గీత కార్మికులు ఆగ్రహం.. నరికితే ఊరుకోమంటూ వార్నింగ్

by Sridhar Babu |   ( Updated:2021-12-15 01:16:18.0  )
Geetha-karmikulua1
X

దిశ, దమ్మపేట: మండలానికి చెందిన కొంతమంది ఇటుక బట్టీ వ్యాపారులు తాటి చెట్లను నరకడంపై దమ్మపేట కల్లుగీత కార్మిక సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టీ వ్యాపారులు అధికారుల నుండి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ఏజెన్సీ ప్రాంతంలోని తాటి చెట్లనే కాకుండా మైదాన ప్రాంతమైన దమ్మపేట, జమేదార్ బంజర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తాటిచెట్లను కూడా నరికివేసి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాటి చెట్టు కలప గట్టిగా ఉండటం వల్ల ఇటుకలను కాల్చే సమయంలో అవి ఎక్కువ సేపు కాలుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటుక వ్యాపారులు తాటి చెట్లను ఎంచుకొని ఎక్కడపడితే అక్కడ తాటి చెట్లను నరికి వేస్తున్నారు. రూల్స్ ప్రకారం తాటి చెట్లను నరకాలంటే జిల్లా అధికారుల అనుమతులు పొందిన తర్వాతే వాటిని నరకాలి. కానీ ఇటుక బట్టీ వ్యాపారులు రైతుల దగ్గరికి వెళ్లి వారికి కొంత నగదు ఇస్తామని నమ్మబలికి తాటి చెట్లు నరికి వేస్తున్నారని, తద్వారా గీత కార్మికులైన తాము జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టీ వ్యాపారులు ఇప్పటికైనా తాటి చెట్లను నరకడం మానకపోతే జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ అధికారులకు కంప్లైంట్ చేస్తామని, లేకపోతే మండలంలో ఎక్కడ కూడా ఇటుక బట్టీలు నిర్వహించకుండా చేస్తామని హెచ్చరించారు.

Geetha-karmikulua-2

జీవనోపాధిని కోల్పోతున్నాం: బంధం చెన్నారావు, దమ్మపేట కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు

మండలంలోని కొంతమంది ఇటుక బట్టీ వ్యాపారులు వల్లనే మేం జీవనోపాధిని కోల్పోతున్నాం. దమ్మపేట, జమేదార్ బంజర పంచాయతీలలో ఉన్న తాటి చెట్లు నరకడం చాలా బాధాకరం. 2018 సంవత్సరం వరకు మైదాన ప్రాంతంలో ఉన్న కొన్ని తాటి చెట్లకు ప్రభుత్వానికి పన్ను చెల్లించాం. వాటిని కూడా ఇటుక బట్టీ వ్యాపారులు నరికి వేస్తున్నారు. తాటి చెట్లను నరికివేస్తే రాబోయే రోజుల్లో కల్లుగీత కార్మికులు కల్లు అమ్మడం కష్టం. ఇప్పటికైనా వ్యాపారులు తాటి చెట్లను నరకడం ఆపేయాలి.

Advertisement

Next Story

Most Viewed