కేటీఆర్ రాక.. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

by Anukaran |   ( Updated:2021-07-10 03:05:34.0  )
కేటీఆర్ రాక.. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్ : నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా పోలీసులు ఎక్కడి వాహనాలను అక్కడ ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రావడంతో నారాయణపేట పట్టణమంతా కోలాహలంగా మారింది. దీనితో మహబూబ్‌నగర్, మక్తల్ తదితర ప్రాంతాల నుంచి నారాయణపేటకు రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ ఆపివేశారు. దాదాపుగా గంట సేపు వాహనాలను ఆపి వేయడంతో రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం, విధులకు హాజరయ్యేందుకు వెళ్లే ఉద్యోగులు వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహబూబ్‌నగర్ రోడ్డుపై నాలుగు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సహనం కోల్పోయిన పలువురు ప్రయాణికులు పోలీసులతో వాదనకు దిగారు. అయినా మంత్రి పాల్గొనే కార్యక్రమాలు ముగిసేవరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి, ఎమ్మెల్యే..

రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలవడంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. ప్రయోజనం లేకపోవడంతో వారు కాలినడకన కార్యక్రమాలు జరుగుతున్న చోటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీతో వాహనాలను ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed