ఐపీఎల్‌కు పెరుగుతున్న క్రికెటర్ల మద్దతు

by Shyam |
ఐపీఎల్‌కు పెరుగుతున్న క్రికెటర్ల మద్దతు
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ మెగా ఈవెంట్లను రద్దు చేసి ఐపీఎల్ నిర్వహించడంపై వస్తున్న విమర్శలకు క్రికెటర్లు చెక్ పెడుతున్నారు. కొంత మంది మాజీ క్రికెటర్లు బీసీసీఐ లక్ష్యంగా విమర్శల దాడికి దిగిన విషయం తెలిసిందే. డబ్బుందనే అహంతో ఐసీసీ ఈవెంట్లనే రద్దు చేయించి ఐపీఎల్ ఆడించాలని చూస్తోందని అలెన్ బోర్డర్ నేరుగానే విమర్శించారు. కాగా, దీనిపై ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు స్పందించారు. ప్రపంచ క్రికెట్‌లో టీ20, వన్డే వరల్డ్ కప్‌ల తర్వాత ఐపీఎల్ మాత్రమే అత్యుత్తమ టోర్నీ అంటున్నారు. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ స్పందిస్తూ లాక్‌డౌన్ అనంతరం క్రికెట్ ఆట మొదలైతే, అది ఐపీఎల్‌తోనే ఆరంభం కావాలని కోరుకుంటానన్నాడు. ఐపీఎల్ వల్ల ఆటగాళ్లలో ఉత్సాహం నెలకొంటుందనీ, ఎంతో మంది విదేశీ ప్లేయర్లు లాభపడ్డారని తెలిపాడు. తాను ఐపీఎల్‌లో ఆడుతున్నానంటే దానికి కెవిన్ పీటర్సన్ కారణమని అన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ కూడా ఐపీఎల్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు. ఐపీఎల్ ఎప్పుడు ఆరంభమవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. మాజీలు చేసే విమర్శలు వాస్తవదూరమని కొట్టిపారేశాడు. ఐసీసీ టోర్నీల వంటిదే ఐపీఎల్ అని చెప్పాడు. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్, ఐపీఎల్ వంటి టోర్నీలు జరిగే అవకాశం ఉండటంతో భారత క్రికెటర్లు కూడా ప్రాక్టీస్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం శిక్షణా శిబిరాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు వెలువరించలేదు. ప్రభుత్వ అనుమతి రాగానే శిక్షణ శిబిరాలు ప్రారంభిస్తామని బీసీసీఐ చెబుతోంది.

Advertisement

Next Story

Most Viewed