- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇందిరాశోభన్ రాజీనామా వెనక అతడి ‘హస్తం’!
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి ఇందిరాశోభన్ గుడ్ బై చెప్పారు. శుక్రవారం ఉదయం తన రిజైన్ కు సంబంధించిన లేఖను వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలకు పంపారు. తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు షర్మిల ప్రకటించిన కొద్ది రోజులకే ఇందిరాశోభన్ కాంగ్రెస్‌ను వీడి లోటస్ పాండ్‌కు తరలివెళ్లారు. ఆనాటి నుంచి షర్మిల ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్లి పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేశారు. అయితే అక్కడ ప్రాధాన్యత దక్కకపోవడంతోనే ఇందిరా శోభన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.
గతంలోనూ ఇందిరాపార్క్ వద్ద గాడిదలు కాస్తున్నారా? అని షర్మిల అవమానించడం, లోటస్ పాండ్ వద్ద నిమ్మరసం, జ్యూస్ అందించడంపై వచ్చిన నెగెటివ్ కామెంట్లు, పార్టీ ఆవిర్భావం రోజు ఫోన్ పోవడం అన్నీ తనకు కలిసిరాని అంశంగా ఇందిరాశోభన్ భావించినట్లు సమాచారం. దీనికి తోడు ఇందిరాశోభన్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. వైఎస్సార్ టీపీలోనూ ప్రమోషన్ ఇస్తారనుకుంటే ఇక్కడా అధికార ప్రతినిధిగానే బాధ్యతలు అప్పజెప్పడంతో నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఆమె పార్టీని వీడుతారని గతంలోనే ఊహాగానాలు వచ్చినా ఆమె షర్మిలతోనే ఉంటానని స్పష్టం చేశారు. తాజాగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో షర్మిలకు షాక్ తగిలినట్లయింది.
ప్రజలు కోరినందుకే వైఎస్సార్ టీపీకి బై.. బై..
ఇందిరాశోభన్ అసలు పార్టీకి ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు..? దాని వెనుక గల కారణాలను, తన భవిష్యత్ ప్రణాళికలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం అందరితో కలిసి కొట్లాడినట్లు ఆమె చెప్పారు. అయితే అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకుల బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం కొట్లాడుతూనే ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. అందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు షర్మిల పార్టీకీ రాజీనామా చేసినట్లు ఆమె చెప్పారు.
కాల్ చేసిన షర్మిల
ఇందిరాశోభన్ తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ షర్మిలకు పంపించారు. అందులో ఇన్నిరోజులు తనకు సహకరించిన షర్మిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీని ఎందుకు వీడుతున్నారనే కారణాలపై షర్మిల ఆరా తీసింది. ఇందిరాశోభన్‌కు కాల్ చేసి దాదాపు అరగంట పాటు పలు అంశాలపై చర్చించింది. ప్రాధాన్యత విషయంలో అయితే ఇకపై ఎలాంటి ఢోకా ఉండదని షర్మిల హామీ ఇచ్చినట్లు ఇందిరాశోభన్ తెలిపారు. దీనికి తోడు పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు సైతం ఇందిరాశోభన్ ఇంటికి వెళ్లి తిరిగి పార్టీలోకి రావాలని బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయితే తిరిగి అక్కడికి వెళ్లేందుకు ఇందిరాశోభన్ సుముఖంగా లేనట్లు సమాచారం. లోటస్ పాండ్‌లో కొందరు నేతల ఓవరాక్షన్ కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.
త్వరలో కాంగ్రెస్ గూటికి?
కాంగ్రెస్‌లో లీడర్ షిప్ కొరత ఉందనే కారణంతో ఇందిరాశోభన్ హస్తాన్ని వీడి షర్మిల పార్టీలో చేరారు. తాజాగా పీసీసీ చీఫ్ గా బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించడంతో కాంగ్రెస్ జోష్‌లో ఉంది. రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన వర్గం నుంచి పిలుపు వస్తునట్లు ఇందిరా శోభన్ గతంలోనే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ చీఫ్‌గా సరైన వ్యక్తికి లీడర్ షిప్‌ను అందించిందనే కారణంతో షర్మిల పార్టీకి రాజీనామా చేసిందని సమాచారం. త్వరలోనే కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఇందిరాశోభన్ మాత్రం ఇంకా తను ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రజాజీవితంలోనే ఉంటానని, ప్రజల కోసం పోరాడుతానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె స్పష్టం చేశారు.
షర్మిలకు మైనస్!
ఇందిరాశోభన్ రాజీనామా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిలకు మైనస్ అవ్వనుందని రాజకీయ వర్గాల్లో టాక్. పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో చేరికలు జరగలేదు. పేరున్న నేతలు కూడా పార్టీలో లేరు. వైఎస్సార్ టీపీ ఏర్పాటు నుంచి ఇందిరాశోభన్ క్రియాశీలకంగా పనిచేశారు. అధినేత్రి తర్వాత ఎలాంటి పరిస్థితులున్నా హ్యాండిల్ చేసుకునేవారు. షర్మిల తర్వాత ఏదైనా అంశం గురించి మాట్లాడాలంటే ఇందిరాశోభన్ తప్పితే మరో నేత పెద్దగా ఆకట్టుకునేలా, విమర్శించేలా కౌంటర్లు చేయలేరనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అందుకే తిరిగి రావాలని షర్మిల నుంచి కాల్, అధికార ప్రతినిధుల బుజ్జగింపులు చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు. దీంతో లోటస్ పాండ్ వర్గీయులు ఇందిరా శోభన్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేరనేది స్పష్టమవుతోంది.
రేవంత్ హస్తం ఉందని అనుమానం
ఇటీవల టీపీసీసీ కార్యదర్శి కల్పన మృతిచెందడంతో ఆమెకు నివాళులర్పించేందుకు ఇందిరాశోభన్ వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఆమె కలవడం కూడా రాజీనామా నిర్ణయానికి దారి తీసి ఉండొచ్చని వర్గీయులు భావిస్తున్నారు. దీని వెనుక రేవంత్ కూడా ఉండి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇందిరాశోభన్‌ను కాంగ్రెస్ కోవర్టు అని వైఎస్సార్ టీపీ నుంచి నేతలను తరలించేందుకే వచ్చిందని కొందరు చర్చించుకుంటున్నారు.
ఇటీవల మీట్ ది ప్రెస్‌లో వైఎస్ షర్మిల తన పార్టీలో ఉన్నది నమ్మకస్తులేనని, ఆస్తులు కాపాడుకునేందుకు వచ్చినవారు కాదని ఇందిరాశోభన్, ఏపూరి సోమన్నను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తాజాగా ఇందిరాశోభన్ రాజీనామా చేయడంతో తను వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపూరి కూడా పార్టీని వీడుతారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే తనను వేరే పార్టీలో అయితే పాటగాడిగానే గుర్తిస్తున్నారని, అందుకే ఇక్కడే కొనసాగుతానని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు.