గాలి మోటరుపై గాలి మాటలు

by Shyam |
గాలి మోటరుపై గాలి మాటలు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వెయ్యి అబ‌ద్ధాలు.. ల‌క్ష హామీలు.. ఒక్క నిజానికి ‌సాక్ష్యం మామునూరు ఎయిర్‌పోర్టు. మామునూరు నుంచి మ‌ళ్లీ విమానాలు ఎగ‌రాల‌‌న్నది ఓరుగల్లు వాసుల చిర‌కాల స్వప్నం. అయితే ఈ క‌ల‌కు అనేక ఆటంకాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. కొర్రీలు కాచుకునే ఉన్నాయి. అయినా అంతా అయిపోయిన‌ట్లు.. రేపో మాపో ప్రక‌ట‌న వ‌చ్చేస్తోంద‌న్నట్లుగా వ‌రంగ‌ల్‌లో అధికార పార్టీ నేత‌లు తెగ హ‌డావుడి చేస్తున్నారు. ఎయిర్ పోర్టుకు కావాల్సిన భూ సేక‌ర‌ణే పూర్తి చేయ‌ని రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఉత్తుత్తి ఒత్తిడితో రాజ‌కీయ ఉత్తమ నాట‌క‌ ప్రద‌ర్శన చేస్తోంద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

మ‌హాన‌గ‌రంగా విస్తరించిన వ‌రంగ‌ల్‌కు ఎయిర్‌పోర్టు లేక‌పోవ‌డం అనేది నిజంగానే పెద్ద లోట‌ని చెప్పాలి. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వ‌స్తే న‌గ‌రం పారిశ్రామిక‌, సేవ‌ల రంగంలో ఎంతో ముందుడుగు ప‌డుతుంద‌ని వ్యాపార‌వేత్తలు పేర్కొంటున్నారు. వ‌రంగ‌ల్‌లో విమానాశ్రయం పున‌ర్నిర్మాణం జ‌ర‌గ‌డం వ‌ల‌న ప్రయాణికుల‌కు సౌక‌ర్యంగా ఉండ‌టంతో పాటు ఇక్కడి వ్యాపార‌, వాణిజ్యం, టూరిజం అభివృద్ధికి దోహ‌దం చేస్తుంద‌ని వ‌రంగ‌ల్ వాసులు పేర్కొంటున్నారు. ఏటా దుబాయ్‌, అమెరికాతో పాటు ఎన్నో ఇత‌ర దేశాల‌కు వ‌రంగ‌ల్ నుంచి దాదాపు 20 వేల మంది విమాన ప్రయాణం చేస్తున్నార‌ని ఓ అంచ‌నా.

2007లో ఎంవోయూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2007లో మామునూరు ఎయిర్‌పోర్టు పున‌ర్నిర్మాణానికి ముంద‌డుగు వేశాయి. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎంవోయూ కూడా కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కావాల్సిన విద్యుత్‌, నీరు, రోడ్ల నిర్మాణానికి చ‌ర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ‌హించింది. దీనికి తోడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణ స‌మ‌యంలో రాష్ట్ర ప్రభుత్వంతో జీఎంఆర్ సంస్థతో చేసుకున్న ఒప్పందం కూడా వ‌రంగ‌ల్ విమానాశ్రయానికి ప్రధాన ఆటంకంగా నిలుస్తోంది. ఆ ఒప్పందం ప్రకారం.. శంషాబాద్ నుంచి 150 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మ‌రో ఎయిర్‌పోర్టు నిర్మించ కూడ‌దు. వ‌రంగ‌ల్‌లో విమానాశ్రయం పున‌ర్నిర్మాణం కావాలంటే ఈ సాంకేతిక చిక్కు తొల‌గ‌డంతో పాటు మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం భ‌రించేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ రెండు అంశాల‌పై స్పష్టత వ‌స్తే వ‌రంగ‌ల్‌లో విమానం ఎగ‌రడానికి పెద్దగా స‌మ‌యం ప‌ట్టక‌పోవ‌చ్చన్నది ప్రభుత్వ వ‌ర్గాల మాట‌.

1,140 ఎక‌రాలు అవ‌స‌రం.. ఉన్నది 707 ఎక‌రాలే..

1,140 ఎకరాల స్థలం మామునూరు ఎయిర్ పోర్టు కోసం అవసరం ఉందని ఎయిర్ పోర్ట్ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం 707 ఎకరాల స్థలం ఉండగా, మరో రెండు వందల ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వ‌స్తోంది. ఎయిర్ పోర్టు అథారిటీ సూచనల ప్రకారం భూ సేకరణ జరుపుతామని కొద్ది నెల‌ల క్రితం ఎయిర్‌పోర్టులో ప‌ర్యటించిన సంద‌ర్భంగా జిల్లా మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్ విన‌య్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అయితే హామీలు గాలిమాట‌లుగా.. నీటిమూట‌లుగానే మిగిలిపోయింది. నేటికీ విమానాశ్రయం భూ సేక‌ర‌ణ విష‌యంలో ఒక్క అడుగు కూడా ముంద‌డుగు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల్లో ఎయిర్‌పోర్టే కీల‌కం

కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ వ‌రంగ‌ల్‌లో ఎయిర్‌ పోర్టు పున‌ర్నిర్మాణంపై ఈసారి పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. అధికార పార్టీ తాను చేస్తున్న ప్రయ‌త్నాల‌ను ఏక‌రువు పెడుతూ త్వరలోనే సాధిస్తామ‌ని జ‌నక్షేత్రంలో చెప్పుకునే ప్రయ‌త్నం చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫ‌లం చెందింద‌ని విమ‌ర్శిస్తోంది. ఇంత వ‌ర‌కు భూ సేక‌ర‌ణ ఎందుకు చేప‌ట్టడం లేదంటూ సూటిగా ప్రశ్నిస్తోంది. భూసేక‌ర‌ణ పూర్తి చేయ‌కుండానే అనుమ‌తులు రావ‌డం లేదంటూ చెప్పుకోవ‌డం ఏమాత్రం బాగోలేద‌ని పేర్కొంటున్నారు. మొత్తంగా ఎయిర్‌పోర్టు అంశ‌మైతే ఈసారి జ‌ర‌గ‌బోయే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్రధాన ప్రచార, విమ‌ర్శనాస్త్రంగా మార‌బోతోంద‌న్నది వాస్తవం.

గ‌త‌మెంతో ఘ‌నం

స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో ఉన్న అతిపెద్ద విమానాశ్రయాల్లో మామునూరు రెండోది. నిజాం రాజుల్లో చివ‌రివాడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. వ‌రంగ‌ల్ అజాంజాహి మిల్లును దృష్టిలో ఉంచుకుని ఆ పరిశ్రమ‌ను సంద‌ర్శించే వ్యాపారుల సౌక‌ర్యార్థం మామునూరులో విమానాశ్రయం నిర్మించిన‌ట్లుగా తెలుస్తోంది. వ‌రంగ‌ల్‌లోని అజాం జాహీ మిల్లు, షోలాపూర్‌లోని వాణిజ్యం, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కాగితం పరిశ్రమ అభివృద్ధికి దోహ‌దం చేసింది. అనేక మంది ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు 1981 వరకు వారి పర్యటనలకు ఈ విమానాశ్రయంను వినియోగించారు. భారత్- చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నపుడు ఈ విమానాశ్రయం ప్రయాణికులకు సేవలందించింది. ఈ విమానాశ్రయం 1,875 ఎకరాల స్థలంలో 6.6 కి.మీ రన్ వే, పైలట్, సిబ్బంది గృహాలు, పైలట్ శిక్షణా కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినళ్ళు ఉండేవి. అయితే ప్రస్తుతం 707 ఎక‌రాల భూమి మాత్రమే మిగిలింది. 468 ఎక‌రాల భూమిలో టీఎస్ఎస్‌పీ ఫోర్త్ బెటాలియ‌న్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 700 ఎక‌రాల్లో ప్రభుత్వ డెయిరీ ఫాం నిర్మించారు. దీంతో మిగిలిన 707 ఎక‌రాల స్థలం చుట్టూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మూడేళ్ల క్రితం ప్రహారీ నిర్మాణం చేప‌ట్టారు

Advertisement

Next Story