ఏపీని రోల్ మోడల్‌గా నిలుపుతాం : మేకపాటి

by srinivas |
ఏపీని రోల్ మోడల్‌గా నిలుపుతాం : మేకపాటి
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలుపుతామని పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్యం, జౌళి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సమావేశ మందిరంలో ఆ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంస్కరణలతోనే సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇప్పటివరకూ ఎలా ఉన్నా ఇకపై పారదర్శకత, జవాబుదారీతనంతో చేపట్టే ప్రతి కార్యక్రమమూ ప్రజల ముందుపెడతామని చెప్పారు. ఐఎస్‌బీ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలలో సమకాలీక వృద్ధి సాధిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు మారినా చెక్కుచెదరని విధానాలను రూపొందిస్తామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ఐఎస్‌బీ సుముఖత వ్యక్తం చేసిందని అన్నారు. ఐఎస్‌బీ తోడ్పాటుతో డిజిటల్, టెక్నాలజీ, ఉద్యోగ కల్పనలో సరికొత్త మార్పులు తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, పటిష్టత కోసం ఐఎస్‌బీతో ‘అడ్వైజరీ కౌన్సిల్’ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఇందులో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు,నిపుణులు, ప్రొఫెసర్లకు భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటులో కూడా ఐఎస్‌బీ సహకారం తీసుకుంటామని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

తొలుత ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖలతో ప్రక్షాళన ప్రారంభిస్తామని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దశలవారీగా ప్రభుత్వంలోని అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. నైపుణ్యాలకి తగ్గ ఉద్యోగాల కల్పన, శిక్షణలో ఐఎస్‌బీ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా పాలనను కొత్త పుంతలు తొక్కిస్తామని అన్నారు. ఇందుకు తగ్గ ప్రణాళిక, విధివిధానాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షతో పాటు అప్రెంటిస్ కూడా ఇస్తామని గౌతమ్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed