రాష్ట్రానికి భారీ వర్ష సూచన

by Anukaran |
rainfall
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెండు రోజుల పాటు (జూన్ 12,13) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురియనున్నట్టు ప్రకటించింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని ఆయా జిల్లాల కలెక్టర్లను హెచ్చరించారు. కాగా, జూన్ నెలలో ఇప్పటికే సాధారణ వర్షాపాతాన్ని అధిగమించి భారీగా వర్షాపాతం నమోదైంది.

ఉత్తర బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో రెండు రోజుల పాటు (జూన్ 12,13) రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని వివరించారు. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు మధ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తామని తెలిపారు. వరదలు రావడం, పిడుగులు పడటం వంటి ప్రమాదాలు చోటు చేసుకోవచ్చని హెచ్చరించింది.

కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం

నేడు, రేపు రాష్ట్రానికి భారీ వర్ష సూచనలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. భారీ ఈదరు గాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి రాహుల్ బొజ్జ కలెక్టర్లకు తెలియజేశారు. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తే అవకశామున్నందున ఈ మేరకు ముందస్తుగానే ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చెట్లు, కరెంట్ పోల్ లు, రోడ్లు ధ్వంసమయ్యే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెరువుకట్టలు తెగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాలో ఈ ప్రభావాలన్ని అధికంగా ఉండే అవకాశాలున్నాయని హెచ్చరించారు. విపత్తులు తలెత్తితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల వారిగా ఎప్పటికప్పుడు వర్షం వివరాలను ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని చెప్పారు.

జూన్ లో భారీగా వర్షాపాతం నమోదు

ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనే భారీగా వర్షాపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల మొత్తం సాధారణ వర్షాపాతం 28.8 మీ.మీ ఉండగా జూన్ 11 నాటికి 72.9 మీ.మీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలో సాధారణ వర్షాపాతం 31.4 మీ.మీ ఉండగా ఇప్పటికే 167.2 మీ.మీ వర్షాపాతం నమోదైంది. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో సాధారణ వర్షాపాతం 20.8మీ.మీ ఉండగా ఇప్పటి వరకు 10మీ.మీ వర్షాపాతం నమెదైంది.

Advertisement

Next Story

Most Viewed