తియ్యని ద్రాక్ష.. ఆరోగ్యానికి రక్ష

by sudharani |
తియ్యని ద్రాక్ష.. ఆరోగ్యానికి రక్ష
X

దిశ, న్యూస్ బ్యూరో: ఓ 20 ఏండ్ల కిందట హైదరాబాద్‌కు చేరుకోవడానికి 50 కి.మీ. ముందే ద్రాక్ష తోటలు దర్శనమిచ్చేవి. ఆ తోటలను చూస్తూ బస్సు ప్రయాణం ఆహ్లాదకరంగా సాగేది. ప్రధానంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మెదక్‌ ఉమ్మడి జిల్లాలు.. ద్రాక్ష తోటల సాగుకు అత్యంత అనువైన ప్రదేశాలుగా ఉండేవి. నిజాం కాలంలోనే ఈ ప్రాంతమంతా ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి చెంది దేశ, విదేశాలకు సైతం ఎగుమతి చేసిన ఘనతను సొంతం చేసుకుంది. అక్బర్‌బాగ్‌, బాగ్‌ అంబర్‌పేట.. ఇలా బాగ్‌ పేరిట అనేక ప్రాంతాల్లో ద్రాక్ష తోటలుండేవని వాటి పేర్లను బట్టే తెలుస్తోంది. క్రమేణా నగరీకరణలో భాగంగా తోటలన్నీ కనుమరుగై ఎత్తయిన భవంతులు పుట్టుకొచ్చాయి. ద్రాక్ష పండ్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ సాగు విస్తీర్ణం పడిపోవడంతో పాటు దిగుబడి అడుగంటిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రభుత్వం సాగుబడిని నిర్దేశిస్తూ.. సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తోంది. కానీ వైవిధ్యమైన పంటల వైపు రైతులను అడుగులేయించే ప్రయత్నాలేవీ కొనసాగడం లేదు. కాగా యువ రైతాంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ద్రాక్ష దిగుబడి మంచి ఫలితాలనిస్తుందని అనుభవం కలిగిన ఆదర్శ రైతులు అభిప్రాయపడుతున్నారు.

మెకనైజేషన్‌ రావాలి

ద్రాక్ష సాగుకు తొలి పెట్టుబడి ఎక్కువ. ఆ పెట్టుబడి సాయం అందితే ఎంతో మంది రైతులు తోటల పెంపకానికి ముందుకొస్తారనేది ద్రాక్ష తోటల యజమానులు చెబుతున్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలు, యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల కూలీల సమస్య తగ్గి రైతాంగానికి మేలు కలుగుతుందని సూచిస్తున్నారు. స్ప్రేయర్లు, ట్రాక్టర్లు, పంపులు, డ్రిప్పులు వంటి వ్యవసాయ పరికరాలను సబ్సిడీ మీద అందించాలంటున్నారు. కోల్డ్‌ స్టోరేజీ, ప్యాకేజింగ్‌ యూనిట్లు అందుబాటులోకి తెచ్చి, శతాబ్దాల కిందటే ఎగుమతి జోన్‌లో ఉన్న ఈ ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విధాన రూపకల్పన చేయాలంటున్నారు.

ప్రత్యేకం ద్రాక్ష..

మన దగ్గరే పండించే ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలో పండించే ద్రాక్ష పంటలో 80 శాతం తాజా పండ్లుగా, 18 శాతం ఎండు ద్రాక్షగా, 2 శాతం వైన్‌, జ్యూస్‌గా వినియోగిస్తున్నారు. ద్రాక్ష వినియోగం ద్వారా మెరుగైన చర్మ సౌందర్యాన్ని పొందొచ్చని, పిల్లల్లోనూ చురుకుదనం పెరుగుతుందని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. గ్రీన్‌, బ్లాక్‌, రెడ్‌ కలర్స్‌లో లభించే ద్రాక్షలో ప్రొసైయానిడిన్స్‌, రిస్‌ వెరట్రాల్‌, క్యూరసెటిన్‌ వంటి ఫాలీపెనాల్స్‌ అధికంగా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్‌గా పని చేయడంతో పాటు వయసు పైబడిన లక్షణాలను కనబడనీయదని చెబుతున్నారు. ఒబేసిటీని నియంత్రించేందుకు ద్రాక్షలోని రిస్‌వెరట్రాల్‌ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు.

క్యాన్సర్‌ దూరం.. గుండె పదిలం

క్యాన్సర్‌ కారక కణాలను చంపడంతో పాటు బ్రెస్ట్‌, గొంతు, లివర్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా తక్కువ మోతాదులో బ్లడ్‌ గ్లూకోజ్‌ కూడా ఉందని పరిశోధనలో వెల్లడైందని శాస్త్రవేత్త జి.రాంరెడ్డి చెబుతున్నారు. ద్రాక్షలోని ఆంతోసైయనిన్‌ పిగ్‌మెంట్స్‌ లీటరుకు 5 మి.గ్రా. వాడినప్పుడు శరీరంలోని ట్యూమర్‌కు కారణమైన కణాల పెరుగుదలను అరికడుతుందన్నారు. ద్రాక్షలోని ఫెనోలిక్స్‌ శరీరంలోని లోడెన్సిటీ లిపొప్రోటీన్‌(ఎల్‌డీఎల్‌) ఆక్సిడేషన్‌ తగ్గించి ప్లేట్‌లెట్స్‌ను కూడగట్టుకోకుండా నిరోధించి కొరొనరి హార్ట్‌ డిసీజ్‌(సీహెచ్‌డీ) రాకుండా కాపాడుతుంది. రెడ్‌వైన్‌ను మోతాదులో తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి అధిక రక్తపోటు వల్ల వచ్చే అలజడిని తగ్గిస్తుంది. శాట్యురేటెడ్‌ కొవ్వు పదార్ధాల వల్ల వచ్చే హానికర ఇబ్బందులను తగ్గిస్తుంది.

ద్రాక్ష రకాలు
జ్యూస్‌ వెరైటీస్‌ : బెంగుళూరు బ్లూ, పూనవరంగ్‌
గ్రీన్‌ వెరైటీస్‌ : థామ్సన్‌ సీడ్‌లెస్‌, ఎ17/3, రిజమత్‌, రెడ్‌గ్లోబ్‌, ఫ్లేం సీడ్‌లెస్‌
రేసిన్స్‌ వెరైటీస్‌ : ఆర్కావతి, థామ్సన్‌ సీడ్‌లెస్‌
వైన్‌ వెరైటీస్‌ : శిరాజ్‌, జిన్‌ఫండెల్‌, క్యాబర్‌నెట్‌ సావిగ్నన్‌, చెనిన్‌ బ్లాంక్‌
టేబుల్‌ వెరైటీస్‌ : అనాబ్‌ ఇషా, కిష్‌మిష్‌ రిజోవిజ్‌, కిష్‌మిష్‌ కోర్ని

ద్రాక్ష సాగుకు ఎంతో అనువైనవి : డా.జి.రాంరెడ్డి, శాస్త్రవేత్త, ద్రాక్ష పరిశోధన కేంద్రం, వ్యవసాయ యూనివర్సిటీ

ద్రాక్ష పళ్లను వైన్‌, జ్యూస్‌, ఎండు ద్రాక్ష(కిష్‌మిస్‌)గానూ వినియోగించొచ్చు. ద్రాక్ష ఉపయోగాల గురించి క్రీస్తు పూర్వం 1356-1220 మధ్య రాసిన సుశృత సంహిత, చరక సంహిత వైద్య గ్రంధాల్లోనూ పొందుపరిచారు. జీర్ణ శక్తిని పెంచుకునేందుకు ద్రాక్ష జ్యూస్‌ బాగా ఉపయోగపడుతుంది. పొడిదగ్గు, క్షయ, రక్తహీనత, హెపటైటిస్‌ వంటి రోగాల నివారణకు డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. ద్రాక్షలో పండు మీద తొక్క(ఆర్‌ఐఎన్‌డి), విత్తనాల్లో ఉండే ఫినాలిక్‌ పదార్ధాలు కూడా ఔషద గుణాలు కలిగి ఉన్నాయి. తెలంగాణలో నల్లగొండ, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలు ద్రాక్ష సాగుకు ఎంతో అనుకూలం. పెట్టుబడి ఎక్కువని సాగు చేయడం లేదు. ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా పూర్వ వైభవం సాధ్యమవుతుంది.

ట్యాక్స్‌ బెనిఫిట్స్‌మేలు: పి.ఉపేందర్‌రెడ్డి, ద్రాక్ష రైతు, లక్ష్మాపూర్‌, మూడుచింతలపల్లి మండలం, మేడ్చల్‌ జిల్లా

ఈ ప్రాంతం ఎక్స్‌పోర్ట్ జోన్‌. ఇన్వెస్ట్‌ పెరిగిందని రైతులు ద్రాక్ష తోటల సాగుకు ఆసక్తి చూపడం లేదు. ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ఇస్తే ఎంతో మంది యువకులు ముందుకొచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో అటవీ భూములు వందలాది ఎకరాల్లో బీళ్లుగా ఉన్నాయి. వాటిని రైతు గ్రూపులకు లీజుకు ఇవ్వడం ద్వారా కూడా ద్రాక్ష తోటల పెంపకాన్ని పెంపొందించొచ్చు. ఉద్యానవన శాఖ రైతుల అవసరాలను గుర్తించి పథకాలు రూపొందించాలి. పలుకుబడి ఉన్నోళ్లకు ట్రాక్టర్లు ఇవ్వడం కాదు. అవసరాలు ఉన్న రైతులను గుర్తించాలి. యూత్‌ను అట్రాక్ట్‌ చేసే పథకాలు రూపొందించాలి. నేను 2001 లోనే రూ.లక్ష జీతాన్ని వదులుకొని ద్రాక్ష తోటలు సాగుచేసిన. తూంకుంట దగ్గర ద్రాక్ష ప్యాకేజింగ్‌ హౌజ్‌ ఉండేది. ఇప్పుడది ఫంక్షన్‌ హాల్‌గా మార్చారు. జహీరాబాద్‌లో కోల్డ్‌ స్టోరేజీ ఉంటే అమ్మేసుకున్నారు. ప్రభుత్వం ద్రాక్ష తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎగుమతి ఉత్పత్తుల సామర్ధ్యం పెరుగుతుంది.

చిన్న విస్తీర్ణాల్లోనూ ప్రోత్సహించాలి: చంద్రమోహన్‌రెడ్డి, పోతారం, శామీర్‌పేట మండలం, మేడ్చల్‌ జిల్లా

ద్రాక్షలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. దిగుబడిని వరుసగా పొందొచ్చు. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. 2008లోనే ద్రాక్ష సాగులో అంతర్జాతీయ స్థాయి అవార్డులు పొందాం. ఐతే 5 ఎకరాలకు పైగా ఉంటేనే సాగు చేయాలన్న అపోహ ఉంది. కానీ మహారాష్ట్రలో ఎకరా, రెండెకరాల్లోనూ సాగు చేస్తున్నారు. కూరగాయల సాగులో పందిర్లు వేసేందుకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. అలాగే ద్రాక్ష తోటల రైతులకు అందించాలి. లాక్‌డౌన్‌లో మేం అమ్ముకోవడం ఇబ్బందిగా మారింది. అదే స్టోరేజీ గోడౌన్లు అందుబాటులో ఉంటే నష్టపోయేవాళ్లం కాదు. తెంచకపోతేనేమో చెట్లకు ప్రమాదం. 140 రోజులకే చేతికందే పంటను తెంచకపోతే ఆ తీపి చెట్లకు విషంగా మారుతుంది. ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా ద్రాక్ష తోటల పెంపకానికి రైతాంగం ముందుకొస్తారు.

Advertisement

Next Story

Most Viewed