గోపీ, శ్రీనివాస్‌ల మరణం నన్ను కలచివేసింది : గవర్నర్ దత్తాత్రేయ

by Shyam |
గోపీ, శ్రీనివాస్‌ల మరణం నన్ను కలచివేసింది : గవర్నర్ దత్తాత్రేయ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ చిత్రకారుడు శ్రీ గోపి గారి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి “బాపు” ద్వారా ప్రేరణ పొంది బొమ్మలను గీస్తూ తన నైపుణ్యాన్ని పెంచుకొని, విశిష్ట సేవలందించిన కళాకారుడు గోపి కరోనాకు బలైపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గోపి మృతి కళారంగానికి తీరని లోటు అని, తెలంగాణ రాష్ట్రం ఒక మంచి చిత్రకారుని కోల్పోయిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. గోపి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతేగాకుండా.. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు కావలసిన మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేశారు.

“జై” సినిమాలో ‘‘దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జండా మనదే’’ అనే పాటతో గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తెలంగాణకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు “జై శ్రీనివాస్’’ అలియాస్ (నేరేడుకొమ్మ శ్రీనివాస్) మృతి పట్ల దత్తాత్రేయ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు శ్రీనివాస్ పాటలు పాడి మెప్పించారని, అలాగే సినిమా పాటలతో పాటు ప్రైవేటు ఆల్బమ్‌లకు, షార్ట్ ఫిలింస్‌కు, వెబ్ సిరీస్లకు కూడా పాటలు పాడి, ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’’ అనే పాటల ద్వారా మరింత పేరు ప్రఖ్యాతలు గడించారని దత్తాత్రేయ కొనియాడారు. శ్రీనివాస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు కావలసిన మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ తెలియజేసారు. ఈ మేరకు గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి కైలాస్ నాగేశ్ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed