- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ.. ఆత్మరక్షణలో ప్రభుత్వం
జగన్ సర్కారుకు హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సర్కారు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోలపై అభ్యంతరాలు తెలుపుతున్నది. ఆ జీవోలు ఆమోదయోగ్యంగా లేవని కొట్టి పారేస్తున్నది. దీంతో సర్కారు ఇరకాటంలో పడుతున్నది. ఇటీవల ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి జీవో వివాదాస్పదమవుతున్నదని హైకోర్టు పేర్కొన్నది. మూడు రాజధానుల బిల్లు నుంచి తాజాగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల ఖరారు అంశం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో సర్కారు ఆత్మరక్షణలో పడింది. కొన్ని బిల్లులను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంది. మరి కొన్నింటిని రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నది.
దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కారుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం తెచ్చిన జీవో నంబర్ 53, 54లను కొట్టి వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు ఎంత ఉండాలో మీరెలా నిర్ణయిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముందు రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల అభిప్రాయం తీసుకున్నాక మాత్రమే ఫీజుల నియంత్రణపై ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించింది.
ఇదే మొదలు కాదు
ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాల్లో ముఖ్యమైన ప్రభుత్వం, కోర్టు రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలను టెక్నికల్ లోపాల వల్లనో, అసంబద్ధమైన నిర్ణయాల వల్లనో కోర్టు తప్పుబడుతూ వస్తున్నది. మూడు రాజధానుల బిల్లు కావొచ్చు, రహస్య జీవోల వ్యవహారం కావొచ్చు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు.. ఇలా ప్రభుత్వం చేపట్టిన పనులకు కోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
మూడు రాజధానుల బిల్లు వెనక్కి
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లుకు మొదటి నుంచీ సాంకేతిక అంశాల లోపాల కారణంగా కోర్టులో ఎదురు దెబ్బలు తగిలాయి. అవి ఏస్థాయిలో అంటే.. సరిదిద్దుకోలేక ఈ బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సివచ్చింది. భవిష్యత్తులో లోపరహితంగా మరో బిల్లు తెస్తామని ప్రభుత్వం పేర్కొంటున్నది. అది ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.
ఏది రహస్యమో చెప్పండి
రాష్ట్ర సర్కారు కొంతకాలంగా విడుదల జేస్తున్న బ్లాంక్ జీవోల వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోల్లో కొన్నింటిని మాత్రమే వెబ్ సైట్‌లో పెట్టి మరికొన్నింటిని పెట్టకుండా దాచేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అసలు ఏది రహస్యమనే విషయంపై ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. ముఖ్యంగా ఏది రహస్యం, ఏది అతి రహస్యమన్నది ఎలా నిర్ధారిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు గతంలో హైకోర్టుకు హామీ ఇచ్చి ఇప్పుడు వెబ్‌సైట్‌లో అన్ని జీవోలు ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సాఫీగా సాగే ప్రక్రియకు ఆటంకాలు కల్పిస్తారా? అని సర్కార్‌ను నిలదీసింది. ప్రభుత్వం తయారు చేసిన అన్ని జీవోల వివరాలు తమకు సమర్పించాలని ఆదేశాలిచ్చింది.
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేంటి?
ప్రభుత్వ భవనాలకు, అలానే చెత్త నుంచి సంపద కేంద్రాలకు వైసీపీ రంగులెయ్యడం మీద కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం పని అంటూ తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహానికి జగన్ ప్రభుత్వం దిగొచ్చింది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయబోమంటూ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు.
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీన వివాదం
రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయించిన వైసీపీ సర్కార్ గతంలో ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని ఎయిడెడ్ విద్యాసంస్థల అభిప్రాయాలతో సంబంధం లేకుండా విలీనం చేసేందుకు విద్యాశాఖాధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేసింది. ప్రభుత్వ హెచ్చరికలతో విద్యాసంస్థలు నడపలేని పరిస్థితి ఉందంటూ వారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ప్రభుత్వ న్యాయవాదిని ఏం జరుగుతున్నదంటూ ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఏ నిబంధనల ప్రకారం ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనం కోసం ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో సర్కార్ ఇరుకునపడింది. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం అనేది కేవలం స్వచ్ఛందం అంటూ హామీ ఇచ్చింది.
ప్రైవేట్ కాలేజీలకు మీరెలా ఫీజులు నిర్ణయిస్తారు?
హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 24న తీసుకొచ్చిన జీవోలు 53,54లను హైకోర్టు తోసిపుచ్చింది. మేనేజ్‌మెంట్ నుంచి ప్రతిపాదనలు తీసుకుని కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, ఇతర విద్యాసంస్థల యాజమాన్యం జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫీజులు ఖరారు చేసేముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, విద్యాబోధనకు అయ్యే ఖర్చుపై ఆలోచించి విడుదల చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన జీవోలతో విద్యాసంస్థల నిర్వహణ, మెరుగైన బోధన సాధ్యం కాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యాబోధనపై సంతృప్తి చెందిన తర్వాతే తల్లిదండ్రులు పిల్లలను స్కూల్లో చేర్పిస్తారన్న విషయాన్ని ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. దీంతో ఇరు వాదనలు విన్న ధర్మాసనం జీవోలను తోసిపుచ్చుతూ తీర్పు వెల్లడించింది.
సినిమా టికెట్ రేట్లు తగ్గింపు జీవో 35
రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.35తో తమకు దివాళా తప్పదు అంటూ థియేటర్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దాంతో న్యాయస్థానం ఆ జీవోను పక్కన పెట్టింది. అయితే ప్రభుత్వం కేవలం కోర్టుకు వెళ్లిన థియేటర్ల వరకే మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పడంతో మరలా థియేటర్ ఓనర్స్ కోర్టుకు వెళ్లారు. దాంతో అందరికీ ఇదే వర్తిస్తుంది అని కోర్టు చెబుతూ విచారణ వాయిదా వేసింది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఒక్క సెంటు స్థలంలో పేదలకు ఇళ్లు ఎలా కడతారు అనీ, అమరావతిలో స్థానిక ఎన్నికలు ఎందుకు జరపలేదు అనే అంశంపైనా ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై గట్టిగానే స్పందించింది.
లోపం ఎక్కడ జరుగుతోంది?
ఈ వరుస సంఘటనల వల్ల ప్రభుత్వం తప్పు ఎక్కడ చేస్తున్నదని నిపుణులు విశ్లేషణలో పడ్డారు. వారు చెబుతున్న దానిని బట్టి సర్కార్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కోసారి బూమ్ రాంగ్ అవుతున్నాయని అంటున్నారు. మరికొన్ని నిర్ణయాలు పేదలకు మంచి చేద్దాం అని తీసుకుంటున్నా అవి హడావుడిగా అమలు చేద్దామని అనుకోవడం వల్ల లీగల్‌గా ఉన్న సమస్యల గురించి పట్టించుకోక పోవడంతో కోర్టులో ప్రభుత్వం ఎదురు దెబ్బలు తినాల్సి వస్తున్నదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుని కోర్టు దగ్గర తన నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ తెచ్చు కుంటుందో చూడాలి.