శిశువు కిడ్నాప్‌ కేసులో సంచలనం.. అంతా చేసింది ఆస్పత్రి సిబ్బందే..!

by srinivas |
శిశువు కిడ్నాప్‌ కేసులో సంచలనం.. అంతా చేసింది ఆస్పత్రి సిబ్బందే..!
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జీజీహెచ్‌లో మూడు రోజుల‌ మగ శిశువు అపహరణ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న పెదకాకానికి చెందిన ప్రియాంక అనే మహిళ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. ఈ నెల 13న పండంటి మగ బిడ్డకు ప్రియాంక జన్మనిచ్చింది. అయితే శుక్రవారం రాత్రి చిన్నారి ఏడుస్తుండటంతో నాయనమ్మ బయటకు తీసుకువచ్చింది. ఆ తర్వాత ఆవిడ బాత్రూంకు వెళుతూ నిద్రపోతున్న అమ్మమ్మ పార్వతమ్మ పక్కన శిశువును పెట్టి వెళ్లింది. బాత్ రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి చిన్నారి అదృశ్యమయ్యాడు. ఐదు నిమిషాల్లోనే శిశువును గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు. దీంతో బాధితులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రితోపాటు బయట సీసీఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నెహ్రూ నగర్‌లో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారే శిశువును అపహరించినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో తల్లిదండ్రులకు ఆ శిశువును అప్పగించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story