కూ.. కనెక్ట్ విత్ ఇండియన్స్

by Sujitha Rachapalli |
కూ.. కనెక్ట్ విత్ ఇండియన్స్
X

దిశ, ఫీచర్స్: రైతుల ఆందోళ‌న‌ల‌కు సంబంధించి ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తున్న అకౌంట్లను డిలీట్ చేయాల‌ని కేంద్రప్రభుత్వం ట్విట్టర్‌ ఇండియాను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఏ సోష‌ల్ మీడియా అయినా ఇక్కడి చ‌ట్టాల‌కు లోబ‌డి ఉండాల్సిందే అని సీరియ‌స్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ‘మీడియా సంస్థలు, జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులతో కూడిన ఖాతాలను బ్లాక్ చేయడం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్న ట్విట్టర్.. చట్ట ప్రకారం అలా చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించింది. కాగా ఈ కారణంగానే ట్విట్టర్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ జరుగుతుండగా.. మరోవైపు మేడ్ ఇన్ ఇండియా మైక్రో బ్లాగింగ్ యాప్ ‘కూ’ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం విశేషం. ఈ మేరకు కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ, రైల్వే మంత్రిత్వ శాఖ‌లతో పాటు ఇత‌ర ప్రభుత్వ శాఖ‌ల అధికారులు, అమాత్యులు ఇప్పటికే ‘కూ’లో త‌మ అకౌంట్లను ఓపెన్ చేసేశారు. దీంతో ఈ దేశీ యాప్‌కు విపరీతమైన ప్రాచుర్యం లభించింది. ఇంతకీ ‘కూ’ యాప్ ఎలా ఉంటుంది? ఆ మైక్రో బ్లాగింగ్ సైట్ ప్రత్యేకతలు ఏంటి? ఆ విశేషాలపై ప్రత్యేక కథనం.

ట్విట్టర్‌‌కు పోటీగా అందుబాటులోకి వచ్చిన దేశీ యాప్ ‘కూ’. ఇందులో మల్టిమీడియా కంటెంట్, ఆడియో క్లిప్స్‌ను షేర్ చేసుకోవచ్చు. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు సామాజిక అంశాలపై చర్చించవచ్చు. ఇందులో ఇంగ్లీష్‌ సహా ఆరు స్థానిక భాషల్లో తమ ఆలోచనలను వ్యక్తీకరించే అవకాశం ఉండగా.. ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ రెండు వెర్షన్స్‌‌లోనూ అందుబాటులో ఉంది. ట్విట్టర్ మాదిరిగానే పనిచేసే ఈ యాప్.. 11 నెలల క్రితం 2020 మార్చిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ట్యాగ్‌లైన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. 2020 ఆగస్టులో భారత ప్రభుత్వం నిర్వహించిన ‘ఆత్మనిర్భర్ యాప్’ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ఈ యాప్ గెలుచుకున్న విషయాన్ని ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో వెల్లడించారు. వాస్తవానికి ట్విట్టర్‌ ఫీచర్స్ అన్నింటినీ కాపీ చేసిన ‘కూ’ యాప్.. లోగో విషయంలోనూ ట్విట్టర్‌నే ఫాలో కావడం గమనార్హం. ట్విట్టర్‌లానే ‘కూ’ యాప్‌ లోగో కూడా ఓ ‘పిట్ట’ బొమ్మతోనే ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఎల్లో కలర్‌లో ఉంటుంది. ఆడియో-వీడియోల‌తో కూడిన నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోకల్’‌ను ప్రారంభించిన ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిడావత్కా.. ఈ ‘కూ’యాప్‌ను అభివృద్ధి చేశారు.

అనలిటిక్స్ ప్రొవైడర్ ‘సెన్సార్ టవర్’ సమాచారం ప్రకారం గత ఏడాది ట్విట్టర్‌ను 28 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేయగా, ‘కూ’ యాప్‌ను 2.6 మిలియన్ల మంది మాత్రమే డౌన్‌లోడ్ చేశారు. ఈ క్రమంలోనే కొన్ని సంవత్సరాలుగా ‘ట్విట్టర్’ ప్రభుత్వానికి ప్రధాన ప్రజాసమాచార సాధనంగా కొనసాగుతోంది. కానీ తాజాగా ట్విట్టర్‌తో కేంద్ర ప్రభుత్వ పోరు వల్ల వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, లా అండ్ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటు సభ్యులు తేజస్వి సూర్య, శోభా కరండ్లజే, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పతో పాటు ఎంతోమంది మినిస్టర్లు, హై ప్రొఫైల్ బిజినెస్ మ్యాన్స్, ప్రముఖులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఈ ‘కూ’ యాప్‌ను వాడటం మొదలుపెట్టారు. దాంతో ఫిబ్రవరి 6 – 11 వరకు, కూ ఇన్‌స్టాల్స్ 901,000 పెరిగినట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 10 మిలియన్లకు పైగా యూజర్లు ‘కూ’యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా.. ఈ లిస్టులో ఇషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్, మాజీ క్రికెటర్లు జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, ఇండియా పోస్ట్, నీతి ఆయోగ్, మైగోవిండియా, డిజిటల్ ఇండియా వంటి అనేక ప్రభుత్వ విభాగాల ఖాతాలు సైతం ఇటీవలే ఇందులో నమోదయ్యాయి. పీఐబీ ఇండియా, ఒటీవీ న్యూస్, న్యూస్ఎక్స్ టీవీ, రిపబ్లిక్ టీవీ వంటి కొన్ని మీడియా సంస్థలు కూడా చేరాయి.

‘భారతదేశంలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడగలరు. దాదాపు 1 బిలియన్ మందికి ఆ భాష తెలియదు. దీంతో స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న కోట్లాదిమంది ఇంటర్నెట్‌ బ్రౌజ్ చేయడానికి, ఇతరులతో కమ్యూనికేట్ కావడానికి ‘స్థానిక’ భాషలను కోరుకుంటున్నారు. అందుకే స్థానిక భాషలను అందించే యాప్స్‌ డౌన్‌లోడ్స్ పెరుగుతున్నాయి. అందువల్లే కూ ద్వారా భారతీయుల గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి ‘కూ’.. ఇంగ్లీష్, కన్నడం, తమిళం, మరాఠీ తెలుగు భాషల్లో అవలేబుల్‌గా ఉంది. బెంగాలీ, గుజరాతీ, ఒరియా, మలయాళీ, పంజాబీ, అస్సామీలు కూడా త్వరలోనే తమ భాషలో చర్చించవచ్చు. ట్విట్టర్‌లో 280 అక్షరాలు ఉపయోగించే వీలుంటే, ఇందులో 400 అక్షరాల వరకు రాసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని స్థానిక భాషలను అందుబాటులో ఉంచుతాం. 2021 ముగింపు వరకు 100 మిలియన్ల వినియోగదారులే లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని కూ ఫౌండర్స్ పేర్కొన్నారు.

కోకిల చేసే మధురమైన శబ్ధం ‘కూ’ ఆధారంగానే దీనికి ఆ పేరు పెట్టారు. మొదట ‘కుహూ’ అని పెట్టాలనుకున్నా.. ఆ పేరు కాస్త క్యాచీగా లేకపోవడంతో షార్ట్ చేసి ‘కూ’గా పెట్టారు. భారత సమాజంలో మంచి సందేశాలను వ్యాప్తిచేసే సంతోషకరమైన పక్షికి సూచికగా ‘పసుపు’ రంగును వాడటం విశేషం.

ఇదిలా ఉంటే బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్‌ కూడా ఇటీవలే ‘కూ’లో చేరింది. అయితే ఈ విషయాన్ని కంగన ట్విట్టర్‌ వేదికగానే తెలపడం కొసమెరుపు. ఈ అంశంపై ట్వీట్‌ చేసిన కంగన.. ‘ట్విట్టర్‌ ఇక నీ టైమ్‌ అయిపోయింది. ఇది ‘కూ’ యాప్‌కు మారాల్సిన సమయం. నా అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. దేశీయంగా తయారు చేసిన ‘కూ’యాప్‌ను వాడేందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’ అంటూ పేర్కొంది. దీంతో కంగన చేసిన ట్వీట్‌ ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

Advertisement

Next Story

Most Viewed