ఏ బ్యాంకులో ఎంత ఉంది?… లెక్కలు తీస్తున్న ప్రభుత్వం

by Shyam |   ( Updated:2020-04-07 06:12:24.0  )
ఏ బ్యాంకులో ఎంత ఉంది?… లెక్కలు తీస్తున్న ప్రభుత్వం
X

దిశ, న్యూస్ బ్యూరో: మనకు పైసల కష్టం వస్తే ఏం చేస్తాం? వంటింట్లో పోపు డబ్బాల్లో పెట్టి మర్చిపోయిన పైసలేమైనా ఉన్నాయోమేనని వెతుకుతాం. గల్లగురిగిల్లో ఎంతుందో పగలగొట్టి లెక్కపెడతాం. ఇప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి కూడా అంతే ఉంది. జనతా కర్ఫ్యూ నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. జనజీవనం స్థంభించిపోయింది. వ్యాపారాలు బంద్ అయ్యాయి. ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల ఆదాయం జీరో అయింది. ఖజానాకు కరోనా గండికొట్టింది. ఆదాయాన్ని అడ్డుకుంది. ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. రోజుకు రూ.440 కోట్లు రావాల్సినచోట కేవలం కోటిన్నర రూపాయల ఆదాయం మాత్రమే వస్తోంది. ప్రజల సంక్షేమం, ఉద్యోగుల జీతాలు, రోజువారీ పాలనావసరాలు, కరోనా నియంత్రణకు పెట్టాల్సిన ఖర్చు తదితరాలకు డబ్బుల్లేకపోవడంతో బ్యాంకులో ఏయే ఖాతా కింద ఎంత ఉందో లెక్కలు తీస్తోంది ప్రభుత్వం. అన్ని శాఖలకూ యువో(అన్ అఫీషియల్) నోట్ పంపింది. సేవింగ్స్ ఖాతాలతోపాటు, కరెంట్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, వడ్డీ.. ఇలా ఏయే పద్దు కింద ఎంత ఉందో లెక్కలు తీసి పంపాలని అన్ని శాఖలనూ ఆదేశించింది. అందుకు అనుసరించాల్సిన విధానానికి సంబంధించిన
నమూనా తయారు చేసి పంపింది. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ వివరాలన్నింటినీ ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ నోట్‌లో స్పష్టం చేశారు.

ప్రతీ ఏటా ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిన తర్వాత ఆయా పథకాలకు ఖర్చు చేయడం కోసం నిధులను విడుదల చేస్తుంది. కొన్ని పథకాలకు ప్రతీ నెలా వెచ్చించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఒకేసారి విడుదల చేస్తుంది. ఆ నిధులు ఆ పద్దు కింద బ్యాంకు ఖాతాలో ఉండిపోతాయి. అవసరానికి తగినట్లుగా చెక్కుల ద్వారా ఆ శాఖ బ్యాంకు నుంచి తీసుకుంటుంది. కేంద్ర పథకాల అమలుకు కూడా సంబంధిత శాఖల నుంచి నిధులు విడుదలైతే అవి కూడా బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోతాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఎస్సీ అభివృద్ధి-సంక్షేమం, ఎస్టీ అభివృద్ధి-సంక్షేమం, మైనారిటీ.. ఇలా అనేక విభాగాల్లో వాటి బ్యాంకు ఖాతాల్లో ఇలాంటి డబ్బు ఉండిపోతుంది. ఇప్పుడు వాటన్నింటిలో కలిపి ఎంత ఉందో లెక్కతీసి దానికి తగినట్లుగా రాష్ట్రప్రభుత్వ రోజువారీ ఖర్చులకు వినియోగించుకోవాలని ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు మార్చి నెల జీతాల్లో కోత పెట్టిన ప్రభుత్వం ఎలాగోలా నెట్టుకొచ్చింది. ఇప్పుడు వైద్య, పారిశుధ్య సిబ్బందికి ‘సీఎం గిఫ్ట్’ కింద గ్రాస్ శాలరీలో పదిశాతం, పట్టణప్రాంత పారిశుధ్య ఉద్యోగులకు రూ. 7,500, గ్రామీణ పారిశుధ్య సిబ్బందికి రూ. 5,000 చొప్పున సీఎం ప్రకటించారు. వీటికి డబ్బుల్ని సర్దుబాటు చేసుకునే క్రమంలో ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంత మిగిలి ఉందో లెక్కలు వేసుకుంటూ ఉంది.

రాష్ట్ర ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతీలు తీసుకున్న తొలినాళ్ళలో వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించే
సందర్భంగా ఈ అంశంపై దృష్టి పెట్టారు. ఏయే శాఖలో ఎన్ని పథకాలు ఉన్నాయి, ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, ఏయే పద్దు కింద ప్రభుత్వాల నుంచి వచ్చిన డబ్బు ఎంత ఉంది, కరెంట్ అకౌంట్‌తో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటివి చేసినట్లయితే ఎంత ఉంది తదితరాలన్నింటి వివరాలపై ఆరా తీశారు. కొన్ని శాఖల్లో అవసరాలకు మించి ఉన్నఖాతాల వివరాలను కూడా తెలుసుకున్నారు. ఒకప్పుడు ఉనికిలో ఉన్న పథకాల కోసం తెరిచిన ఖాతాలు, ఇప్పుడు అవి లేని పరిస్థితుల్లో వాటిని కొనసాగించడానికి ఉన్న అవసరం… లాంటి అంశాలను కూడా సమీక్షించారు. ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా చిక్కుల్లో పడడంతో అలాంటి అన్ని శాఖల్లోని ఖాతాల్లో నిల్వ ఉన్న డబ్బు ఎంతో తెలుసుకుంటోంది. సుమారు రూ. 1,500 కోట్ల మేరకు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారుల అంచనా.

ఇలా లెక్క తేలిన డబ్బును ప్రభుత్వం తక్షణం ఎలాంటి అవసరాలకు ఖర్చుపెట్టవచ్చో ఇకపైన ఆలోచనలు చేయనుంది. వచ్చే నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పేదలకు ఆసరా పింఛన్లు… ఇలా తప్పనిసరిగా పెట్టాల్సిన ఖర్చులకు ఈ డబ్బును వినియోగించే అవకాశం ఉంది. ప్రతీ నెలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఆసరా పింఛన్లకు కనీసం రూ.3,500 కోట్ల మేర ఖర్చవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేనందువల్ల ఒకవైపు ఇలాంటి ఖాతాల్లో పేరుకుపోయిన డబ్బును వినియోగించడం, రిజర్వు బ్యాంకు లేదా ఇతర ద్రవ్య సంస్థల దగ్గర అప్పులు తీసుకోవడం మాత్రమే ఆధారం. ఈ నెలకు ఎలాగూ రిజర్వు బ్యాంకు నుంచి సుమారు రూ. 8,000 కోట్ల అప్పు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరోవైపు వివిధ శాఖల దగ్గర బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ. 1500 కోట్లు ఉంటుందని భావిస్తోంది. ఈ రెండు మార్గాల ద్వారా సమకూరిన డబ్బును అనివార్య ఖర్చులకు వినియోగించే అవకాశం ఉంది.

Tags : Telangana, Finance, UO Note, Bank Accounts, Departments, LockDown effect

Advertisement

Next Story