Pahelgam attack: పహెల్గాం దాడి.. భారత్ విషయంలో మరోసారి చైనా అసలు రంగు?

by Prasad Jukanti |   ( Updated:2025-04-24 09:15:10.0  )
Pahelgam attack: పహెల్గాం దాడి.. భారత్ విషయంలో మరోసారి చైనా అసలు రంగు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకాశ్మీర్ పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడిని (Pahelgam Attack) భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ మారణహోమాన్ని సృష్టించిన వారిని, దాడి సూత్రధారులను వదిలేది లేదని హెచ్చరించింది. అయితే ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తుండగా అందరి చూపు మాత్రం చైనా వైపు మళ్లుతోంది. భారత్ విషయంలో చైనా (China) తరచూ డబుల్ గేమ్ ఆడటం అలవాటుగా మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాంటి చైనా పహెల్గాం దాడి తర్వాత జరగబోయే పర్యవసానాల విషయంలో ఎలా వ్యవహరించబోతున్నది అనేది సస్పెన్స్ గా మారింది.

పాక్ కు చైనా వత్తాసు..

తాజా ఉగ్రదాడి వెనుక ఉన్నది దాయాది దేశం పాకిస్తాన్ నే అనే నిర్ధారణకు వచ్చిన భారత ప్రభుత్వం (Indian Government) ఆ దేశం పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దు, వాఘా-అట్టార్జీ సరిహద్దు చెక్ పోస్టు తక్షణమే నిలిపివేత, సార్క్ వీసాల రద్దు, భారత్ లోని పాక్ హైకమిషన్ లో సలహాదారుల గుర్తింపు రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ దెబ్బతో సీమాంతర ఉగ్రవాదాన్ని సహించేది లేదని, పాక్ కు గట్టి బుద్ధి చెప్పడం ఖాయం అనే సంకేతాలను ఈ చర్యల ద్వారా భారత ప్రభుత్వం ఇచ్చినట్లైంది. అయితే ఈ విషయంలో భారత్ చేస్తున్న పోరాటానికి చైనా మద్దతుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్ కశ్మీర్ అంశంలో బరితెగించి ప్రవర్తించిన ప్రతిసారి చైనా తన మిత్రదేశమైన పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతూ వస్తోంది. విదేశీ శక్తులేవైనా దుందుడుకు చర్యలకు దిగితే తాము అండగా నిలుస్తామని చాలా సార్లు చైనా పాక్ కు అభయహస్తం ఇచ్చింది. తాజా ఉగ్రదాడిని చైనా పైకి ఖండించినా పాకిస్తాన్ విషయంలో భారత్ తీసుకోబోయే నిర్ణయాలకు ఏ మాత్రం సపోర్టుగా నిలుస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

చైనా అసలు రంగు బయటపడనుందా?

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) ఇటీవల పాకిస్తాన్ కు కశ్మీర్ చాలా కీలకమని ప్రపంచంలోని ఏ శక్తి కూడా కశ్మీర్ ను పాకిస్తాన్ ను వేరు చేయలేదని వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల్లోనే పహెల్గాం దాడి జరగడం కలకలం రేపింది. దీంతో ఈ దాడి వెనుక పాకిస్తాన్ అండదండలు ఉన్నాయని భారత్ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ పైకి నేరుగా సైనిక చర్యకు వెళ్లకుండా ఇతర మార్గాల్లో చిక్కుల్లో పెట్టేందుకు భారత్ ఎత్తుగడ వేసింది. అయితే ఇక్కడే చైనా అసలు రంగు బయటపడబోతున్నదా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన ప్రతీకార సుంకాలు డ్రాగన్ కంట్రీని షాక్ కు గురిచేశాయి. అంతకు ముందు తలబిరుసు తనంతో భారత్ పట్ల వ్యవహారించే చైనా ట్రంప్ నిర్ణయం దెబ్బకు వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు పెద్ద స్కెచ్చే వేశారు. ఆసియా దేశాలన్నీ ఒక ఫ్యామిలీగా ఉందామని కలిసి పని చేద్దామని ఆ దేశం పిలుపునిచ్చింది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా బార్డర్ లో అనేక సార్లు భారత్ తో నేరుగా బాహాబాహీకి దిగుతూ వస్తున్న చైనా సుంకాల దెబ్బతో భారత్ తో సహా ఆసియా దేశాలంతా కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చింది. ఇయితే ఇదంతా ఒక వైపు అయితే ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలపై చైనా ఎలా రియాక్ట్ కాబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. పాకిస్తాన్ తో ఉన్న స్నేహబంధం కారణంగా భారత్ విషయంలో చైనా మరోసారి తన అసలు రంగు బయట పెట్టుకుంటుందా లేక ఇది భారత్ పాకిస్తాన్ కు మధ్య జరుగుతున్న వ్యవహారం అనుకుని మౌనం వహిస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.



Next Story

Most Viewed