- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ రైతుకు ‘నిమ్మ’లం లేదు!
దిశ, నల్లగొండ: నకిరేకల్ నిమ్మకాయలకు ప్రసిద్ధి. నకిరేకల్ అంటే నిమ్మ అనే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలోనే ఏకైక నిమ్మ మార్కెట్ ఒక్క నకిరేకల్ ప్రాంతంలోనే ఉంది. నిత్యం వంద టన్నుల నిమ్మకాయలు మార్కెట్‌కు వస్తుంటాయి. ఇంతవరకు చెప్పుకునేందుకు బాగానే ఉంది. కానీ, నిమ్మ తోటలను సాగు చేసే రైతులు మాత్రం నిమ్మ పేరు చెబితేనే వణికిపోతున్నారు. రూ. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన తోటలు.. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఈసారి బాగానే కాశాయి. కానీ, ‘తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచినట్టుగా’ తోటల సాగుకు చేసిన అప్పలు తీరుతాయని భావించిన రైతులకు ప్రస్తుత నిమ్మ ధరలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది నిమ్మ దిగుబడులు లేక అల్లాడిన రైతులకు ఈసారైనా కాలం కలిసొస్తుందనుకుంటే.. నిమ్మ ధర అఘాతాన్నే మిగిల్చింది. గతేడాది ఒక్కో నిమ్మ బస్తాకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 పైగానే పలికింది. ఈసారి మాత్రం అసలు కొనే దిక్కు లేకుండా పోయింది.
గతేడాది రూ. వెయ్యి నుంచి..
నకిరేకల్ మార్కెట్ రాష్ర్టంలోనే ఏకైక నిమ్మ మార్కెట్. నకిరేకల్ ప్రాంతంలో 30 వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగవుతున్నాయి. నకిరేకల్ ప్రాంతంలో 10 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ప్రస్తుతం నిత్యం 100 టన్నుల నిమ్మకాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. ఇవిగాక హైదరాబాద్ మార్కెట్‌కు 10 నుంచి 30 టన్నుల వరకు వెళ్తున్నాయి. దేశం మొత్తానికి నకిరేకల్ ప్రాంతం నుంచే అధికంగా నిమ్మకాయలు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం ఒక్క నిమ్మబస్తా(24 కేజీలు)కు రూ.250 నుంచి రూ.400 ధర పలుకుతుంది. గతేడాది ఇదే సీజన్‌లో ఒక్కో బస్తాకు రూ.వెయ్యి నుంచి రూ.1500 ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్ ధరలను చూస్తే రైతుల వెన్నులో వణుకుపుడుతోన్నది.
బూడిదలో పోసిన పన్నీరుగా..
మార్కెట్‌లో ఎన్నడూ లేని విధంగా సీజన్‌లో నిమ్మధరలు పాతాళానికి పడిపోయాయి. రూ. వేలకు వేలు ఖర్చు చేసి సాగు చేసిన నిమ్మతోటలు రైతులకు అప్పుల కుప్పలనే మిగిల్చాయి. ఒక్కో రైతు ఎకరం విస్తీర్ణానికి నెలలో నాలుగుసార్లు పురుగు మందులను పిచికారీ చేయాల్సి ఉంటుంది. మూడుసార్లు పిండి పెట్టాలి. కలుపు కూళ్లు అన్నీ కలుపుకుని సంవత్సరానికి ఎకరానికి రూ.50 వేలు ఖర్చువుతది. పెట్టిన పెట్టుబడికి రూ.10 వేల నుంచి రూ.30 వేల లాభం వస్తుంది. కానీ, ప్రస్తుతం లాభం సంగతి దెవుడెరుగు.. కనీసం పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితులు కన్పించడం లేదు.
కలిసిరాని సీఎం కేసీఆర్ మాటలు..
నిమ్మకాయల్లో సి-విటమిన్ అధికంగా ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సి-విటమిన్ కోసం నిమ్మజాతి పండ్లను తినాలని సీఎం కేసీఆర్, పోషకాహార నిపుణులు సూచించారు. సీఎం కేసీఆర్ చెప్పినంకనన్న కొంటరేమోనని నిమ్మ రైతులు ఆశ పడ్డారు. కానీ, నేటికీ నిమ్మకాయలదీ అదే పరిస్థితి. నిమ్మ, బత్తాయిని మార్కెట్లు, ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు రవాణా చేసేందుకు అనుమతులు ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ, ఆ పరిస్థితులేవీ క్షేత్రస్థాయిలో కన్పించడం లేదు.
నిమ్మ రైతుల ఖర్చు పరిస్థితి ఇదీ..
నిమ్మకాయలను ఏరడం దగ్గరి నుంచి అమ్ముకుని డబ్బు తీసుకునేంత వరకు రైతులదే వ్యయం. ఒక్కసారి దాన్ని పరిశీలిస్తే.. నిమ్మకాయలను ఏరేందుకు ఒక్కో రైతుకు రూ.250 కూలీ చెల్లించాలి. ఒక్కో కూలీ సగటున రెండు బస్తాల నిమ్మకాయలను సేకరిస్తాడు. నిమ్మ బస్తాలను మార్కెట్‌కు తరలించేందుకు పది కిలోమీటర్ల లోపు అయితే ఒక్కోబస్తాకు రూ.15 నుంచి రూ.20 ఆటో ఛార్జీ ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్‌లో కమీషన్ దారులకు అమ్మిన తర్వాత ఒక్కో బస్తాకు ధరను బట్టి కమీషన్ తీసుకుంటారు. మొత్తంగా రైతుకు ఒక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.70 ఖర్చవుతుంది.
ఏరడం కన్న పారబోయడమే నయం: పాటి కృష్ణారెడ్డి, నిమ్మరైతు, కడపర్తి
‘నేనే ఐదు ఎకరాల్లో నిమ్మతోట సాగు చేస్తున్నాను. గత పదేండ్లుగా నిమ్మతోటలపైనే ఆధారపడి బతుకుతున్నా. ఐదెకరాలకు దాదాపు రూ.3 లక్షలకు పైనే ఖర్చు చేశాను. నిమ్మకాయలకు వేసవి మంచి సీజన్. కానీ, ఇప్పుడే నిమ్మకాయలకు ధర లేకుంటా పోయింది. కాయలు ఏరడం కన్న పారబోసింది నయంగా కన్పిస్తోంది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి’
అప్పులు తీరుతాయనుకున్నా: ఇంద్రారెడ్డి, నిమ్మరైతు
‘పోయినేడాది కాలం కలిసి రాక నిమ్మకాయలు కాయలే. ఈసారి కాస్తోకూస్తో కాలం అయ్యింది. నిమ్మకాయలు మంచిగనే కాసినయ్. ఇగ రెండు మూడేండ్లుగా పెట్టిన అప్పులు తీర్తాయని కుశాలయిన. అది మూడ్రోజుల ముచ్చగానే మారింది. బస్తా కాయకు రూ.250 పడింది. కూలీ ఖర్చులు నా మీదనే పడినయ్. ఏంజేయాల్నో తెలవట్లే. పోయినేడాది బస్తాకు రూ.వెయ్యి పైనే పడింది. ఈసారి కరోనా పాడుగాను భలే దెబ్బతీసింది. ఎట్లనన్న జేసి ప్రభుత్వం ఆదుకోవాలె’.
Tags: Nalgonda, Lemon Farmers, Lemon, Heavy Losses, Corona Effect