30 ఏండ్ల నుంచి అడుగుతున్నా.. పలకడంలే

by  |
30 ఏండ్ల నుంచి అడుగుతున్నా.. పలకడంలే
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : శ్రీశైలం ఆనకట్ట నిర్మాణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 60కి పైగా గ్రామాలు మునిగిపోయాయి. నాటి నుంచి నేటికీ బాధితులకు పరిహారం, పునరావాసం పూర్తి స్థాయిలో అందలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన ముంపు బాధితులకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఇండ్లు ఇస్తామని నాటి పాలకులు హామీనిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ బాధితుల తరపున మాట్లాడిన నాయకులు ఇప్పడు నోరు మెదపడం లేదు.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములు ఇచ్చిన బాధితులకు నేటికీ న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ పలువురు నాయకులు బాధితులకు మద్దతుగా మాట్లాడారు. కానీ ప్రత్యేకం రాష్ట్రం ఏర్పడినా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పరిహారం కోసం వారు నిర్వాసితులు 30 ఏండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా ప్రవహిస్తున్న కృష్ణానది‌పై 30 ఏండ్ల క్రితం అప్పటి పాలకులు శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 60‌కి పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వారికి న్యాయం చేయకుండా పాలకులు జాప్యం చేస్తూ వస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 26 గ్రామలు, అలంపూర్‌లోని 25 గ్రామాలు, గద్వాల‌లో సుమారు 6 నుంచి 8గ్రామాలు, వనపర్తిలో 10 గ్రామాలు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు పట్టించుకోకున్నా.. తెలంగాణలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన నిర్వాసితులకు నిరాశే ఎదురవుతున్నది.

సాగునీరు అందించడం‌లో అన్యాయం

శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం వల్ల కొల్లపూర్, ప్రస్తుత పెంట్లవల్లి మండలంలో ముంపునకు గురైన ఏ ఒక్క గ్రామానికీ సాగునీరు అందుతుందా? లేదా అనే విషయంపై పాలకులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఈ నిర్మాణం వల్ల అత్యధికంగా ముంపునకు గురై నష్టపోయిన చిన్నంబావి మండలానికి పూర్తి స్థాయిలో నీరు అందించడంలోనూ పాలకులు విఫలమయ్యారు. ఆనకట్ట నిర్మాణం పూర్తయి 30 ఏండ్లు గడుస్తున్నా నియోజకవర్గంలో సాగునీరు పురోగతి మెరుగుపడకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌పై అధారపడి నిర్వాసిత గ్రామాల్లో సుమారు 10 నుంచి 15 మినీ ఎత్తిపోతల పథకాలు నిర్మించినా వాటిల్లో ఒక్కటి కూడా పని చేయడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 40 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు వున్న నాలుగు టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న ఏలూరు, సంగోటం, గుడిపల్లి, జొన్నలబొగుడ.. మొత్తం కలిపినా కూడా 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడం శోచనీయం.

పాలమూరు-రంగారెడ్డి‌పై చిన్నచూపు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సైతం ప్రభుత్వం చిన్న చూపు కారణంగా జిల్లా వాసుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం పోతిరెడ్డిపాడు నుంచి అధిక మొత్తంలో నీటి తరలింపుకు చేస్తున్న కుట్రలు ఫలిస్తే పాలమూరు-రంగారెడ్డి నిర్మాణం పూర్తి చేసినా పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదు.

మినీ ఎత్తిపోతలపై పట్టింపేది?

30 ఏండ్ల క్రితం నాటి కొల్లాపూర్ ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు, రామచంద్రరావు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతంలో ఎత్తిపోతలు ఏర్పాటుచేసి సుమారు 5 నుంచి 10 ఏండ్లు.. మినీ ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం వాటిని పట్టించుకునే వారు కరువవడంతో అవి మరుగునపడ్డాయి. ఆ తర్వాత గెలుపొందిన కట్టికనేని మధుసూదన్‌‌రావు, జూపల్లి కృష్ణా‌రావు, ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి సైతం మినీ ఎత్తిపోతల పథకాలు పూర్తితో పాటు కేఎల్‌ఐ, పాలమూరు రంగారెడ్డి నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఏనాడూ కృష్ణానదిలో న్యాయంగా మనకు రావాల్సిన నీటి వాటాల‌పై మాత్రం గొంతు విప్పలేదు. గతంలో కేఎల్ఐ నిర్మాణ దశలో శ్రీశైలం బ్యాక్ వాటర్ 885 అడుగులు నిలిచి ఉండే విధంగా హైకోర్టులో కేసు వేసి ఒకసారి జూపల్లి కృష్ణారావు మాట్లాడినా.. ఆ తర్వాత దానికి పట్టించుకోలేదు. అదే సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి సైతం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు‌పై హరిత ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు. వీరిద్దరూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరాక నోరు విప్పడం లేదు. నాయకులు, పాలకుల తీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.


Next Story

Most Viewed