైకోర్టు సైతం సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమరావతి జేఏసీ నేతలు సభ నిర్వహణలో తలమునకలయ్యారు. సభను విజయవంతం చేయడంతోపాటు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటేందుకు వ్యూహ రచన చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తిరుపతిలో మూడు రాజధానులకు అనుకూలంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. బాలాజీ కాలనీ నుంచి భారీ ర్యాలీగా ఎన్టీఆర్ జంక్షన్, ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం పీఎస్, నాలుగుకాళ్ల మండపం, నేతాజీ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ వరకు రాయలసీమ మేధావుల ఫోరం భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. రాయలసీమ అభివృద్ధి, కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రేపు రైతుల ముగింపు సభ.. చంద్రబాబుతో పాటు ప్రముఖుల హాజరు?
అమరావతి రైతుల ముగింపు బహిరంగ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతియే ఉండాలంటూ రైతులు, మహిళలు మహాపాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగింపు సభకు మాత్రం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుపతి నగర శివారులోని నాయుడుపేట, పూతలపట్టు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలంలో ఈ ముగింపు బహిరంగ సభ జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సభను సక్సెస్ చేసేందుకు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు ఇప్పటికే మహా పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ముగింపు సభకు ఈ పార్టీలకు చెందిన కీలక నేతలు పాల్గొంటారని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సభకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనల కార్యక్రమాలకు మొదటి నుంచి టీడీపీ మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రైతులకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో భార్య నారా భువనేశ్వరితో కలిసి జోలె సైతం పట్టిన సంగతి తెలిసిందే. అమరావతి రైతుల పోరాటానికి నారా భువనేశ్వరి తన రెండు ప్లాటినం గాజులను విరాళంగా ఇచ్చారు కూడా. వీరితోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు కీలక నేతలు అంతా అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
హేమాహేమీల హాజరు
అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన ఈ మహా పాదయాత్ర కు మద్దతు ప్రకటించిన పలు పార్టీల అధినేతలు ఆ ముగింపు సభలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సీపీఎం నేత మధు ఈ సభలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీలును బట్టి హాజరవుతారని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరవుతారని కూడా తెలుస్తోంది. భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు రాకేష్ తికాయత్, యదువీర్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉందని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ముగింపు సభకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
- Tags
- amravati