ఆడిందే ఆట.. పట్టుకునేది లేదటా..

by Shyam |
ఆడిందే ఆట.. పట్టుకునేది లేదటా..
X

దిశ, హైదరాబాద్: జీహెచ్ఎంసీ క్రీడల విభాగంలో ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది. ఎవరేమన్నా.. ఎవరేం చెప్పినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నగరంలో క్రీడా మైదానాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆడుతున్న ఆటలకు అదుపులేకుండా పోతోంది. స్థానికుల మీద అజామాయిషీ ప్రదర్శించడంతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునే వారే కనిపించడం లేదు. నేరుగా క్రీడల విభాగం ఉన్నతాధికారులకు పిర్యాదులు చేసినా స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
బల్దియా పరిధిలో 521 ప్లే గ్రౌండ్ లు ఉన్నాయి. ఎక్కడా కూడా పర్మినెంట్ కోచ్‌లు లేరు. అయితే, క్రీడల శిక్షణ కోసం సామగ్రి కొనుగోళ్లు, స్లాట్ల కేటాయింపులో అక్రమాలకు కొదవ లేదు. ముఖ్యంగా గ్రౌండ్ల వద్ద కాపలా, నిర్వాహణ పనుల కోసం ఏర్పాటు చేసిన అవుట్ సోర్సింగ్ ఆగడాలకు అదపు లేకుండా పోతోంది. రాజకీయ పైరవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తూ ఆట స్థలాలనే వారికి అడ్డాలుగా మార్చుకున్నారు. మరికొన్ని ప్లే గ్రౌండ్లు అయితే అవి ప్రభుత్వానికో లేక అసాంఘీక కార్యకలాపాల స్థావరాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి. వీరిపై ఎందరు ఫిర్యాదులు చేసినా బల్దియా క్రీడావిభాగం ఉన్నాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులకు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అంత అన్యోన్య సంబంధం ఎందుకో మరి.. ఏండ్ల తరబడిగా అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ వేతనాలు తీసుకొని ప్రయివేటు కార్యకలాపాలు చేస్తున్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఔత్సాహిక క్రీడాకారుల నుంచి వచ్చే దరఖాస్తుల్లో సైతం సొమ్ము చేసుకుంటూ ఆటలు నేర్పించడం లేదు. అధికారులు పట్టించుకోవడంలేదంటేనే వారి వాటా లేకుండా పోతుందా అనేది సిటిజన్ల అనుమానం.. అక్రమాలకు పాల్పడుతున్నా.. ఫిర్యాదులు చేసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం వెనక అంతర్యం జగమెరిగిన సత్యమేనంటారు పలువురు ప్రజాసంఘాల నాయకులు.
తాజాగా అంబర్‌పేట ప్లే గ్రౌండ్‌కు సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై స్థానికులు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తుంటే జీహెచ్ఎంసీ ఆఫీసులన్నీతిరిగినా పట్టించుకునేవారు కనిపించడంలేదు. జీహెచ్ఎంసీ క్రీడల విభాగానికి వెళ్తే ఇన్‌వార్డులో ఇవ్వాలని ఉచిత సలహా ఇస్తారు. ఇన్‌వార్డుకు వెళ్తే క్రీడల విభాగం ఇక్కడే కదా అంటారు.. ఏం చర్యలు తీసుకుంటారనేది తర్వాత.. అసలు ఫిర్యాదు తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేదు. అంబర్‌పేట ప్లే గ్రౌండ్‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా అక్కడి ఇన్‌వార్డు సిబ్బంది తిరస్కరించారని ఫిర్యాదుదారు చెబుతున్నారు. క్రీడావిభాగంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై ఫిర్యాదును తీసుకునేందుకు కూడా ఇంతమంది ప్రభుత్వ అధికారులు ఎందుకు వెనకాడుతున్నారో తెలయడం లేదు. విభాగంలో అవినీతిని నిర్మూలించి మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్లే గ్రౌండ్‌లు క్రీడాకారులకు ఉపయోగపడాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story