హెచ్‌పీసీఎల్ లాభాలు 215 శాతం వృద్ధి

by Harish |
హెచ్‌పీసీఎల్ లాభాలు 215 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్య సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) నికర లాభాలు 215.13 శాతం పెరిగి రూ. 2,354.6 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ రూ. 747.20 కోట్ల లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం 2 శాతం తగ్గి రూ. 68,659.2 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో సంస్థ రూ. 70,042.2 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. పన్నులకు ముందు సంస్థ లాభాలు రూ. 3,157.87 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ పన్నులు 99.4 శాతం పెరిగి రూ. 1,150.84 కోట్లకు చేరింది. డిసెంబర్ త్రైమాసికంలో ఎబిటా(వడ్డీ,పన్నులకు ముందు) సంస్థ ఆదాయాలు రూ. 3,302 కోట్లుగా ఉన్నాయి. చమురు తగ్గడం వల్ల గతేడాది ఇదే కాలంలో ఉన్న రూ. 1,156 కోట్లతో పోలిస్తే చాలా తక్కువని సంస్థ తెలిపింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో సంస్థ షేర్లు 1.09 శాతం పెరిగి రూ. 22.65 వద్ద ఉంది.

ఎన్‌టీపీసీ ఆదాయం 4 శాతం పెరిగింది…

ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఎన్‌టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ. 3,315 కోట్ల లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 10.7 శాతం అధికమని సంస్థ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం 4.3 శాతం పెరిగి రూ. 24,509 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో సంస్థ మొత్తం ఖర్చులు 5.4 శాతం పెరిగి రూ. 21,707 కోట్లకు చేరుకున్నాయి. అలాగే, ఏకీకృత నికర లాభం 15.4 శాతం పెరిగి రూ. 3,766 కోట్లకు చేరుకోగా, ఆదాయం 4 శాతం పెరిగి రూ. 27,526 కోట్లకు చేరుకుంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గురువారం ఎన్‌టీపీసీ షేర్ ధర 1.90 శాతం పెరిగి రూ. 99.05 వద్ద ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed