అక్కడి గెస్ట్ హౌస్‌లన్నీ భూత్ బంగ్లాలే

by Sridhar Babu |   ( Updated:2021-08-29 21:44:13.0  )
అక్కడి గెస్ట్ హౌస్‌లన్నీ భూత్ బంగ్లాలే
X

దిశ, భువనగిరి రూరల్ : ఈ ఫొటోలు చూశారా.. లగ్జరీ రూంలో విలాసవంతమైన పరుపులు, ఫర్నీచర్ దుమ్ము పట్టి, గోడలు బూజుపట్టి భూత్ బంగ్లాని తలపిస్తోంది కదా, ఇది ఎవరి ఇల్లో కాదు, ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన బంగ్లాలు. ఇందులో ఒకటి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కాగా, మరొకటి సంఘమిత్ర భవనం. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో అద్దం పడుతున్న ఈ భవనాలు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో ఉన్నాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ బిల్డింగ్‌లను లక్షణంగా వదిలేసి, ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.

భూత్ బంగ్లాగా గెస్ట్ హౌస్

యాదాద్రి జిల్లాలో వలిగొండ ముఖ్యమైన మండల కేంద్రం. ఇక్కడి నుంచే నల్లగొండ జిల్లాకు అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారు. రెండు జిల్లాలకు మధ్యలో ఉండటం వల్ల వలిగొండ తహసీల్దార్ కార్యాలయం పక్కన 2007లో అప్పటి రామన్నపేట ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి హయంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మించారు. 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని అప్పట్లో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉమా మాధవరెడ్డి మాత్రమే ఉపయోగించారు. గత పదేళ్లుగా ఇది నిరుపయోగంగానే మారింది. ఈ గెస్ట్ హౌస్ లో విలువైన ఫర్నీచర్, సామాగ్రి వృథాగా ఉండటంతో దేనికి పనికి రాకుండా పోతున్నాయి. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ గెస్ట్ హౌస్ ముందు నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ దీనివైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అందరికీ ఉపయోగపడే ఈ గెస్ట్ హౌస్‌ను ఇలా ఎందుకు వదిలేశారో తెలియక మండల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ లేదా, ఎమ్మెల్యే అయినా స్పందిస్తారో లేదో చూడాలి.

వైఎస్ఆర్ సంకల్పానికి తూట్లు

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళా సంఘాల కోసం సంఘమిత్ర భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిల్లో మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకునేలా రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా 2005లో వలిగొండ మండల కేంద్రంలోనూ సంఘమిత్ర భవనానికి చేసి, 2011లో ప్రారంభించారు. ఆ భవనాన్ని మూడు రోజుల మురిపించగా కొద్ది రోజులు ఉపయోగించి వదిలేశారు. గత పదేళ్లుగా ఆ భవనం అక్కరకు రాకుండా పోయింది. ఇలా ప్రజా అవసరాల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు ప్రభుత్వ ఆలనా పాలన లేక ఉత్సవ విగ్రహాల్లా మారిపోయాయి. ఇలా విలువైన భవనాలు నిరుపయోగంగా మారడం పై మండల ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం హయంలో కొత్త నిర్మాణాలు చేపట్టకపోగా, ఉన్న భవనాలను కూడా వృథాగా వదిలేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, సంఘమిత్ర భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

హాస్టల్స్‌కు కేటాయించాలి : స్వామి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను కనీసం వినియోగించ లేని స్థితిలో ఉండడం విచారకరం. విలువైన ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి. ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి అవసరం లేకపోతే అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టల్స్‌కు ఆ భవనాలను వెంటనే కేటాయించాలి. లేని పక్షంలో సీసీఎం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తాం.

Advertisement

Next Story

Most Viewed