లెట్స్ లెర్న్.. క్రికెట్ విత్ వొకాబులరీ

by  |
లెట్స్ లెర్న్.. క్రికెట్ విత్ వొకాబులరీ
X

దిశ, ఫీచర్స్ : ఇండియాలో క్రికెట్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు.. సెలబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకు అందరూ టీవీ ముందు వాలిపోవాల్సిందే. ఇక వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ కలిగిఉన్న ‘ఐపీఎల్’ సంగతి సరేసరి.‌ అయితే క్రికెట్‌ను చూసి ఆస్వాదించే వారు కొందరైతే.. 360 డిగ్రీస్‌లో బ్యాట్స్‌మెన్ ఆడే షాట్స్, టెక్నిక్‌తో బౌలర్ విసిరే బంతులను చూస్తూ గేమ్ నేర్చుకునేవారు మరికొందరు. ఇదే క్రమంలో కామెంట్రీని ఎంజాయ్ చేసేవారూ లేకపోలేదు. సరే ఇందులో కొత్తేముంది అంటారా? అక్కడికే వస్తున్నా. క్రికెట్, కామెంట్రీ, వొకాబులరీ.. ఇవన్నీ మిక్స్ చేసి ‘ఇంగ్లీష్’ నేర్పిస్తే ఎలా ఉంటుంది? థాట్ క్రేజీగా ఉంది కదూ! తమిళనాడు, చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విఘ్నేశ్వరన్ అదే చేస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌ల సమయంలో కామెంటేటర్స్ ఉపయోగించే పదాలను వివరిస్తూ, తన యూట్యూబ్ చానెల్ ‘లెట్స్ లెర్న్’ ద్వారా వేలాది మంది భారతీయులకు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో సాయం చేస్తున్నాడు.

భాష ఎల్లప్పుడూ మార్పునకు గురవుతూ అభివృద్ధి చెందుతుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త పదాలను చేర్చుకుంటుంది. ఇది ఏమాత్రం చెడ్డ విషయం కాదు. అయితే భాషతో పాటు ప్రపంచం కూడా మారుతుంది. ఈ క్రమంలో స్థానికంగా నివసిస్తున్నా విదేశీయులతో కమ్యూనికేషన్ కోసం భాష అవసరం. అందుకే గ్లోబల్ లాంగ్వేజ్‌‌గా అవతరించిన ఇంగ్లీష్ మన జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇది మీడియా ఇంటర్నెట్ భాష కావడంతో వినోదంతో పాటు పని కోసం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. ఇదిలా ఉంటే, చెన్నైకి చెందిన 27ఏళ్ల విఘ్నేశ్వరన్ కొన్నేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత ఆంగ్ల భాషపై పట్టు సాధించాలనుకున్నాడు. ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ చేయడమనేది ఒకరి జీవితాన్ని ఎలా ప్రభావవంతంగా మారుస్తుందో స్వయంగా చూడటమే కాక ప్రయోజనం పొందిన తను.. ఇతరులు ఈ భాషలో మాట్లాడేందుకు దోహదపడాలనుకున్నాడు. అయితే ఇంగ్లీష్ రావాలంటే ముందుగా ఒకాబులరీపై పట్టు సాధించాలి. అందుకే విఘ్నేశ్వరన్ పదబంధాలపై ఎక్కువగా దృష్టిపెట్టాడు.

రొటీన్‌కు భిన్నంగా :

ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే గల్లీకో ‘స్పోకెన్ ఇంగ్లీష్’ ఇన్‌స్టిట్యూట్ వెలిసింది. కానీ సంప్రదాయ పద్ధతుల్లో లెర్నింగ్‌ను ఎక్కువ మంది ఇష్టపడటం లేదనే విషయాన్ని గ్రహించాడు విఘ్నేశ్వరన్. ఈ ఆలోచనలో ఉండగానే మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించారు. ఇంటికే పరిమితం కావడంతో నిత్యం క్రికెట్ మ్యాచ్‌లు చూసేవాడు. ఆ టైమ్‌లోనే క్రికెట్ కామెంట్రీ వింటున్న తనకు హెలికాప్టర్ షాట్‌లాంటి ఐడియా తట్టింది. కామెంట్రీలో భాగంగా వ్యాఖ్యాతలు తరచుగా ఎన్నో ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తుంటారు. అందులో వినసొంపుగా ఉండే కొన్ని పదాల గురించి చాలామందికి తెలియవు. దీంతో ఆ పదబంధాన్ని వివరిస్తూ రెండు నిమిషాల వీడియోలను రూపొందించాలని విఘ్నేష్ ఫిక్స్ అయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్‌లైతే ఆసక్తికరంగా చూస్తారని గ్రహించిన విఘ్నేశ్వరన్.. కామెంట్రీకి వినోదాన్ని జోడిస్తూ ఆసక్తికరంగా, వినూత్నంగా ఇంగ్లీష్ నేర్పించడం మొదలుపెట్టాడు. తెలిసిన అంశాన్ని ఎంచుకుని, అందులో తెలియని కోణాన్ని తన వీడియోల ద్వారా చెప్పడంతో క్రికెట్ ప్రేమికులకు, ఆంగ్ల భాషపై పట్టు సాధించాలనుకునే వారికి అవి ఉపయుక్తంగా మారాయి.

శిక్షకుడిగా ప్రయాణం :

ఏడాది కాలంగా విఘ్నేశ్వరన్.. తన ‘లెట్స్ లెర్న్’ యూట్యూబ్ చానెల్‌ వీడియోల ద్వారా వీక్షకులకు శిక్షణనిస్తున్నాడు. ఈ క్రమంలో ‘గో డౌన్ టు ద వైర్, ఇంప్లోడ్, ఎక్స్‌ప్లోడ్ వాక్ ఇన్ ద పార్క్, హిట్ ద గ్రౌండ్ రన్నింగ్, గెట్ ఔట్ ఆఫ్ ఏ రట్, రెక్ హవోక్, అన్ డిస్ప్యూటెడ్’ వంటి పదబంధాలను బోధించడంతో పాటు ఈ పదాలను ఎలా ఉచ్చరించాలో వివరించాడు. ప్రస్తుతం అతడి చానెల్‌కు లక్ష మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా, ఇప్పటి వరకు తన ప్రయాణంలో దేశవ్యాప్తంగా 15,000 మంది గ్రాడ్యుయేట్ల వెర్బల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరిచాడు. ఒకసారి కామెంటేటర్ ‘హౌడిని చట్టం’ అనే పదాన్ని ఉపయోగించగా దీన్ని విఘ్నేశ్వరన్ ఇలా వివరించాడు. ‘హౌడిని ఒక ప్రసిద్ధ అమెరికన్ ఎస్కేప్ ఆర్టిస్ట్. ఇది అసాధ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయడాన్ని సూచిస్తుంది. IPL సందర్భంలో వ్యాఖ్యాతలు రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్‌లో హౌడిని చట్టాన్ని తీసివేసినట్లు ప్రస్తావించారు’ అని వీడియోలో తెలిపాడు. అయితే ఒక్క పదాన్ని విశ్లేషించేందుకు విభిన్న బ్లాగులు, వ్యాఖ్యాతల విశ్లేషణలను పరిశీలించే విఘ్నేష్.. ప్రాథమిక పరిశోధన కోసమే దాదాపు మూడు గంటలు వెచ్చిస్తుంటాడు. వాటిని ఇతరులకు నేర్పిస్తూ అందులో ఆనందాన్ని పొందుతున్నాడు.

ఎక్కడా ఇలా జరగలేదు..

‘చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత, ముగింపు వేడుకలో ఇండియన్ కామెంటేటర్ హర్షా భోగ్లే.. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఎలా గెలిపించారని(హౌ హి కంజ్యూరింగ్ ద విన్) అడిగాడు. ఆ పదం పట్ల ఆసక్తి కలిగింది. దానర్థం ఎక్కడా లేనివిధంగా ఏదో జరిగేలా చేయడం. అదో మాయాజాలం అనేది దాని గూడార్థం. అయితే అప్పటివరకు నా మనసులో ‘కంజ్యూరింగ్’ అనే పదం భయానక అర్థాన్ని మాత్రమే కలిగి ఉండగా, సీఎస్‌కే మ్యాచ్ తర్వాత నిజమైన మీనింగ్ తెలుసుకున్నాను. గత సీజన్‌లో పాయింట్ల పట్టికన చివరలో ఉన్న జట్టు ఈసారి టైటిల్‌ గెలుచుకోవడం అద్భుతమైన మలుపు. సీఎస్‌కే విజయం సాధించినప్పుడు ఆ మాయాజాలాన్ని అందరూ అనుభూతి చెందారు. క్రికెట్ నాకు చాలా నేర్పింది. అలాగే ‘లెట్స్ లెర్న్’ ద్వారా ఇతరులతో నా అభ్యాసాలను పంచుకోగలిగినందుకు సంతోషిస్తున్నాను. యూట్యూబ్‌లోని ఈ వీడియోలు కళాశాలలోని విద్యార్థులకు, ఇతరులకు వారి ఆంగ్ల పదజాలం, మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉంది.

– విఘ్నేశ్వరన్, లెట్స్ లెర్న్ ఫౌండర్

మీ పదజాలాన్ని మెరుగుపరుచుకునే చిట్కాలు :

1. ఆసక్తి గల ఫీల్డ్ :

క్రికెట్‌ను ఇష్టపడే విఘ్నేశ్వరన్ తన ఇంగ్లీష్ మెరుగుపరుచుకునేందుకు ఆ గేమ్‌ను ఉపయోగించుకున్నాడు. అదే విధంగా మీకు ఆసక్తి ఉన్న ఏదైనా అంశాన్ని మీరు ఎంచుకోవచ్చు.

2. పరిశీలన కీలకం:

మనం చదివిన, విన్న ప్రతీ అంశం నుంచి తెలియని పదాలు, పదబంధాలను కనుగొనేందుకు ప్రయత్నించాలి. ఈ పదాలను సంభాషణలో ఉపయోగించాలంటే ముందుగా దాని అర్థాన్ని తెలుసుకోవాలి.

3. పద మూలాన్ని అర్థం చేసుకోవాలి :

ఒక పదాన్ని ఎలా ఉచ్ఛరిస్తున్నారు. దాని మూలం ఏమిటి? దానిలో ఏదైనా ఇతర ఆసక్తికరమైన సమాచారం ఉందా? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. పదాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవడంలో ఇది మనకు సాయపడుతుంది.

4. రిఫరెన్స్ పాయింట్లను సృష్టించాలి :

పదాల అర్థాన్ని గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఎప్పుడైనా రిఫరెన్స్ పాయింట్‌ క్రియేట్ చేయాలి. పదం లేదా పదబంధాన్ని ఒక ఉదాహరణ లేదా సంఘటనకు లింక్ చేస్తే ఆ తర్వాత ప్రతీ దశలో గుర్తుంచుకునేలా ప్రయత్నించాలి.

5. సాధ్యమైన ప్రతి సందర్భంలోనూ ప్రాక్టీస్ చేయాలి :

వివిధ దృశ్యాల్లో మీరు నేర్చుకున్న పదాలు లేదా పదబంధాలను ఉపయోగించడం గురించి భయపడవద్దు. మీరు పదాలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే, దాని ఉపయోగం గురించి మరింత నమ్మకంగా ఉంటారు.

Advertisement

Next Story

Most Viewed