పరిహారం పరిహాసం

by Shyam |
పరిహారం పరిహాసం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో కురిసిన భారీ వర్షాలతో నష్టయిపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న పరిహారం పరిహాసంగా మారింది. గ్రేటర్ పరిధిలో వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు పరిహారంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నగదు పంపిణీలో స్పష్టత లోపించడంతో పరిహారం కోసం ఇంటి యజమానులకు, అద్దెకు ఉన్న వారితో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక నాయకులు తయారు చేస్తున్న జాబితాలో అనేక పొరపాట్లు దొర్లుతున్నాయి. వాస్తవ వరద బాధితులను గుర్తించడంలో పారదర్శకత, జవాబుదారీతనం కనిపించడం లేదు.

అవకతవకలు..?

వరద ముంపు బాధితులకు పరిహారం అందజేయడంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఎంపిక ప్రక్రియ లోపబూయిష్టంగా జరుగుతున్నది. అధికారులు ముగ్గురు కలిసిన బృందం ఇంటింటికి తిరగడం లేదు. ఏదేని ఒక విభాగం (రెవెన్యూ, మునిసిపల్) కు చెందిన వారే చాలా చోట్ల కనిపిస్తున్నారు. స్థానిక నాయకులు నమోదు చేసుకున్న జాబితాలోని వారినే వారు కలుస్తున్నారు. ఇంటిలో అద్దెకు ఉండి వరద ముంపుతో నష్టపోయిన వారి కుటుంబాల పేర్లను జాబితాలో నమోదు చేయడం లేదు. నష్టపోయిన వారి జాబితాలో ఆ ఇంటి యజమానిపేరే రాస్తున్నారు. నాయకులు రాసిందే వేదంగా మారుతోంది.

హౌజ్ ఓనర్లకే పరిహారం..

మామల్కాజిగిరి పరిధిలోని దుర్గానగర్‌లో అద్దెకు ఉంటున్న వారికి సాయం అందడం లేదని బాధితులు వాపోతున్నారు. అధికారులు వాస్తవంగా తనిఖీలు చేయడం లేదని చెబుతున్నారు. ఒక ఇంటికి రూ.10 వేలు ఇస్తున్నారని, వీటిని ఇంటిలోని వారు సమానంగా పంచుకోవాలని స్థానికులకు సూచిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని నేతాజీ నగర్‌లో, సికింద్రాబాద్‌లోని అంబర్‌నగర్, ఈశ్వరీబాయి నగర్‌లో ఇంటి యజమానుల పేర్లను మాత్రమే జాబితాలో రాసుకుంటున్నారని, అద్దెకు ఉన్నవారి పేర్లు రాయడం లేదని చెబుతున్నారు.

అమలు కాని మార్గదర్శకాలు..

వరద ముంపుతో ఇండ్లు, సరుకులు, వస్తువులు, పరికరాలు వంటి నష్టం వాటిల్లిన బాధితులను గుర్తించడంలో పారదర్శకత, జవాబుదారీతనం కరువైంది. వాస్తవంగా నష్టపోయిన వారిని నిర్ధారించేందుకు అధికారులు ఇంటింటికి తిరగడం లేదు. ఒక అధికారి స్థానిక నాయకులు అందించిన జాబితాను తీసుకుని బస్తీలకు చేరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం తెలిపినట్ల ఒక బృందంలో స్పెషల్ ఆఫీసర్, మునిసిపల్, రెవెన్యూ అధికారి ఉంటారని, యాప్‌లో బాధితుడి ఆధార్ కార్డు నెంబర్ నమోదుతో పాటు అతడి సంతకం లేదా వేలి ముద్ర తీసుకోవడం ఉండాలి. పై ముగ్గురు అధికారులు నగదు పంపిణీ చేసిన జాబితాపై సంతకాలు చేయాలి. కానీ, నిర్దారణ చేయడానికి స్థానిక నాయకుల జాబితానే ప్రమాణికంగా తీసుకుంటున్నారు.

Advertisement

Next Story