హాస్టళ్లకు టూ లెట్ బోర్డు

by Shyam |
హాస్టళ్లకు టూ లెట్ బోర్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో : చదువుకునే విద్యార్థుల నుంచి మొదలు కోచింగ్ సెంటర్లలో ట్రైన్ అయ్యే నిరుద్యోగులు, పలు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వరకు చాలా మంది ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో వంట చేసుకునేందుకు కూడా సమయం లేక చాలామంది హాస్టళ్లను ఆశ్రయించేవారు. అప్పటి వరకు వందల మందితో కళకళలాడిన ప్రైవేట్ వసతి గృహాలు నేడు వెలవెలబోతున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వ్ం లాక్ డౌన్ విధించడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, జాబ్ కోల్పోయిన ఉద్యోగులందరూ క్రమంగా ఇంటి బాట పట్టారు. వైరస్ ధాటికి హాస్టళ్లలో ఉండే వారి సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. కాగా మరికొంతమంది నిర్వాహకులు అద్దెభారం ఎక్కువై మూసివేశారు. ప్రస్తుతం ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పెంచినా హాస్టళ్లకు ఆదరణ కరువైంది. దీనినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న నిర్వాహకులకు భారంగా మారింది.

కరోనాకు ముందు ఫుల్ డిమాండ్

నగరంలోని దిల్ సుఖ్ నగర్, నారాయణగూడ, విద్యానగర్, అమీర్ పేట, మైత్రివనం, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో హాస్టళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ ఏరియాల్లో ఎక్కువ శాతం విద్యా సంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇతర సంస్థలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఈ ఏరియాల్లో హాస్టళ్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ గదుల నుంచి లగ్జరీ గదుల వరకు హాస్టల్ లో ఉండేవారి అభిరుచికి అనుగుణంగా గదులను ఏర్పాటు చేసి అందుకు తగినట్లుగా ఫీజు తీసుకునే వారు నిర్వాహకులు. అవసరమైతే ఏసీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అందుకు ప్రత్యేకంగా ఫీజు తీసుకునేవారు. కరోనాకు ముందు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతోంది నిర్వాహకుల బిజినెస్. అయితే కొవిడ్ మహమ్మారి రాకతో ఆ సీన్ రివర్స్ అయింది. హాస్టళ్ల మూతతో అప్పటివరకు సంతోషంగా ఉన్న నిర్వాహకుల కుటుంబాలు ఒక్కసారి రోడ్డునపడ్డాయి.

పదుల సంఖ్యలో కూడా లేరు..

మహానగరంలో ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులు ఎక్కువశాతం వరకు హాస్టళ్లలో ఉండేందుకే మొగ్గుచూపుతారు. వారే కాకుండా ఉద్యోగ వేటలో ఉన్నవారు, జాబ్ కోసం పలు కోచింగ్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకుంటున్నవారు, ఉద్యోగులు సైతం హాస్టళ్లలో ఉంటున్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు, పలు సంస్థలు మూతపడటంతో అందరూ తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. అప్పటి నుంచి వందల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య కాస్త పదుల సంఖ్యకు పడిపోయింది. పలు హాస్టళ్లలో ముగ్గురు, ఐదుగురు చొప్పున ఉంటున్నారు. నిర్వాహకులు అనుకున్న స్థాయిలో విద్యార్థులు, ఉద్యోగులు హాస్టళ్లలో లేకపోవడంతో వారి కుటుంబపోషణ రానురాను భారంగా మారింది. దాదాపు 15 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు హాస్టళ్ల నిర్వాహకులు. కరోనా వచ్చి తమ జీవితాలను కకావికలం చేసిందని బోరున విలపిస్తున్నారు.

నిర్వాహకులకు అద్దె భారం

ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులకు అద్దె భారం భారీగా పెరిగిపోయింది. అంతకుముందు వందల సంఖ్యలో విద్యార్థులు ఉండేవారు. అందుకు తగినట్లుగా కమర్షియల్ భవనాల్లో హాస్టళ్లు నిర్వహించేవారు. ప్రతినెలా అద్దె లక్షల్లోనే చెల్లించేవారు. అయితే కరోనా కారణంగా చాలామంది ఇంటికి వెళ్లిపోవడంతో హాస్టళ్లలో ఉండేవారి సంఖ్య తగ్గిపోయింది. అంతేకాకుండా హాస్టళ్ల కోసం వినియోగించే భవనాలు నిర్వాహకుల సొంత భవనాలు కాకపోవడం వల్ల నిర్వాహకులకు నిర్వహణ మరింత భారమైంది. చేసేదేమీ లేక నష్టపోయిన కొందరు నిర్వాహకులు హాస్టళ్లను పూర్తిగా మూసివేశారు. మరికొందరు అద్దె భారాన్ని తగ్గించుకునేందుకు వారికి అవసరం ఉన్నంత మేర మాత్రమే గదులు ఉంచుకుని మిగితావి ఖాళీ చేసేశారు. అలా అయినా కూడా వారికేమీ మిగలట్లేదని నిర్వాహకులు వాపోతున్నారు. గతంలో కొంత మిగిలేదని, ఉన్నంతలోనే తమ కుటుంబ పోషణ సాగేదని, ప్రస్తుతం చాలా ఇబ్బంలు ఎదుర్కొంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. యజమానులు కూడా అద్దె తక్కువ తీసుకోవడం లేదంటున్నారు హాస్టళ్ల నిర్వాహకులు.

సిబ్బంది తొలగింపు

ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్స్, భోజనం తయారు చేసేందుకు వంట మాస్టర్లు, గేట్ కీపర్లు, స్వీపర్లు, రజకులు ఇలా చాలా మందికి ప్రైవేట్ హాస్టళ్ల ద్వారా ఉపాధి లభించేది. అలాంటి వారి జీవితాల్లో కరోనా శాపంగా మారింది. వారికి మిగిలేదే కొంత. అదే పనిని నమ్ముకున్న వారిని కొవిడ్ నట్టేట ముంచింది. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో స్వీపర్లు, వంట మాస్టర్లు, ఇతర సిబ్బంది అవసరం లేకుండా పోయింది. అద్దె చెల్లించేందుకే ఇబ్బందులు పడుతున్న వారికి సిబ్బందికి జీతాలు చెల్లించడం కూడా తలనొప్పిగా మారింది. దీంతో చాలా హాస్టళ్లలో ఉన్నపళంగా సిబ్బందిని తొలగించి నిర్వాహకుల కుటుంబీకులే మెయింటనన్స్ పనులు చూసుకుంటున్నారు. రజకులను తొలగించి వారి స్థానంలో వాషింగ్ మెషీన్లను తెచ్చుకుంటున్నారు.

పండ్లు అమ్ముకుంటున్నా..

పదిహేనేండ్లుగా హాస్టల్ నిర్వహిస్తున్నా. మా హాస్టల్ లో 150 బెడ్ల కెపాసిటీ ఉంది. కరోనా రాకముందు 120 మందికిపైగా విద్యార్థులు, ఉద్యోగులు ఉండేవారు. కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉంటున్నారు. పరిస్థితులు చక్కబడితే బాగుంటుంది. విద్యాసంస్థలు, ఇనిస్టిట్యూట్లు తెరిస్తే కొంతమందైనా హాస్టళ్లకు వచ్చే అవకాశముంది. భవన యజమానికి ప్రతినెలా అద్దె రూ.లక్ష ఇరవై వేలు చెల్లించాలి. కొన్ని నెలలుగా పెండింగ్ ఉంది. కొంత మాత్రమే చెల్లించా. ఏం చేయాలో తెలియక కుటుంబ పోషణ కోసం హాస్టల్ ముందే పండ్లు తెచ్చి అమ్ముకుంటున్నా.
= రాధా కృష్ణ, హాస్టల్ యజమాని, ఎల్లారెడ్డిగూడ.

Advertisement

Next Story