రోడ్లపై ఆటోలు, ఇతర వాహనాలు ఆపి వ్యాక్సిన్ వేయండి.. మంత్రి హరిష్ రావు

by Shyam |
harish rao
X

దిశ, సిద్దిపేట: ప్రజారోగ్యం పట్ల జిల్లా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని హరిష్ రావు సూచించారు. అందరికీ టీకాలే లక్ష్యంగా.. స్పెషల్ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్‌లో సిద్ధిపేట జిల్లా రికార్డు సృష్టించిందన్నారు. మంగళవారం (డిసెంబరు 14) నాటికి జిల్లా ప్రజలందరికీ నూరు శాతం మొదటి డోస్ టీకా ఇవ్వడం పూర్తయ్యిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం డీఏంహెచ్ఓ మనోహర్, జిల్లా వైద్య నోడల్ అధికారి కాశీనాథ్, టీవీవీపీ ఈఈ శ్రీనివాస్, డీఈ విశ్వ ప్రసాద్, వైద్య అధికార సిబ్బందితో కలిసి అందరికీ టీకాలే లక్ష్యంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలో హోటళ్లు, టీ స్టాల్స్‌, దుకాణాలు, పాన్‌ షాప్‌ల వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ వేసుకోని వారికి వేయించాలన్నారు. అలాగే రోడ్డుపై ఆటోలు, ఇతర వాహనాలను ఆపి వ్యాక్సిన్‌ వేయాలని, బస్టాండ్‌‌లలో, రైతు బజారు, సమీకృత మార్కెట్‌లలో, ప్రధాన కూడలి, వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో అధికారులు ముమ్మరంగా తిరిగి వ్యాక్సిన్‌ వేయించాలని దిశానిర్దేశం చేశారు. బస్టాండ్‌లో బస్సు ఎక్కి ప్రయాణికుల నుంచి టీకా వివరాలు అడిగి తెలుసుకుని, టీకా వేసుకోని వారికి బస్సుల్లోనే ఇప్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లాలో 100 శాతం వ్యాక్సిన్‌ పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి ఏఎన్ఎం, ఆశావర్కర్లు వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. కేసీఆర్ నగర్‌లో శాంపిల్స్ సేకరించే ప్రక్రియ ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed