మిస్సింగ్ కేసులపై చర్యలేవి : హైకోర్టు

by Anukaran |   ( Updated:2020-11-05 05:39:52.0  )
మిస్సింగ్ కేసులపై చర్యలేవి : హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రోజువారీగా కనిపించకుండా పోతున్న బాలికలు, చిన్నారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు, పాఠశాలలకు వెళ్లిన బాలికలు, ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులే మిస్సింగ్ లిస్ట్‌లో ఎక్కువగా ఉన్నారు.

హైదరాబాద్ మహానగరంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ మహేందర్ రెడ్డి ఎన్నిమార్లు ప్రకటించినా.. నగరంలో మిస్సింగ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తమ పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లారంటే క్షేమంగా తిరిగి వచ్చేవరకు తల్లిదండ్రులు క్షణం క్షణం ఒక యుగంగా గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు.

తాజాగా హైదరాబాద్‌లో మిస్సింగ్ కేసులపై రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మిస్సింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం, పోలీసు విభాగం పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014-2019 మధ్య కాలంలో సుమారు 8 వేల మంది కనిపించకుండా పోయారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వం, నగర పోలీసు యంత్రాంగంపై సీరియస్ అయింది. మిస్సింగ్ కేసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. కాగా, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Advertisement

Next Story

Most Viewed