ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 50 లక్షల మందికి ఉద్యోగాలు

by srinivas |
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 50 లక్షల మందికి ఉద్యోగాలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి. త్వరలో రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్రో కెమికల్ కారిడార్‌తో రాష్ట్రంలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. పెట్రో కెమికల్ కారిడార్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పెట్రోలియం సెక్రటరీలు చర్చించి ఈ అంశంపై ఒక ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పుకొచ్చారు.

అలాగే కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుపై కూడా చర్చించామన్నారు. అలాగే గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటుతో ఇథనాల్ ఉత్పత్తికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని అందుకు వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. పెట్రో కెమికల్ రిఫైనరీకి రూ.32వేల కోట్లు కావాలని దీనిపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. వీటితోపాటు విశాఖ ఉక్కు పరిశ్రమ, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కూడా ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story