కేసీఆర్ దత్తత గ్రామంలో మరీ ఇంత అవినీతా..?

by Anukaran |
sand-illegal
X

దిశ, బాల్కొండ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే ఆ గ్రామానికి వెళ్లి మొక్కు తీర్చుకుంటా అని ముడుపు కట్టి.. రాష్ట్రం సిద్ధించాక నాటి ఉద్యమ నేత ప్రస్తుతం సీఎం కేసీఆర్ మోతే గ్రామాన్ని సందర్శించి ముడుపు విప్పి మొక్కు చెల్లించుకున్నారు. అది చాలదన్నట్టు తాను స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ తొలినాళ్లలోనే ఏకగ్రీవ పంచాయతీని కట్టబెట్టిందని ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం మోతే గ్రామం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మోతే గ్రామంలో ఈనాడు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

ప్రభుత్వ ఖజానాకు కాసులు కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. కాసుల కక్కుర్తితో ప్రభుత్వ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇసుక అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణ లోపం, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కళ్లు మూసుకోవడంతో రాజకీయ నాయకుల పర్యవేక్షణలోనే ఇసుక అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.

వాగుల్లో అనుమతులు లేకుండా ఇసుక తోడటం చట్ట విరుద్దం. వివిధ అవసరాలకు, ప్రభుత్వం ద్వారా చేపట్టే నిర్మాణలాకు ఇసుక కావాలనుకుంటే తహాసీల్దార్‌‌ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇందుకు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా మోతే వాగులో నుంచి ఇసుకను అక్రమార్కులు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా.. స్థానిక తహశీల్దార్ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story