ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రికార్డు అమ్మకాలు సాధించిన హీరో కంపెనీ

by Harish |
hero electic 1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల్లో మొత్తం 15 వేల హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్లను విక్రయించినట్టు ప్రకటించింది. ఇది భారత్‌లోని అన్ని ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకంటే అత్యధికమని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. జేఎంకే రీసెర్చ్ ప్రకారం.. జూలైలో 4,500ల ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రికార్డు అమ్మకాలతో కొవిడ్ సెకెండ్ వేవ్ మహమ్మారి నుంచి రికవరీని సాధించినట్టు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే వంద శాతం వృద్ధి సాధించాలని భావిస్తున్నట్టు, ఏడాదికి 3 లక్షల యూవీలను తయారు చేసేందుకు హీరో కంపెనీ తన తయారీ సదుపాయాలను విస్తరించనున్నట్టు గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి విధానాల అమలు కారణంగా డిమాండ్ అధికంగా ఉందని కంపెనీ అభిప్రాయపడింది. హీరో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఆదరణ ఉన్న ఆప్టిమా, నైక్స్ స్కూటర్లు రూ. 53,600 ధరలో లభిస్తున్నాయని, వీటికి డిమాండ్ అధికంగా ఉందని కంపెనీ తెలిపింది. ఇది ఇంకా పెరుగుతుందని, గత కొన్ని నెలలుగా వీటి బుకింగ్‌లు భారీగా పెరిగాయని పేర్కొంది. ‘జూన్ రెండో వారం నుంచి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ 10 రెట్లు పెరిగాయి. దాదాపు 8 ఏళ్లు హీరో ఎలక్ట్రిక్ డీలర్ల చరిత్రలో అత్యంత రద్దీని గత నెలలో చూశాం. స్టోర్లలో మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఈ స్కూటర్ల గురించి వినియోగదారులు వివరాలు తెలుసుకుంటున్నారని’ హీరో ఎలక్ట్రిక్ డీలర్ రాజేష్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed