గూగుల్‌ను పాలించే ఇండియన్ హీరో సుందర్ పిచాయ్

by Anukaran |   ( Updated:2021-06-10 03:59:36.0  )
Google CEO Sundar Pichai
X

దిశ, వెబ్‌డెస్క్: మొత్తం ఇంటర్నెట్‌ను గూగుల్ పాలిస్తుంటే.. ఆ గూగుల్‌నే పాలిస్తున్నాడతను. ఇండియాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించే స్థాయి చేరుకున్నాడు. ఒకప్పుడు బ్యాగ్ కూడా కొనుక్కునే స్థాయిలేని వ్యక్తి, ఇప్పుడు సంవత్సరానికి కొన్ని వందలకోట్ల జీతం అందుకుంటూ, ప్రపంచంలోని ఎక్కువ శాలరీ అందుకుంటున్న వాళ్లలో ఒకరిగా నిలిచాడు. ఆయనెవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. గూగుల్ కంపెనీలో ఉద్యోగం వస్తే చాలని కొన్ని లక్షల మంది ఆశపడుతుంటారు. అలాంటిది ఆయన గూగుల్‌కే సీఈఓ అయ్యారు. అలాంటి సుందర్ పిచాయ్ పుట్టినరోజు(10-06-2021) సందర్భంగా జీవితం గురించి ఓ లుక్కెద్దాం.

సుందర్ పిచాయ్ జూన్ 10, 1972లో తమిళనాడులోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి రఘునాథ పిచాయ్. ఒక కంపెనీలో ఎలక్ట్రానికల్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. అమ్మ స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. సుందర్ పిచాయ్ చిన్నతనంలో వాళ్ల ఇంట్లో చిన్న టీవీ కూడా ఉండేది కాదు. ఆ పరిస్థితులను చూసిన సుందర్ చిన్నప్పటినుంచే చదువులో ముందుండేవాడు. క్రికెట్‌లోనూ మంచి ప్రతిభ కనభర్చేవాడు. చిన్నప్పుడు క్రికెటర్ కావాలని బలంగా కోరుకున్నాడట. ఈ క్రమంలో చదువులో ఎక్కడా రాజీపడకుండా.. ఇండియాలోనే ప్రముఖమైన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటాలాజికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందాడు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేయడానికి స్కాలర్‌షిప్ గెలుచుకున్నాడు.

ఆ సమయంలో ఆయన వద్ద అమెరికా వెళ్లడానికి డబ్బులేకపోతే.. వాళ్ల నాన్న అప్పుచేసి సుందర్‌ను అమెరికా పంపించాడు. ఆ తర్వాత అమెరికాలోని చదువుకుంటూ పలు సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు. సరిగ్గా 2004 ఏప్రిల్ 1వ తేదీన సుందర్ పిచాయ్ గూగుల్ కంపెనీ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, ఇండియా నుంచి అమెరికా వెళ్లడానికి డబ్బులేని స్థాయి నుంచి కరోనా విపత్కర పరిస్థితుల్లో మన దేశానికే సాయం చేసే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం.

Advertisement

Next Story