వైద్యారోగ్యశాఖపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. వారికి వేటు తప్పదా.?

by Anukaran |   ( Updated:2021-09-04 10:46:55.0  )
వైద్యారోగ్యశాఖపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. వారికి వేటు తప్పదా.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు వైద్యారోగ్యశాఖలోని పోస్టింగ్‌లు, ప్రమోషన్ల అంశంపై సర్కార్ ఆరా తీస్తున్నది. ఎన్ని ఖాళీలున్నాయి? అర్హులు ఎంత మంది ఉన్నారు? ఎంత కాలం నుంచి పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయి.? దానికి గల కారణాలేమిటీ.? వంటి వివరాలను సర్కార్ సేకరిస్తున్నది.

అంతేగాక ఇటీవల వైద్యారోగ్యశాఖలో కల్పించిన ప్రమోషన్లు ఎన్ని? అవి సీనియారిటీ ప్రకారమే జరిగాయా? అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. విభాగాల వారీగా వివరాలు ఇవ్వాలని ఆయా విభాగాల హెచ్‌ఓడీలను ప్రభుత్వం కోరింది. దీంతో పాటు ఏళ్ల తరబడి నుంచి కూర్చీల్లో తిష్ట వేసిన వారిపై కూడా నిఘా పెట్టింది.

ఎందుకు వారిని ఇంత కాలం నుంచి కొనసాగించాల్సి వస్తున్నది? వారి అర్హతతో ఇతరులెవ్వరూ లేరా? రూల్స్ ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తున్నారా.? అనే వివరాలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తున్నదని సచివాలయానికి చెందిన ఓ కీలక అధికారి ‘దిశ’కు తెలిపారు.

ఎందుకీ నిర్ణయం..?

వైద్యారోగ్యశాఖలో అక్రమంగా పోస్టింగ్‌లు, ప్రమోషన్లు జరిగాయని తెలంగాణ మెడికల్ జేఏసీ ఆరోపిస్తూ శుక్రవారం సెక్రటేరియట్ ముందు ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోస్టింగ్‌లు, ప్రమోషన్ల విషయంలో దళిత వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. అర్హతలు ఉన్నా తమ కన్నా జూనియర్లకు హెచ్ఓడీల బాధ్యతలు తప్పగించడమేమిటనీ ఎస్సీ, ఎస్టీ డాక్టర్ల సంఘం నాయకులు ప్రశ్నించారు.

అంతేగాక హెల్త్ సెక్రటరీ రిజ్వీకి పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో, మెడికల్ జేఏసీ ఆరోపిస్తున్నట్లు దీనిలో నిజం ఎంత ఉన్నది? అనేదానిపై సర్కార్ క్లారిటీ తీసుకుంటున్నది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖలోని అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో హెల్త్ సెక్రటరీ శనివారం సెక్రటేరియట్‌లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సిబ్బంది అంశాలపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధం..

స్టాఫ్ నర్సులకు ప్రమోషన్లు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు నర్సింగ్ అసోసియేషన్లు రెడీ అవుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం 4వ జోన్‌లో ఉన్న నర్సులకు ప్రమోషన్లు కల్పించాలంటూ ఎంజీఎం హాస్పిటల్‌లో నర్సింగ్ స్టాఫ్ ఆందోళన చేపట్టారు. మిగతా ఆసుపత్రుల్లో నిరసనలు చేపట్టే కార్యక్రమానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సీనియర్ నర్సులు ‘దిశ’కు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed