- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వ తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేర్వేరు పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించడంలేదని వ్యాఖ్యానించింది. ఇవి అమలుకాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టక తప్పదని హెచ్చరించింది. ఇందుకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను కూడా బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 లోగా పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయడంతో పాటు తదుపరి విచారణకు వీరిద్దరూ వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా రాష్ట్రంలో కరోనా ర్యాండమ్ పరీక్షలు జరగకపోవడంపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తగిన సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల సరఫరా లేనందువల్లనే వైద్యులకు కరోనా సోకి ఉండవచ్చని అభిప్రాయపడింది. ప్రతీరోజూ కరోనా కేసులకు సంబంధించి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం విడుదల చేస్తున్న బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఉంటున్నాయని, వాస్తవాలను దాచిపెడితే కరోనా తీవ్రత ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినట్లయితే మృతదేహాలకు పరీక్షలు చేయాలని గతంలో ఇదే కోర్టు ఆదేశించిందని, కానీ అది ఎందుకు అమలు కావడంలేదని ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.
దీనికి ఆయన బదులిస్తూ, ఈ తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఇంకా విచారణకు రాలేదని వివరించారు. బెంచ్ జోక్యం చేసుకుని సుప్రీంకోర్టులో సవాలుచేసినా విచారణ జరిగేంతవరకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాల్సిందేగదా అని వ్యాఖ్యానించింది. ఇకపైన మీడియా బులెటిన్లలో తప్పుడు గణాంకాలు వచ్చినట్లు రుజువైతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. కరోనా కేసుల గణాంకాలను పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా మాత్రమే కాకుండా వెబ్‌సైట్ల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలకు చేరడమే లక్ష్యంగా ఉండాలని ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. కరోనా తీవ్రత రోజురోజుకూ ఏ విధంగా పెరుగుతూ ఉందో ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించింది. కరోనా నివారణకు అవసరమైన జాగ్రత్తలను తీసుకునేలా ప్రజల్లో చైతన్యం పెంచి అప్రమత్తం చేయాలని పేర్కొంది. గణాంకాలను, వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా మరింత ప్రమాదమే వస్తుందని వ్యాఖ్యానించింది.