'వాజేడులో ఉపాధ్యాయుడి ఇష్టారాజ్యం.. 3 రోజుల నుంచి పాఠశాలకు రావట్లే'

by Sridhar Babu |   ( Updated:2021-12-14 21:42:27.0  )
wajedu-1
X

దిశ, వాజేడు: ఉపాధ్యాయ వృత్తి దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది. ఉపాధ్యాయుడు మొత్తం సమాజానికి బాధ్యత వహిస్తాడు. బాలబాలికలను భావి పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంది. అందుకే ఈవృత్తి మనసా, వాచా, కర్మణా పవిత్రమైనదని విశ్వసిస్తారు. కానీ, వాజేడు మండలంలో ఓ పాఠశాలలో మాత్రం ఇందుకు భిన్నం.. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా వాజేడు మండలం ఆర్లగూడెం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గత మూడు రోజుల నుండి విధులకు హాజరుకాకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఆటలు ఆడుకొని వెళ్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీ మండలంలో మారుమూల గ్రామం కావడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తమ ఇష్టారాజ్యం కొనసాగుతుంది. అడిగేవారు ఎవరూ అన్నట్లుగా.. సొంత పనులు చూసుకుంటూ సమయానికి పాఠశాలకు హాజరు కాకుండా ఐదంకెల వేతనాలు పొందుతూ, అంకితభావంతో విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుడు ఇష్టారాజ్యంగా పాఠశాలకు డుమ్మా కొడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు బాధ్యతా రాహిత్యంతో అడ్డదారిలో పాఠశాల విధులు ఎగ్గొట్టడంపై స్థానిక యువకులు మండిపడుతున్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాల ఉపాధ్యాయుడు వేతనాల కోసమే విధులు అన్నట్లు వ్యవహరిస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed