ముసాయిదా లీకేజీ.. ఆ ఇద్దరిపై వేటు తప్పదా..?

by Shyam |
ముసాయిదా లీకేజీ.. ఆ ఇద్దరిపై వేటు తప్పదా..?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ముసాయిదా లీకేజీ వ్యవ‌హారంపై విచార‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు, అధికారులకు ల‌భించిన‌ ప్రాథ‌మిక ఆధారాలు, విచార‌ణ‌లో తెలిసిన విష‌యాల‌తో లీకేజీకి పాల్పడింది ఇద్దర‌నే నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు కూడా త‌ప్పిదాన్ని అంగీక‌రించిన‌ట్లుగా సమాచారం. తనపై కొంత‌మంది ఒత్తిడి తీసుకురావడంతోనే వాట్సాప్ ద్వారా ముసాయిదాను షేర్ చేశానని జీడ‌బ్ల్యూఎంసీ ఉద్యోగి అధికారుల విచార‌ణ‌లో వెల్లడించిన‌ట్లు తేలింది. అయితే, మ‌రో ఉన్నతాధికారికి ఈ విష‌యంలో ప్రమేయం ఉంద‌ని అధికారులు, సైబ‌ర్ క్రైం పోలీసులు భావిస్తుండ‌గా, త‌న‌కు ఏం పాపం తెలియ‌ద‌ని వాపోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సీపీ నివేదికను కమిషనర్‌కు సమర్పించగా.. ఒకటి, రెండు రోజుల్లో ఇద్దరిపై వేటుప‌డే అవ‌కాశం ఉంద‌ని జీడ‌బ్ల్యూఎంసీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ముసాయిదాను అధికారికంగా విడుదల చేయకముందే బయటకు రావడంతో గంద‌ర‌గోళంగా మారింది. షెడ్యూల్ ప్రకారం జ‌ర‌గాల్సిన పున‌ర్విభ‌జ‌న ప్రక్రియ‌కు విఘాతం క‌లిగింది. రాజ‌కీయ దూమారం చెల‌రేగింది. చివ‌రికి రీ షెడ్యూల్ చేయాల్సి వ‌చ్చింది. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ప్రభుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. కమిషనర్ పమేలా సత్పతి ఫిర్యాదు చేయ‌డంతో రంగంలోకి దిగిన‌ సైబ‌ర్ క్రైం పోలీసులు వేగంగా విచార‌ణ పూర్తి చేశారు. రెండు, మూడు రోజుల్లో లీకేజీకి పాల్పడిన వారిపై శాఖ‌ప‌ర‌మైన క‌ఠిన‌ చర్యలు ఉంటాయ‌ని చర్చ నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed