- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మికులకు 12 గంటల పని విధానం!?
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ముందు నుంచి విశ్లేషకులు భావిస్తున్నారు. అవన్నీ నిజమవుతాయనే అనిపిస్తోంది. కర్మాగారాల్లో కార్మికుల పనిగంటలను 8 నుంచి 12 గంటలకు పెంచాలని ప్రభుత్వం చర్చలు సాగిస్తోంది. అయితే, దీనికి కార్మిక సంఘాలు ఒప్పుకుంటాయా? అతిపెద్ద విపత్తును ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో చట్టాన్ని మార్చడం కుదిరే పనేనా? కేవలం లాక్‌డౌన్ వరకే దీన్ని వర్తింపజేస్తారా? అంతర్జాతీయ కార్మికులు విప్లవం ద్వారా తెచ్చుకున్న మేడే లక్ష్యాన్ని కాదని ప్రభుత్వం పనిగంటలను పెంచే సాహసం చేయగలదా? ఇలా..అనేక ప్రశ్నలు ప్రభుత్వ చర్చల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా పని గంటలను ఆరు గంటలకు పరిమితం చేస్తూ, వారానికి రెండు సెలవు దినాలు అమలు చేయాలని అనేక దేశాల్లో ఉద్యమాలు, చర్చలు సాగుతున్న ఈ సందర్భంలో మన దేశంలో 12 గంటల షిఫ్ట్ ఎంతవరకూ అమలవుతుందనే సందేహం కూడా విశ్లేషకుల్లో ఉంది.
కరోనా వ్యాప్తి కారణంగా పెరిగిన అధిక డిమాండ్, తగ్గిన కార్మికుల భారాన్ని తగ్గించుకునేందుకు కర్మాగారాలు అవసరమైన మార్గాలను అన్వేశిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు 1948 నాటి చట్టంలో మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్‌డౌన్ తప్పదనే పరిస్థితుల మధ్య ఈ ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కర్మాగారాల్లో ప్రస్తుతమున్న 8 గంటల షిఫ్ట్‌లను 12 గంటలకు మార్చనున్నట్టు తెలుస్తొంది. అంటే, ఇదివరకూ వారానికి 8 గంటలు చొప్పున 48 గంటల పని ఉండగా, చట్టంలో మార్పులు చేస్తే రోజుకు 12 గంటలు చొప్పున వారానికి 72 గంటలు అవనుంది. ఈ చర్చల అనంతరం కేవలం లాక్‌డౌన్ సమయంలో అత్యవసరంగా పనిచేస్తున్న కర్మాగారాలకు, వైద్య రంగంలోని పరిశ్రమలకే వర్తింప చేస్తారా? లేక అన్ని రకాల పరిశ్రమలకూ ఇది వర్తిస్తుందా అనేది అధికారిక ప్రకటన తర్వాత తేలాల్సి ఉంది. అత్యవసరంగా ఆరోగ్య వ్యవస్థను కాపాడేందుకైతే కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వొచ్చు కానీ, దీనికోసం చట్టాన్ని మార్చాల్సిన పనిలేదు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం నేరుగా చర్చించి లాక్‌డౌన్ ఎత్తివేసే వరకూ కార్మికుల మద్దతు కోరవచ్చు.
సీనియర్ అధికారుల వివరణ ప్రకారం..1948 ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించడానికి ఇటీవల ఒక ప్రతిపాదన వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం కార్మికులు ఎవరైనా వారానికి 48 గంటలు మించి పనిచేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీనిలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
గత 72 సంవత్సరాల భారతీయ పరిశ్రమల చట్టంలో కీలకమైన ఓవర్ టైమ్ నిబంధనలు ఉన్నప్పటికీ, అసాధారణమైన పరిస్థితుల్లో అసాధారణమైన నిబంధనలు కూడా అవసరమే అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆహారం, ఔషధం వంటి అవసరమైన వస్తువుల లభ్యత కోసం సరఫరా నిర్వహణను సులభరం చేయడంలో భాగంగా రోజుకు 8 గంటల షిఫ్టుల నుంచి 12 గంటల పనికి అనుమతించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కార్మికుల కొరత అనేది పరిశ్రమల్లో అతిపెద్ద సమస్య అని ఉత్పత్తుల సంస్థల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు ఎలాంటి అనుమతులు తీసుకున్నప్పటికీ 50 శాతం మందిని మాత్రమే కర్ఫ్యూ పాస్‌లతో అనుమతిస్తారు. అయినా సరే కార్మికుల కొరత వల్ల, ఉన్న కార్మికులు సాధారణ పనిగంటలే చేయడం వల్ల ఉత్పత్తి చాలా వరకూ తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ పనిగంటల షిఫ్టులు సహాయపడతాయి. పైగా, కార్మికులకు దామాషా ప్రకారం ఎక్కువ వేతనం కూడా లభిస్తుంది కాబట్టి ఎక్కువ పనిచేయడానికి ఎవరూ విభేదించలేరు. ఇప్పుడు చట్టంలో మార్పుకు ముందడుగు వేయడానికి ఇది కూడా ఒక కారణం.
ఈ ప్రతిపాదనకు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి పవన్ అగర్వాల్, పరిశ్రమల అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖా కార్యదర్శి గురుప్రసాద్ వంటి సీనియర్ అధికారులు కూడా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై జరిగిన చర్చల్లో పాల్గొన్న అధికారులు..ఈ మార్పు ఎక్కువ పనిగంటలు అంటే ఉత్పత్తి సామర్థ్యాలను పునఃప్రారంభిస్తుంది. కార్మికులకు కూడా అదనపు వేతనం లభిస్తుంది కాబట్టి వారి నగదు సమస్యలను పరిష్కరిస్తుంది అని చెబుతున్నారు. ఇప్పటికే ఒక పరిశ్రమలో పనిచేసే కార్మికుడికి ఓవర్ టైమ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..ఫ్యాక్టరీల చట్టం ఆ ఓవర్ టైమ్‌ను గరిష్ఠంగా 120 గంటలకే పరిమితం చేస్తోంది. కార్మికుడు ఓవర్ టైమ్ చేసే ప్రతి గంటకు సాధారణ వేతనం కంటే రెట్టింపు చేయాలని చట్టం నిర్దేశిస్తుంది.
ప్రభుత్వం అనుకున్నట్టు ఈ సవరణలు గనక జరిగితే ఒక కార్మికుడికి అధిక ఆదాయాన్ని అందించినట్టు అవుతుంది. అలాగే, కార్మికుల అవసరాన్ని 33 శాతం తగ్గిస్తాయి. ఎక్కువ సంఖ్యలో కార్మికులు ఇంటికే పరిమితం కావడం వల్ల ప్రస్తుతం ఈ సవరణ ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోతుంది అని ఓ అధికారి చెప్పారు.
అధికారిక లెక్కల ప్రకారం..ఇండియాలో మొత్తం 700 జిల్లాలుండగా 270 జిల్లాల్లో మాత్రమే కొవిడ్-19 బాధితులు ఉన్నట్టు తెలుస్తొంది. ఇవి కాకుండా మిగిలిన జిల్లాల్లో పరిశ్రమలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించాలని వారు కోరుతున్నారు. శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సంబంధిత సమస్యలపై పరిశ్రమల సంస్థలతో సంభాషించారు. ఈ సమావేశంలో కార్మికుల కొరత, నగదు సమస్యలు, ఆర్డర్ల రద్దుతో పాటు ఇప్పటికే కలిగిన భారీ నష్టాల గురించి చర్చించారు.
అయితే, ట్రేడ్ యూనియన్ నాయకులు మాత్రం షిఫ్ట్ పనిగంటలను పొడిగించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. కొన్ని సంస్థల్లో ఇప్పటికే కార్మికులు ఓవర్ టైమ్ చేస్తున్నారు. ఇది పని గంటలను పొడిగించే ప్రభుత్వాల దీర్ఘకాలిక ప్రాజెక్ట్ మాత్రమే. కార్మికులను తక్కువ చెల్లింపులతో ఎక్కువ పని చేయించుకోవడానికి ఇది దోహదపడుతుంది తప్పించి కార్మికులకు సాయంగా ఉండదు. ఇటువంటి చౌక వ్యూహాలకు బదులుగా ఇండియాలోని పరిశ్రమల్లో ఇప్పటికే తగ్గించిన కార్మికుల సంఖ్యను పెంచే మార్గాలను అన్వేషించాలని సీఐటీయు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ చెబుతున్నారు.
Tags: Lockdown effect, coronavirus, covid-19, 12 hours shift, workers, facory law