ద్వేషపూరిత కామెంట్లతో జాగ్రత్త!

by Shyam |
ద్వేషపూరిత కామెంట్లతో జాగ్రత్త!
X

దిశ, వెబ్‌డెస్క్:

సోషల్ మీడియా అనేది ఇప్పుడు జీవితంలో ఒక భాగం. ప్రతి ఒక్కరికి తమ జీవితం కంటే ఎదుటివారి జీవితం మీదే ఎక్కువ ఆసక్తి కాబట్టి, ఈ సోషల్ మీడియా అనేది ఇంత పాపులర్ అయింది. సాధారణ వ్యక్తులను సెలెబ్రిటీలను చేసింది. ఆ సెలెబ్రిటీలనే కొన్నిసార్లు అధఃపాతాళానికి తొక్కింది. ఇదంతా ఎలా సాధ్యం? ఒకరి పాపులారిటీని తగ్గించాలన్నా.. పెంచాలన్నా లైక్, కామెంట్, షేర్ ఈ మూడింటిని అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. లైక్‌ ద్వారా ఒక అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. షేర్ ద్వారా ఇంకొకరితో సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ రెండు అస్త్రాల కంటే శక్తివంతమైనది కామెంట్. కామెంట్ చేయడం ద్వారా ప్రేక్షకుడి అభిప్రాయం నిక్కచ్చిగా తెలిసిపోతుంది. మంచి కామెంట్ అందలాన్ని ఎక్కిస్తే, ద్వేషపూరిత కామెంట్ మనసును విరిచేస్తుంది. ఎంత మంచి పోస్ట్‌కైనా, వీడియోకైనా కనీసం 20 శాతం ద్వేషపూరిత కామెంట్స్ రావడం సహజం. పోస్ట్ చేసిన వ్యక్తి సెలెబ్రిటీ అయితే ఈ ద్వేషపూరిత కామెంట్లకు లెక్కే ఉండదు. అయితే ఇక్కడ మానవ సైకాలజీ ప్రధాన పోషిస్తుంది. ఒక తెల్లకాగితం మీద నల్లమచ్చ ఉన్నపుడు మన మెదడు నల్ల మచ్చ మీదనే దృష్టిసారించినట్లుగా.. ప్రోత్సాహాన్నిచ్చే మంచి కామెంట్లు ఎన్ని ఉన్నా మనసులో మాత్రం తప్పుడు, ద్వేషపూరిత కామెంట్ల గురించే ఆలోచిస్తుంటాం.

అమెరికాలో 84 ఏళ్ల షెర్లీ కర్లీ ఒక గేమర్. తొమ్మిదేళ్లుగా తన గేమ్‌ను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఎంతో మంది సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకుంది. తన చానల్‌కు ఉన్న 9 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ను తన మనుమలు, మనుమరాళ్లుగా అనుకుంటుంది. వారిలో ఎంతోమంది ఆమెను స్ఫూర్తిగా తీసుకుని గేమింగ్ ప్రారంభించినట్లు కామెంట్ల ద్వారా తెలియజేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఆమె మీద ద్వేషపూరిత కామెంట్లు చేస్తారు. ‘ముసలిదానా.. నీకెందుకు ఇదంతా, పోయి ఇల్లు చూసుకో’ అంటూ చేసిన కామెంట్లు.. ఆమెను తీవ్రమనోవేదనకు గురిచేశాయి. ఒకానొక సమయంలో ఈ కామెంట్ల వల్ల తాను గేమింగ్ కెరీర్‌ను వదిలేయాలనుకుంది. ద్వేషపూరిత కామెంట్ల గురించి పట్టించుకోవద్దని ఆమెకు తెలుసు. కానీ మానవ నైజం అలా ఉండనివ్వలేదని షెర్లీ అంటున్నారు. ఇలాంటి ద్వేషపూరిత కామెంట్ల వల్ల ఇంటర్నెట్ నాశనమైందని చెప్పవచ్చు. దానంతట అదే నాశనం కాలేదు, ద్వేషపూరిత కామెంట్లు చేసి మనమే నాశనం చేశాం.

ఒక్క షెర్లీ కర్లీ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ద్వేషపూరిత కామెంట్ల‌కు బాధితులే. పిల్లలు, పెద్దలు, సమాజంలో శక్తిమంతమైన వ్యక్తులు ఇలా అందరూ వీటిని బారినపడ్డారు. ఉదాహరణకు బిల్‌గేట్స్‌ను తీసుకుంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పేదరికాన్ని నిర్మూలించడానికి ఆయన అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దానధర్మాలు, స్వచ్ఛంద సమస్యలు, ఆపదల్లో ఆదుకోవడానికి ఆయన ముందుంటారు. కానీ కొవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయంలో ఆయన మీద వచ్చిన ద్వేషపూరిత కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. కొవిడ్ 19 వ్యాక్సిన్ పేరుతో మనుషుల మెదళ్లలోకి నానో బోట్స్ పంపి నియంత్రించాలని బిల్‌గేట్స్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీన్ని నమ్మిన వాళ్లందరూ ఆయనను చంపేయాలంటూ ద్వేషపూరిత కామెంట్లు చేశారు. ఇది ఒక నిర్మాణాత్మక శైలి కాదు. బిల్ గేట్స్ అని కాదు.. ముద్దులొలికే చిన్నారి నవ్వుతున్న వీడియోకు కూడా ద్వేషపూరిత కామెంట్లు చేసేవారున్నారు. ఇక యూట్యూబ్‌లో వ్లోగ్స్ చేసేవారు, ట్యుటోరియల్స్ చెప్పేవారు లేదా ఇతర వీడియోలను పోస్ట్ చేసే వారికి కూడా ఎన్నో ద్వేషపూరిత కామెంట్లు వస్తాయి. ఇలాంటి ద్వేషపూరిత కామెంట్లు చదివి, ప్రాణాలు తీసుకున్నవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ కామెంట్లను చాలా సీరియస్‌గా తీసుకుని డిప్రెషన్‌లోకి వెళ్లిన సున్నిత మనస్కులు కూడా ఉన్నారు.

వీటిని ఎలా తట్టుకోవాలి?

ద్వేషపూరిత కామెంట్ల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది అందరూ చెబుతారు. కానీ వాటిని ఎలా తట్టుకోవాలనే విషయం తెలిసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ప్రపంచంలో ఏ ఇద్దరూ కూడా ఒకే విషయాన్ని ఒకే దృష్టితో చూడలేరు. ప్రతి అంశానికి మంచి, చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. మంచి చూసే వాళ్లు మిమ్నల్ని ప్రోత్సహించేవాళ్లయితే, చెడు చేసే వాళ్లు మీ పురోగతిని ఓర్వలేనివారన్నమాట. విభిన్నంగా ఏది చేసినా దానికి అడ్డుచెప్పేవాళ్లు ఎప్పుడూ ఉంటారని చెప్పడానికి చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. గాంధీ, మార్టిన్ లుథర్ కింగ్ లాంటి గొప్ప గొప్ప వాళ్లను కూడా ఎంతోమంది విమర్శించారు. కానీ వాటిని వాళ్లు పట్టించుకోలేదు. అప్పట్లో ఇంటర్నెట్‌ లేదు కాబట్టి వాళ్లకు ద్వేషపూరిత కామెంట్ల గురించి ఎక్కువగా తెలియలేదు అనుకోవద్దు. ప్రచార ప్రసార మాధ్యమాల్లో వారి గురించి పొగిడిన వారి కంటే ద్వేషపూరితంగా మాట్లాడిన వారే ఎక్కువ మంది ఉన్నారు.

మీ ఐడియాల గురించి భయపడే వారే మిమ్మల్ని ద్వేషించడానికి ముందుకొస్తారు. అంటే మీరు చేయబోయే పని వల్ల ఏదో నష్టం వారికి వ్యక్తిగతంగా జరుగుతోందనే భయంలో వాళ్లుండి, అలాంటి ద్వేషపూరిత కామెంట్లు చేస్తారని అర్థం చేసుకోవాలి. అంతేగానీ మీలో లోపం ఉందని గానీ, మీరు తప్పు చేశారని గానీ భావించకూడదు. దీన్ని బట్టి నేరుగా చెప్పాలంటే ద్వేషపూరిత కామెంట్లు వస్తున్నాయంటే దానర్థం మీరేదో విభిన్నమైనది, మంచి పనిని చేస్తున్నారని అర్థం. గేమర్ గ్రాండ్‌మా, బిల్ గేట్స్, గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, బరాక్ ఒబామా.. వీళ్లందరూ ఏదో విభిన్నంగా ప్రయత్నించారు కాబట్టే వారికి ద్వేషపూరిత కామెంట్లు వచ్చాయి. మార్పు తీసుకురావాలనుకున్న వారికి ఇలాంటివి రావడం సర్వసాధారణం. కానీ ఇంటర్నెట్ కారణంగా మీరు మూడు గంటలు కష్టపడి చేసిన వీడియోకు ఒక్క రెండు సెకన్లలో కామెంట్ చేసి ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తారు. మీరు ఎంతో ఇష్టపడి చేసే పనిని చేయకుండా ఎక్కడో ఓ మూలన కంప్యూటర్ లేదా ఫోన్ మీద చేతులు ఆడిస్తూ అడ్డంకులు కలిగిస్తారు. కాబట్టి ఇవేవీ మనసుకు తీసుకోకుండా మీరేదో సరైన పనిని చేస్తున్నారు కాబట్టే మిమ్మల్ని ఎవరో తెలియని వ్యక్తులు కూడా ద్వేషిస్తున్నారని అనుకుని, మీకు ప్రోత్సాహాన్నిచ్చే కామెంట్లను ఒకటికి రెండు సార్లు చదువుకుని ఆదర్శాన్ని పొందడం చేయగలగాలి.

Advertisement

Next Story

Most Viewed