భారత్‌లో గూగుల్ భారీ పెట్టుబడులు!

by Harish |
భారత్‌లో గూగుల్ భారీ పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ దిగ్గజ కంపెనీ గూగుల్ త్వరలో భారత్‌లో భారీగా పెట్టుబడులను పెట్టనున్నట్టు వెల్లడించింది. గూగుల్ ఇన్వెస్ట్ చేయబోయే భారత డిజిటలైజేషన్‌ నిధుల గురించి ప్రకటించడం ఎంతో సంతోషాన్నిస్తోందని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. సోమవారం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సుందర్ పిచాయ్ రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో భారత్‌లో రూ.75,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. గూగుల్ ఇన్వెస్ట్ చేయబోయే ఈ మొత్తం నిర్వహణ అవసరాలకు, ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్య విభాగాల్లో సమకూర్చనున్నట్టు పిచాయ్ వివరించారు. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తుపై తమకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు. భవిష్యత్తులో భారత డిజిటలైజేషన్‌లో కీలక నాలుగు రంగాల్లో ఈ పెట్టుబడులు దృష్టి సారించనున్నట్టు తెలిపారు. భారతీయులందరికీ సొంత భాషలో సమాచారాన్ని అందించడం, భారత్‌లోని అవసరాలకు కావాల్సిన ఉత్పత్తులు, సేవల అభివృద్ధికి, పరిశ్రమల డిజిటలైజేషన్‌కు సహకారం, సామాజిక ప్రయోజనాల్లో భాగంగా వైద్య, విద్య, సేద్యం రంగాల్లో ఆటోమెషన్ ఇంటిలిజెన్స్ అమలు చేసేందుకు ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్టు పిచాయ్ వెల్లడించారు. ఇదే సమావేశంలో ప్రధాని మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని సుందర్ పిచాయ్ ప్రశంసించారు. భారత్ ఆన్‌లైన్ విభాగంలో గొప్ప పురోగతి సాధించినట్టు, ఇది డిజిటల్ కనెక్టివిటీకి బలమైన పునాదులను నిర్మించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లు, డేటా ధరలు తగ్గిపోవడం, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను కల్పించడం వల్ల కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed