ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ ఒప్పందంపై కేంద్రం సంతకం!

by Harish |
Air india
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాను రూ. 18,000 కోట్లకు విక్రయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సోమవారం టాటా సన్స్‌తో వాటా కొనుగోలు ఒప్పందంపై కేంద్రం సంతకం చేసింది. ఆ వివరాలను ప్రభుత్వ ఆస్తులు, పెట్టుబడుల నిర్వహణ విభాగం(దీపమ్) వెల్లడించింది. ఒప్పందంపై సంతకం ద్వారా ఎయిర్ఇండియా ప్రైవేటీకరణలో కీలక ప్రక్రియ ముగిసింది. ‘ఎయిర్ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల కోసం టాటా సన్స్‌తో ఒప్పందాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని’ దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు.

ఈ నెల ప్రారంభంలో టాటా సన్స్ కంపెనీ పెద్ద ఎత్తున ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ఇండియాను సొంతం చేసుకుంది. రూ. 2,700 కోట్ల నగదు చెల్లింపు, రూ. 15,300 కోట్ల ఎయిర్‌లైన్స్ అప్పుల చెల్లింపు ప్రతిపాదనతో వచ్చిన టాటా సన్స్ కంపెనీని ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో ఎయిర్ఇండియాను మొదట స్థాపించిన టాటా గ్రూపునకే తిరిగి ఎయిర్ఇండియా సొంతమైంది. కాగా, 2003-04 తర్వాత ఇదే మొదటి ప్రైవేటీకరణ కావడం గమనార్హం. అంతేకాకుండా టాటా సంస్థ నిర్వహిస్తున్న ఎయిర్‌లైన్స్ బ్రాండ్‌లలో ఎయిర్ఇండియా మూడో కంపెనీగా చేరింది. ఇప్పటికే టాటా సంస్థకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్‌గా ఎయిర్ఏషియా, విస్తరాలో వాటా కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed