- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాలం.. అపారం..
దిశ నల్లగొండ: అకాల వర్షం రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వర్షం రైతుల కంట కన్నీరు పెట్టించింది. రెండు,మూడు రోజుల్లో ధాన్యం అమ్ముకొని అవసరాలను తీర్చుకోవచ్చని ఆశ పడిన అన్నదాతలకు వడగండ్లు కడగండ్లను మిగిల్చింది. గత రెండు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడగంఢ్ల వాన బీభత్సానికి సుమారు నాలుగు వేల ఎకరాల పంట దెబ్బతిన్నది. వందల ఎకరాల మామిడి నేల పాలైంది. కూరగాయాల పంటలు పండించే పాలిహౌజ్‌లు ఈదురుగాలుల బీభత్సానికి ధ్వంసమయ్యాయి. ఇప్పటికే కరోనా ప్రభావంతో అతలాకుతలమవుతున్న రైతన్నల పాలిట ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఒక్కసారిగా కుదేలయ్యారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 మండలాల్లోని 85 గ్రామాల్లో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. రెండు మూడు రోజుల్లో కోతకు వచ్చిన వరి చేలపై కచ్చకాయ సైజు ఉన్న వడగండ్లు పడటంతో వరి కంకికి ఉన్న గింజలు రాలిపోయి నేలపాలైనాయి. వేల ఎకరాల వరి పంట ఈదురుగాలుల దాటికి తట్టుకోలేక నేలకొరిగింది. వర్షం నీళ్లు పంట పొలాల్లో నిలిచిపోవడంతో నేల రాలిన గింజ ఎందుకు పనికి రాకుండా పోవడంతో ఆరుగాలం కష్టపడిన పంట నేల పాలు కావడంతో రైతుల కంట కన్నీరు ఆగడం లేదు.
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో నష్టపోయిన పంట వివరాలను జిల్లా వ్యవసాయాధికారులు కలెక్టర్లకు నివేదించారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి. రాజపేటలో 100, నారాయణపురంలో 50, యాదగిరిగుట్ట 400, భువనగిరి 50, తుర్కపల్లి 180, ఆలేరు 404, వలిగొండ 1196, బీబీనగర్ 45, చౌటుప్పల్ 645, మర్రిగూడ 120, మునుగోడు 50, నాంపల్లి 25 ఇలా మొత్తం 3265 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 ఎకరాల్లో మామిడి పంట, 156 ఎకరాల్లో కూరగాయాల పంటలు ధ్వంసమైనట్టు అధికారులు ప్రాధమిక అంచనా రూపొందించారు.
తడిసి ముద్దయిన ధాన్యం..
ఇప్పటికే గ్రామాల్లో 50 శాతానికి పైగా కోతలు పూర్తి అయ్యాయి. వరి కోత యంత్రాల ద్వారా వరి కోసిన రైతులు నేరుగా ధాన్యాన్ని ట్రాక్టర్‌ల ద్వారా రెవెన్యూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపి కేంద్రాలకు తరలించారు. అయితే రైతుల వద్ద సరైన టార్ఫాలిన్ కవర్లు లేకపోవడంతో సంచులు ధాన్యం రాశులపై కప్పారు. వర్షం నీటికి ఇవి ఆపలేకపోయాయి. దీంతో ఈ 12 మండలాల పరిధిలో ఉన్న దాదాపు 50 ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. సుమారు ఐదారు వందల టన్నుల ధాన్యం తడిసి ముద్దయ్యి ఉంటుందని అధికారులు అంచనా వేస్తోన్నారు.
పంట పొలాల పరిశీలన..
చౌటుప్పల్ మండలంలోని డి నాగారం, పిపల్ పహాడ్, చిన్న కొండూరు, మందోళ్లగూడెం, తూర్పుగూడెం, ఎస్.లింగోటం, కుంట్లగూడెంలతోపాటు పలు గ్రామాల్లో గాలి వానకు నష్టపోయిన వరి పొలాలను చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్ పరిశీలించి పంట నష్టం అంచనా వేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తుర్కపల్లి మండలంలోని తిర్మలపురం గ్రామన్ని సందర్శించి వడగండ్ల బాధితులను ఓదార్చారు. ఎకరానికి రూ.40 వేల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలం తూర్పుగూడెం గ్రామంలో ఓ రైతుకు సంబంధించిన 5 ఎకరాల మామిడి తోటలో కాయలు పూర్తిగా నేల రాలాయి. మరొక రైతుకు సంబంధించిన టమాట తోట, కూరగాయల తోట పూర్తిగా దెబ్బతిన్నాయి. పొలాల గట్ల పక్కన ఉన్న తాటి, వేప చెట్లు నేల కులాయి. మామిడి చెట్లు విరిగి పడ్డాయి. దీనితో పెద్ద ఎత్తున రైతన్నలకు నష్టం వాటిల్లింది.
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి: ఎంపీ
వర్షం వల్ల తడిసి ముద్దయిన ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడువకుండా ఉండటానికి సరిపోయే టార్ఫాలిన్ కవర్లను అందజేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగాలని, పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.40 వేలు పరిహారం ఇవ్వాలని, మామిడి, బత్తాయి రైతులకు పరిహారం చెల్లించాలని కూడా ఎంపీ పేర్కొన్నారు.
Tags: Yadadri, hail, heavy crop loss, MP Komatireddy, crop farms, gardens, collector, officials