పెండింగ్ ఫైళ్ల పరిష్కారం కోసం గైడ్‌లైన్స్

by Anukaran |
పెండింగ్ ఫైళ్ల పరిష్కారం కోసం గైడ్‌లైన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెండింగులో ఉన్న భూ సమస్యలన్నింటిని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సమస్యలతో పట్టాదారు పుస్తకాలు రాకపోవడంతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ధరణి పోర్టల్‌లో వారి వివరాలు లేకపోవడంతో క్రయ విక్రయాలకు అవకాశం లేకుండాపోయింది. రైతుబంధు, రైతు బీమా వంటి సదుపాయాలకూ నోచుకోలేదు. చాలా కాలం అపరిష్కృతంగా సమస్యలు పేరుకుపోవడంతో తహసీల్దార్లపై భారం పడింది. ఈ క్రమంలోనే రెవెన్యూ, భూ సమస్యలు, ధరణి పోర్టల్‌లో ఆప్షన్లపై 11వ తేదీన ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో జరిగిన సీఎం కేసీఆర్ సమీక్షకు అనుగుణంగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి భూ సమస్యను వెంటనే ప్రారంభించాలని, ఏ ఒక్కటీ పెండింగులో ఉంచొద్దని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అన్ని సమస్యలను నిర్దిష్ట కాల పరిమితిలోనే పరిష్కరించే బాధ్యత కలెక్టర్లే అని చెప్పారు. ప్రతి సమస్యను వేగవంతంగా పరిష్కరించి, ప్రతీ పరిష్కారాన్ని ఎలక్ట్రానికల్లీ రికార్డు చేయడంతో పాటు ప్రతి పెండింగ్ రెవెన్యూ సమస్యను పారదర్శకంగా పరిష్కరించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యూటేషన్ల కోసం..

గతంలో భూములను కొన్న వారు మ్యూటేషన్ కోసం ధరణి పోర్టల్ లో తప్పక దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు కలెక్టర్ లాగిన్ లోకి బదిలీ చేస్తారు. దాంట్లో దరఖాస్తుదారుడు, రిజిస్ట్రేషన్ రికార్డులు, ఆర్వోఆర్ వివరాలు ఉంటాయి. దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ ఆమోదముద్ర వేస్తారు. ఒకవేళ క్లియర్ లేకపోతే విచారణకు ఆదేశిస్తారు. ఆమోదించినా, తిరస్కరించినా సంబంధిత సమాచారం దరఖాస్తుదారుడి మొబైల్ కి వస్తుంది. కలెక్టర్ నుంచి ఆమోదించినట్లుగా మెసెజ్ వచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ ఇవ్వాలి. తహసీల్దార్ కొనుగోలుదారుడి పేరిట అదే రోజు ధరణి పోర్టల్ లో అప్ డేట్ చేస్తారు. అమ్మిన వ్యక్తి పట్టాదారు పాసు పుస్తకం నుంచి తొలగిస్తారు. వెంటనే పట్టాదారు పాసు పుస్తకం ప్రింట్ చేసి ఇస్తారు. ప్రింటెడ్ పట్టాదారు పాసు పుస్తకాన్ని ఇంటికే పంపుతారు.

కంపెనీలు, సంస్థల కోసం..

భూములు కొనుగోలు చేసిన కంపెనీలు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టులకు సంబంధించిన లీగల్ వ్యక్తి ధరణి పోర్టల్ దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఆథరైజ్డ్ పర్సన్ వివరాలు, ఆథరైజ్డ్ పర్సన్ వ్యక్తిగా అపాయింట్ చేస్తూ తీర్మానం కాపీని జత చేయాలి. తర్వాత భూమి వివరాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. అప్పుడు వాటిని పరిశీలన అనంతరం దరఖాస్తుదారుడి మెసెజ్ పంపుతారు. దాన్ని బట్టి మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాలి. తహసీల్దార్ దగ్గరికి వెళ్లి ఆథరైజ్డ్ పర్సన్ బయోమెట్రిక్ వివరాలను ఇచ్చిన తర్వాత కంపెనీ పేరిట పట్టాదారు పుస్తకం జారీ అవుతుంది. ధరణిలోనూ అప్ డేట్ చేస్తారు. ఎన్​ఆర్​ఐలు కూడా వివరాలు ఇచ్చిన తర్వాత దాదాపు ఇదే ప్రాసెస్​ ఉంటుంది.

మీ సేవ కేంద్రాల్లో పెండింగ్ ఆధార్ కేసులు..

తప్పుగా ఆధార్ నమోదైనా, గతంలో ఆధార్ నంబరు, బయోమెట్రిక్ ఇవ్వకపోయినా, పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయకపోయినా మీ సేవ కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఆయా వివరాలను కలెక్టర్ పరిశీలనకు వెళ్తుంది. ఆమోదిస్తే తహసీల్దార్​ డిజిటల్ సంతకం చేసి, ఈ పాసు బుక్ అప్పటికప్పుడు ఇస్తారు. ప్రింటెడ్ పట్టాదారు పాసు పుస్తకాన్ని అడ్రస్​కు పంపుతాడు. పట్టాదారు పాసు పుస్తకంలోనైనా విస్తీర్ణం తప్పుగా నమోదైతే కూడా ఇదే విధానంతో పరిష్కరిస్తారు.

100 లోపు ఉంటనే..

ఏదైనా గ్రామంలో 100 లోపు దరఖాస్తులు వస్తేనే పరిష్కరిస్తారు. 100కు పైగా దరఖాస్తులు వచ్చిన గ్రామాల్లో సాదాబైమానాల పరిష్కారాన్ని పెండింగులో ఉంచనున్నారు. దరఖాస్తుల జాబితాలు కలెక్టర్ లాగిన్ లోకి వెళ్తాయి. వాళ్లు పరిశీలించిన ఆమోదముద్ర వేస్తారు. ఏదైనా లోపాలు ఉంటే తిరస్కరించనున్నారు. ఫీల్డ్ ఎంక్వయిరీ చేయిస్తారు. వారి రిపోర్టు ఆధారంగానే నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

కలెక్టర్లు పరిష్కరించాల్సిన అంశాలు

* స్పెషల్ ట్రిబ్యునళ్ల ద్వారా రెవెన్యూ కోర్టు కేసులు. పెండింగ్ ఆర్వోఆర్ కేసులు మాత్రమే పరిష్కరిస్తారు.
* పెండింగ్ మ్యూటేషన్లు, కంపెనీలు, సంస్థలకు పాసు పుస్తకాల జారీ, ఎన్ఆర్ఐలకు పాసు పోర్టు ద్వారా పాసు పుస్తకాల జారీ
* ఆధార్ పెండింగ్ కేసులు, పట్టాదారు పాసు పుస్తకాల్లో ఎంట్రీకి నోచుకోని విస్తీర్ణాల నమోదు, ఎల్టీఆర్ కేసులు, పీఓబీ జాబితాలోని ఆస్తుల సవరణలు.
* సాదాబైనామాల దరఖాస్తులు, ఇతర అన్ని భూ సంబంధ అంశాల పరిష్కారం.

Advertisement

Next Story