- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ కార్మికుల వేతనాలపై పెండింగ్‌లోనే సర్కార్ నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ ఎలాగో గట్టెక్కింది. కానీ ఆర్టీసీ కార్మికుల వేతన పెంపు అడుగు ముందుకు పడటం లేదు. అందరి వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ కార్మికుల అంశంలో మాత్రం అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేతనాల పెంపు సాధ్యం కాదంటూ ఆర్టీసీ యాజమాన్యం ఒకేమాట చెపుతోంది. వేల కోట్ల అప్పులు, అదేస్థాయిలో నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీలో ఇప్పుడు వేతనాలు పెంచాలంటే కష్టమేనని, ఛార్జీల పెంపు ఉంటేనే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందని మరోమారు ప్రభుత్వానికి నివేదించింది. అయితే ఛార్జీల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పుడున్న నష్టాలను తట్టుకోవాలంటే కిలోమీటరుపై 0.50 పైసల వరకు పెంచాలని ప్రాథమికంగా నివేదించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛార్జీలు పెంచితే ఎలాంటి రియాక్షన్ వస్తుందనే భయంతో ఉంటున్నారు. ఇక ఛార్జీలు పెంచితే ఆర్టీసీని ప్రజలకు దూరం చేసినట్లేనని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రెండు పీఆర్సీలు బాకీ
ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయి. 2017 ఏప్రిల్ 1, 2021 ఏప్రిల్ 1న పీఆర్సీ అమలుచేయాల్సి ఉంది. అయితే 2019లో 16 శాతం ఐఆర్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఫిట్ మెంట్‌తో కూడిన వేతన సవరణ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికులకు కూడా వేతనాలు పెంచుతామంటూ ప్రకటించారు. కానీ ముందుగా బస్ ఛార్జీలు పెంచిన తర్వాతే వేతన సవరణపై నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు తేలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేతనాల పెంపు సాధ్యం కాదంటూ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం నివేదించింది. ఆర్టీసీ కార్మికుల అంశంలో ప్రభుత్వం ప్రతిసారి మాట తప్పుతోంది. 2020 డిసెంబర్లో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల అంశంలో కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫిట్‌మెంట్‌ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అమలు చేస్తామని, ఆర్థికభారం ఉంటే ప్రభుత్వమే భరిస్తుందన్నారు. దీంతో ఆర్టీసీ కార్మికుల కష్టాలు గట్టెక్కినట్లేనని సంబురపడ్డారు. కానీ నేటికీ ఆ హామీ అలాగే ఉంది.
నష్టాలతో కష్టాలు
నిత్యం వేలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ నష్టాలను మాత్రం అధిగమించడం లేదు. తాజాగా ఈ నష్టాలను భరించాలంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిందే అంటూ సమావేశంలో నిపుణులు నివేదిక ఇచ్చారు. పెరుగుతున్న డీజిల్ ధరలు, నిర్వాహణ వ్యయం, కార్మికుల వేతనాల పెంపు, వడ్డీల చెల్లింపు వంటి అంశాలు ఆర్టీసీకి తీవ్ర భారంగా మారుతున్నాయి. ఇవన్నీ తీరాలంటే ఛార్జీల పెంపు అనివార్యంగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయం. ఆర్టీసీని కష్టాల నుండి గట్టెక్కించాలంటే బడ్జెట్లో కనీసం ఒకశాతం నిధులు కేటాయించాలనే డిమాండ్స్ ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం గతంలో కంటే కొంతమేర ఎక్కువగానే నిధులు కేటాయించింది. రూ.1500 కోట్లు ఆర్టీసీ కోసం బడ్జెట్లో ప్రతిపాదించారు. అయితే ప్రతిసారి బడ్జెట్లో నిధులు ప్రతిపాదిస్తున్నా.. విడుదల మాత్రం అందుకనుగుణంగా చేయడం లేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు రూ. 3 వేల కోట్లు దాటింది. ఈ అప్పులపై ఏటా రూ.270 కోట్ల వరకు ఆర్టీసీ సంస్థ వడ్డీలు చెల్లిస్తోంది. కొన్ని సందర్భాల్లో వేతనాల కోసమే ఇబ్బందులు పడుతున్నారు. పాత అప్పులు, ఇప్పుడు వస్తున్న నష్టాల నుంచి ఆర్టీసీ కొంతైనా బయటపడాలంటే ప్రభుత్వం చేసే సహాయంతో పాటు మరోసారి చార్జీలు పెంచితేనే ఆర్థిక ఉప శమనం లభిస్తుందని ఇటీవల ఆర్టీసీ రివ్యూలో అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు ఛార్జీల పెంపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బస్సులు ఎక్కే సాధారణ ప్రయాణికులూ భారీగా తగ్గిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఛార్జీలు పెంపుపై ఆర్టీసీ తీసుకునే నిర్ణయం సరైనదేనా అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. గతంలో పెంచినట్లే చార్జీల ధరను రౌండ్ ఫిగర్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మూడేండ్ల నుంచి పదవీ విరమణ బెనిఫిట్స్కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేసేందుకు సరిపడా డబ్బులు లేవంటూ వాయిదా వేస్తున్నారు. దీనికితోడు ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న సీసీఎస్ నిధులను అడ్జెస్ట్ చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కోర్డు నుంచి మొట్టికాయలు వేస్తుండటంతో అప్పుడప్పుడు రూ. 50 కోట్ల వరకు సర్దుబాటు చేస్తున్నారు. సీసీఎస్‌తో పాటు రిటర్మెంట్ బెనిఫిట్స్, ఇతర పద్దుల కోసం ఇటీవల రూ.1000 కోట్ల అప్పుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. కానీ ఇంకా ఈ రుణం చేతికందలేదు. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు ఎలా అనేది సందేహంగానే మారింది. కానీ అతి తక్కువగా వేతనాలు అందుకుంటున్న ఆర్టీసీ కార్మికులు మాత్రం ఇప్పుడు రెండు పీఆర్సీలను సాధించుకునేందుకు ఏం చేయాలనే అంశంపై చర్చ పెడుతున్నారు.
డీజిల్ భారం పెరుగుతోంది
అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి లాక్డౌన్ కష్టాలతో పాటుగా పెరుగుతున్న ఇంధన ధరలు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. లాక్డౌన్ ముందు వరకు ఆర్టీసీకి రూ. 12 కోట్ల ఆదాయం రోజువారీగా వస్తున్నా.. డీజిల్ ధరలు పెరుగడంతో జీతాలకు కూడా సమస్యగా మారింది. లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరి నుంచి ఈ జూన్ వరకు లెక్క ప్రకారం సరిగ్గా రూ.26 చొప్పున లీటర్‌పై పెరిగాయి. ఆర్టీసీ లెక్కల ప్రకారం డీజిల్‌పై ఒక్క రూపాయి పెరిగితే ఆర్టీసీకి ఏడాదికి రూ.22 కోట్ల అదనపు నష్టం. ఈ లెక్కన ఇప్పటి వరకు డీజిల్‌పై రూ.500 కోట్ల అదనపు భారం పడింది. రాష్ట్రంలో ఇప్పుడు లెక్క ప్రకారం 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు.
అన్ని కార్మిక సంఘాలతో చర్చిస్తున్నాం : రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్
ఆర్టీసీ కార్మికులకు రెండు వేతన సవరణలు జరుగాల్సి ఉంది. ఇప్పటివరకూ అమలు కాలేదు. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 30 శాతం ఫిట్‌మెంట్‌ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అమలు చేయాలి. దీనిపై అన్ని కార్మిక సంఘాలతో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఆర్టీసీపై డీజిల్ భారం రూ. 500 కోట్లు పెరిగింది. దీనికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి.