అవకాడోలు అతిగా లాగేస్తున్నారు!

by sudharani |
అవకాడోలు అతిగా లాగేస్తున్నారు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పాండమిక్ తర్వాత అందరికీ ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే.. ఈ భూమ్మీద ఆరోగ్యానికి మించినది మరొకటి లేదని అందరూ తెలుసుకున్నారు. దీంతో చాలా మంది బద్దకం తగ్గించుకోవడానికి చలికాలం అని కూడా చూడకుండా పొద్దున్నే లేచి గ్రౌండ్‌ల చుట్టూ రౌండ్లు కొడుతున్నారు. ఇక తిండి విషయంలో మాత్రం ఆరోగ్య శ్రద్ధ మరీ ఎక్కువైంది. ఈ మాట అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్‌లో హెల్తీ ఫుడ్స్ గురించి సెర్చ్‌ల మీద సెర్చ్‌లు చేస్తున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల్లో ఇటీవల పెరిగిన అవకాడో అమ్మకాలు కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఈ కొవిడ్ సంక్షోభం తర్వాత యురోపియన్, అమెరికా దేశాల్లో అవకాడో వినియోగం కొత్త రికార్డులను సృష్టిస్తోందని ప్రపంచ అవకాడో ఆర్గనైజేషన్ సీఈవో గ్జేవియర్ ఇక్విహ్వా అంటున్నారు.

పాండమిక్ తర్వాత ప్రజలు ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నారని, అందుకే అవకాడోలో ఉన్న ఆరోగ్య ఉపయోగాలను గుర్తించి సలాడ్లు, బురీడోలు, టోస్ట్‌లలో కూడా వాడేస్తున్నారని గ్జేవియర్ తెలిపారు. ఈ ఏడాది యూరప్‌లో అవకాడో వినియోగం ఏకంగా 12 శాతం పెరగగా, అమెరికాలో 7 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. గతంలో అవకాడో ఉపయోగాల గురించి ఎంత చెప్పినా పట్టించుకోని మిలెన్నియల్ కిడ్స్ ఇప్పుడు అడిగి మరీ తింటున్నారు. అలాగే గత దశాబ్దంతో పోల్చితే అవకాడో దిగుమతులు కూడా 5 శాతం పెరిగి 8 బిలియన్ డాలర్ల బిజినెస్‌గా ఎదిగిందని అవకాడో బోర్డ్ ప్రాజెక్ట్ నివేదికలో తేలింది. అదృష్టవశాత్తు ఈ ఏడాది మెక్సికో, కాలిఫోర్నియాల్లో అవకాడో పంట దిగుబడి కూడా అధికంగానే ఉండటంతో మొత్తం అమెరికా మార్కెట్‌తో పాటు యూరప్ మార్కెట్‌కు కూడా సరిపడా నిల్వ ఉందని ‘యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ వెల్లడించింది. అంతేకాకుండా అవకాడో ధరలు కూడా తక్కువగా ఉండటం మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచిందని గ్జేవియర్ వివరించారు. కానీ ఈ డిమాండ్ ఇలాగే కొనసాగితే 2025 నాటికి అవకాడోల సరఫరా తగ్గి, ధర పెరిగే ప్రమాదం కూడా ఉండవచ్చని, అలా జరగకుండా ఉండటానికి ఇప్పట్నుంచే ఉత్పత్తి మీద దృష్టిసారించబోతున్నట్లు ప్రపంచ అవకాడో ఆర్గనైజేషన్ ప్రకటించింది.

Advertisement

Next Story