- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరుకే ప్రభుత్వ దవాఖానా.. సేవలన్నీ ప్రైవేటే..!
దిశ, తెలంగాణ బ్యూరో : ‘అంబర్ పేట్‌లో నివసించే రుక్మిణీ(52)కి అకస్మత్తుగా బీపీ పెరగడంతో గాంధీ ఆసుపత్రికి వచ్చింది. ఓపీ విభాగంలో పరీక్షించిన వైద్యులు కొన్ని మందులు రాశారు. చిట్టి తీసుకొని ఫార్మాసీ కౌంటర్‌కు వెళ్తే ఆ మందులు లేవని అక్కడి సిబ్బంది చెప్పారు. డాక్టర్ రాసిచ్చింది బీపీ కంట్రోల్ మందులే కదా అని బాధితురాలు అడగ్గా, స్టాక్ లేదన్నారు. చేసేదేమీ లేక ఓపీ విభాగం ముందున్న ప్రైవేట్ మెడికల్ షాపులలో ఆ ట్యాబ్లెట్లు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోయారు.’
‘మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఓ వ్యక్తి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడు అభిషేక్ (16)ను సోమవారం గాంధీకి తీసుకువచ్చాడు. టెస్టులు అనంతరం వైద్యులు కొన్ని మందులు రాశారు. అవి తీసుకునేందుకు ప్రభుత్వ ఫార్మాసీకి వెళ్లగా ఆ డ్రగ్స్ లేవని స్టాఫ్ చెప్పారు. దీంతో ఆయన కూడా ప్రైవేట్ మెడికల్ షాపులో కొనుగోలు చేయాల్సి వచ్చింది.’
ఇలా వీరిద్దరే కాదు. ప్రతీ రోజు ప్రభుత్వాసుపత్రులకు వచ్చినోళ్లలో 80 శాతం మంది బయట మెడికల్ షాపుల్లోనే మందులు తీసుకుంటున్నట్టు స్వయంగా అధికారులే ఆప్ ది రికార్డులో చెబుతున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, చెస్ట్ హాస్పిటల్స్ లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బంది వెల్లడించారు. సమయానికి ఇండెంట్ పెట్టినా టీఎస్ఎంఎస్ఐడీసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ ప్రా స్ర్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) సకాలంలో మందులు పంపడం లేదని ఆయా ఆసుపత్రుల అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుతుందనే భరోసాతో వచ్చే పేషెంట్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఫ్రీ గా అందిస్తామని పదే పదే చెబుతున్న సర్కార్ దవాఖానాల్లో టెస్టులు, మందులు దోపిడీ ఎక్కువైదంటున్నారు. ఒకవైపు రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నామంటూనే, మరోవైపు మందులు, టెస్టులు పేరిట పేషెంట్ల జేబులు గుల్ల చేస్తున్నారు. కొందరు డాక్టర్లు ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి చేస్తున్న వ్యవహారమంతా ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకునే వారు కరువయ్యారు. ఎవరి కమీషన్లు వారికి వెళ్తే, తమను ఎవరు ఇబ్బంది పెడతారంటూ గాంధీ ఆసుపత్రిలో ని ఓ మెడికల్ షాపు నిర్వహుకుడు విస్తుపోయే విషయాన్ని తెలిపారు. దీంతో పేద రోగులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. అప్పు చేసి మరీ మందులు, టెస్టులు చేసుకోవాల్సి వస్తున్నదని పలువురు పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్న వేళ అన్ని రకాల మందులను సమకూర్చుకోవాల్సిన అధికారులు కేవలం జ్వరం, జలుబు, దగ్గు, మాత్రలతో నెట్టుకొస్తున్నారు. మిగతా విభాగాలకు చెందిన మందులు అవసరం ఉన్నా, ప్రైవేట్ మెడికల్ షాపులలో కొనుగోలు చేయాల్సిందేనని స్వయంగా వివిధ విభాగాల్లోని డాక్టర్లు రిఫర్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. సోమవారం గాంధీలో కనీసం బీపీ, షుగర్ మెడిసిన్స్ కూడా లేవంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.
పది వేల కోట్ల ముచ్చట ఏటుపాయే…
పదివేల కోట్లతో ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ ప్రకటించి నెలన్నర గడిచినా, క్షేత్రస్థాయిలో ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇప్పటికీ అరకొర మౌలిక వసతులు, సిబ్బందితోనే ముందుకు సాగిస్తున్నారు. ‘సీఎం మాటలేమో కోటలు దాటుదాయి, చేతలు గడప కూడా దాటడం లేదని’ స్వయంగా అధికారులే చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జ్వరాలు పుల్.. మందులు నిల్..
గత పదిహేను రోజులుగా రాష్ర్ట వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రుల్లో పేషెంట్ల రద్దీ పెరిగింది. సాధారణ రోజుల కంటే 40 శాతం అదనంగా రోగులు వస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో రోగులకు సరిపడా మందులు లభించడం లేదంటున్నారు. వాస్తవంగా వ్యాధుల సీజన్‌లో ఎక్కువ స్టాక్ పెట్టుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రోగులకు తిప్పలు తప్పడం లేదు.
జిల్లాల వారీ పరిస్థితి మరీ దారుణం..
ప్రతీ రోజు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు వేలాది మంది రోగులు చికిత్స కొరకు వస్తుంటారు. ఉచిత వైద్యం అందుతుందని నమ్మకంతో వస్తుండగా, ఆ దవఖాన్లలో పరిస్థితిని చూసి పరేషాన్ అవుతున్నారు. రోగి సహయకుడికి షెల్టర్ లేక, టెస్టింగ్ మిషన్లు, మందుల కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉచితంగా వైద్యం అందుతుందని వస్తే, లాడ్జీలకు, ప్రైవేట్ ల్యాబ్‌లు, మందులు షాపుల్లో మనీ చెల్లిస్తూ చికిత్స నిర్వహించుకోవడం ఏందని ప్రశ్నిస్తున్నారు. పైసలు ఉంటే ప్రైవేట్‌కు పోయే వాళ్లం కదా? ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏందని? ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తెలిపారు.
మరోవైపు ఇన్ పేషెంట్ వాళ్లకూ కొన్ని మందులు, టెస్టులు బయట నుంచి తీసుకోవాల్సి వస్తున్నదని సిద్దిపేట జిల్లాకు చెందిన నిర్మల అనే మహిళ తెలిపారు. కార్డియాలజీ విభాగంలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని ఆమె కన్నీరు పెట్టారు. డాక్టర్ చెకప్‌లు తప్పా, మిగతా అన్నింటి కొరకు ప్రైవేట్‌లనే ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. పదిహేను రోజుల నుంచి చికిత్స పొందుతున్న తన భర్త కోసం చివరకు గోల్డ్ కూడా తాకట్టు పెట్టినట్టు ఆమె వాపోయారు.