ముషంపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ఆఘమేఘాల మీద జిల్లాకు మంత్రి

by Shyam |   ( Updated:2021-09-23 09:51:20.0  )
Nalgonda, woman murder case
X

దిశ, నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని ముషంపల్లి గ్రామంలో మహిళ హత్యాచార ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. హుటాహుటిన మంత్రి జగదీష్ రెడ్డి జిల్లాకేంద్రంలోని ఆసుపత్రికి చేరుకొని ధనలక్ష్మి మృతదేహానికి నివాళులర్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు తప్పించుకోవడానికి వీలు లేకుండా కేసులు నమోదు చేయడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ఆఘమేఘాల మీద నల్లగొండకు చేరుకుని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దిశ కేసుతో పాటు ఇటీవల జరిగిన సైదాబాద్ ఘటన తరహాలోనే ఈ సంఘటనలోనూ ఆరాచాకానికి పాల్పడ్డ దుండగులపట్ల కఠినంగా వ్యవరించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా ఎస్పీ, డీఐజీ రంగనాథ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గ్రామస్తుల చేతిలో దేహశుద్ధి జరిగి పోలీసులు అదుపులోకి తీసుకున్న దుండగుల నేర చరిత్రపై ప్రత్యేక విచారణ జరుపుతున్నారు. మహిళలపై ఎక్కడ అరాచకం జరిగినా తక్షణం స్పందించే రాష్ట్ర ప్రభుత్వం ముషంపల్లి సంఘటనను మరింత సీరియస్‌గా తీసుకుంది. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్భందీగా చర్యలు చేపట్టింది.

DIG-Ranganath

భగ్గుమన్న ప్రజానీకం.. ర్యాలీలతో అట్టుడికిన నల్లగొండ

ముషంపల్లిలో జరిగిన ధనలక్ష్మి హత్యకేసుతో నల్లగొండ ప్రజానీకం భగ్గుమంటోంది. మహిళపై లైంగికదాడికి పాల్పడటం క్రూరమైన చర్య అని పలు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంత దోషులను వెంటనే శిక్షించాలని డీఐజీ రంగనాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ ర్యాలీకి సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఐద్వా, కేవీపీఎస్, జై భీమ్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. పట్టణ ఆర్యవైశ్యులు తమ దుకాణాలను మధ్యాహ్నం 12 గంటల వరకు బంద్ పాటించి నిరసన తెలిపారు. వాసవీ భవన్ నుంచి ప్రారంభమై భాస్కర్ టాకీస్, ప్రకాశం బజార్, గడియారం సెంటర్‌కు చేరుకొని అక్కడ 2 గంటలు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మురళి, గౌరవ అధ్యక్షుడు భూపతిరాజు, వాసవీ భవన్ చైర్మన్ చంద్రశేకేర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, వనమా మనోహర్, అశోక్, నర్సింహ, శ్రీనివాస్, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మెన్ భార్గవ్, నకిరేకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story