SECగా నిమ్మగడ్డను నియమించండి

by srinivas |
SECగా నిమ్మగడ్డను నియమించండి
X

దిశ, ఏపీబ్యూరో :
ఏపీ ప్రభుత్వంపై చేసిన పోరాటంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయం సాధించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగిస్తూ‌ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తిరిగి ఆయనకే బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. అయినప్పటికీ, ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన మరోసారి హైకోర్టను ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవాలన్న సూచన మేరకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమై ఆయన వినతిపత్రం సమర్పించారు.

అయితే, ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఆయన్ను నియమించాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన ఒక లేఖ పంపారు. దీంతో ఎస్ఈసీగా రమేష్ కుమార్‌ను నియమాకం తప్పనిసరిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నాటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అనివార్య పరిస్థితిలో ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఈ వివాదంపై వైఎస్సార్సీపీ ఎలా స్పందించిందంటే..

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కొనసాగించాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను తాము గౌరవిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కానీ, నిమ్మగడ్డను ఎస్ఈసీగా పరిగణించబోమని.. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉందని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. రూ.కోట్ల ఫీజు తీసుకునే లాయర్లను నిమ్మగడ్డ పెట్టుకున్నారని, ఇంత డబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వస్తోందని ఆయన ప్రశ్నించారు. డబ్బు చంద్రబాబు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తనకు సంబంధించిన వ్యక్తులు కీలక పదవుల్లో ఉండేలా చంద్రబాబు తెర వెనుక కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ హోటళ్లలో రహస్యంగా మంతనాలు జరిపారని ఆయన గుర్తు చేశారు.

దీనిపై చంద్రబాబు ఏమన్నారంటే…

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకమని వివరించారు. ఈ చర్యలతో ఆర్టికల్ 243కె(2)కు సార్ధకత ఏర్పడింది’ అన్నారు. మరో ట్వీట్‌లో ‘కరోనా వ్యాప్తి వేళ ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు.
న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడ ధోరణులకు అడ్డుకట్ట పడటం ముదావహం’ అని పేర్కొన్నారు. ఇంకో ట్వీట్‌లో ‘ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు, పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి. ఎస్ఈసీ తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం నిష్పాక్షిక విధి నిర్వహణకు దోహదపడాలి. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడాలి’ అని తెలిపారు.

రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ…

ఎస్ఈసీగా రమేష్ కుమార్‌ను కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ చక్కని దిశానిర్దేశం చేశారని ట్విట్టర్ మాధ్యమంగా పేర్కొన్నారు. హనరబుల్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మంచి నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి చక్కని దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ విషయంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేయదన్న విశ్వాసం తనకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సీపీఐ నారాయణ మాట్లాడుతూ..

ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలని గవర్నర్ ఆదేశించడం శుభపరిణామమని తెలిపారు. రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి జగన్‌కు అన్ని దారులు మూసుకుపోయాయని ఆయన పేర్కొన్నారు. జగన్ రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారని నారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కోనక తప్పదని ఆయన స్పష్టంచేశారు. రాజకీయాల్లో పట్టువిడుపులు అవసరమన్న ఆయన, మొండిగా ముందుకెళ్లడం సరికాదని సీఎం జగన్‌కు హితవు పలికారు.

Advertisement

Next Story