వినాయక చవితి, నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Anukaran |
వినాయక చవితి, నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మతపరమైన సెంటిమెంట్లను గౌరవించడం, పాటించడం మంచి పద్ధతేగానీ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా అంతే ముఖ్యమైనదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

గతేడాది అమలుచేసిన ఆంక్షలను ఈ ఏడాదీ కొనసాగించాలనే అభిప్రాయాన్ని ఇటీవల వ్యక్తం చేసిన హైకోర్టు బెంచ్ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నదీ సెప్టెంబరు 1వ తేదీ వరకు నివేదికలో తెలియజేయాలని ఆదేశించింది. ఒకవేళ నివేదిక సమర్పించని పక్షంలో జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీసు కమిషనర్ స్వయంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

వినాయక చవితి సందర్భంగా గణేశ్ విగ్రహాలను, దసరా సందర్భంగా దుర్గామాత విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారని, ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని, ఈ కారణంగా రంగులతో కాలుష్యం ఏర్పడుతోందని న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన సందర్భంగా హైకోర్టు బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హాజరై కరోనా తీవ్రత కారణంగా వినాయక చవితి పండుగకు మట్టి గణపతులను పూజిస్తూ ఇళ్ళల్లోనే నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రజలకు సూచిస్తామని తెలిపారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన బెంచ్ జోక్యం చేసుకుని, గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వం చేయాల్సింది సూచనలు కాదని, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని నొక్కిచెప్పింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదేగానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని పేర్కొన్నది.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా భారీగా జనం గుమ్మిగూడకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనున్నదో తెలియజేయాలని హైకోర్టు ప్రశ్నించింది. హుస్సేన్ సాగర్ ఇప్పటికే కలుషితమైందని, రసాయనిక రంగులతో కూడిన విగ్రహాల నిమజ్జనం జరిగితే ఇంకా కలుషితం అవుతుందని, అది జరగకుండా ఎలా నిరోధిస్తారో చెప్పాలని నిలదీసింది.

పూర్తి వివరాలతో సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను హైకోర్టు బెంచ్ ఆదేశించింది. ఒకవేళ కౌంటర్ దాఖలు చేయకపోతే జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి ఉన్నతాధికారులు హాజరు కావాల్సి వస్తుందని స్పష్టం చేసి తదుపరి విచారణను సెప్టెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed