అవగాహన ఎక్కడ? హెచ్చరిస్తున్న హెల్త్​ స్పెషలిస్టులు

by Shyam |   ( Updated:2021-10-13 22:10:44.0  )
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా జన సమూహాలు జరుగుతున్నాయి. కరోనా తీవ్రత లేదనే కారణంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. మార్కెట్లు, షాపింగ్​ మాల్స్​, పార్కులు, పబ్​ లలో విపరీతంగా జనాలు జమ అవుతున్నారు. దీంతో పాటు రాజకీయ పార్టీలు పెట్టే సభలు, సమావేశాలు, ర్యాలీలకూ ఎక్కువ మంది ఒకే ప్రాంతంలో కలుస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో పార్టీలు, ఫంక్షన్లను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా జనాలు గుంపుగా ఏర్పడే కార్యక్రమాలను ప్రత్యక్షంగానే ప్రోత్సహిస్తున్నది. అభివృద్ధి పనులు పేరిట హైదరాబాద్​ లో ఎక్కువ మంది ఒకే దగ్గర కలిసేలా అధికారులు దగ్గర ఉండి మరీ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.

ముఖ్యంగా ట్యాంక్​ బండ్​ మీద ప్రతీ ఆదివారం నిర్వహించే సండే ఫన్​ డే ఈవెంట్​లో వేలాది మంది ఒకే దగ్గర మాస్కులు లేకుండా కలుస్తున్నారు. దీంతో కరోనా అంతమైందనే అభిప్రాయంలో ప్రజలున్నారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కు వేసుకోవాల్సిన జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, జనసమర్ధ, తదితర ప్రాంతాల్లో ఎక్కడా ధరించడం లేదు. ఈ ఏడాది జూన్​, జూలైలో 80 శాతం మంది మాస్కు ధరించగా.. ఆగస్టులో మాస్కు వేసుకునే వారి సంఖ్య 50 శాతానికి తగ్గింది. ప్రస్తుతం కేవలం 20 శాతం మంది మాత్రమే మాస్కును వేసుకుంటున్నారని ఆరోగ్యశాఖ ఇటీవల ప్రకటించింది. దీంతో పాటు భౌతిక దూరం అనే ముచ్చటనే మరిచారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ,హోటళ్లు, పబ్ లు, పార్కులలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వైరస్ వ్యాప్తి జరగకుండా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిన ప్రజలు బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రూల్స్​ గాలికి..

కరోనా వ్యాప్తి పెరగకుండా ప్రభుత్వం గతంలో ‘మాస్కు మస్టు ’అనే నిబంధనను తీసుకువచ్చింది. పబ్లిక్ ప్లేసేస్, షాపింగ్​ మాల్స్, తదితర జనసమర్ధ ప్రదేశాల్లో మాస్కును తప్పనిసరిగా ధరించాలని సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వుల రూపంలో ప్రకటించారు. దీన్ని సమర్ధవంతంగా అమలు చేయాల్సిన బాధ్యతను పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్లకు అప్పగించారు. మాస్కు ధరించని ప్రతి ఒక్కరికి రూ.1000 ని జరిమానాను విధించాలన్నారు. అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే మాస్కు ఫైన్ వేయాల్సిందేని సీఎస్ తేల్చి చెప్పారు. కానీ ఇటు పోలీసు, అటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ లు మాస్కు నిబంధనపై నామ మాత్రపు చర్యలు తీసుకుంటున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. గుర్తుకు వచ్చినప్పుడు అడఫాదడఫా డ్రైవ్ లు చేపట్టి ఫైన్లు వేస్తున్నారే తప్పా, రోడ్లపై మాస్కు లేకుండా వచ్చే ప్రతీ వ్యక్తికి జరిమానాలు వేయడం లేదు. మాస్కు మస్ట్ ఉత్తర్వులు వచ్చిన కొన్నాళ్లు రూల్స్ సక్రమంగా అమలైనా, ఆ తర్వాత మాత్రం వాటిని ప్రజలతో పాటు అధికారులు సైతం గాలికి వదిలేశారు. చేసేదేమీ లేక సర్కార్ కూడా చోద్యం చూస్తున్నది.

లక్షలాది మందితో పార్టీ సభలు..

మరో రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు గ్రేటర్​ హైదరాబాద్​ తో పాటు వివిధ జిల్లాల్లో లక్షలాది మందితో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేగాక ర్యాలీలనూ భారీ స్థాయిలో చేస్తున్నారు. వీటికి హజరవుతున్న 99 శాతం మంది ప్రజలు మాస్కు, భౌతికదూరం, శానిటేషన్ వంటి కరోనా నిబంధనలు పాటించడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉన్నదని పబ్లిక్​ హెల్త్​ స్పెషలిస్టులు చెబుతున్నారు. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రచారాలు ఆందోళనను కల్గించేలా ఉన్నాయి.

అవగాహన ఏదీ?…పబ్లిక్​ హెల్త్​ స్పెషలిస్టులు

కరోనా రూల్స్ పై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని పబ్లిక్​ హెల్త్ స్పెషలిస్టులు పేర్కొంటున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలు, పార్టీలు, తదితర కార్యక్రమాల్లో ప్రజలు గ్రూప్ గేదర్స్ అవుతున్నా, ఆఫీసర్లు నిమ్మకు నిరేత్తనట్టు వ్యవహరిస్తున్నారని ఓ డాక్టర్​ తీవ్రంగా మండిపడ్డారు. వైరస్ నియంత్రణకు కృషి చేయాల్సిన ప్రభుత్వ సిబ్బంది తమకేమీ సంబంధం లేనట్టు సైలెంట్ గా ఉంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే కొనసాగితే చాలా ప్రమాదరకమైన పరిస్థితి తలెత్తవచ్చని ఆందోళనను వ్యక్తం చేశారు.

Advertisement

Next Story