గ్రేటర్ మేయర్ ఎన్నికకు వేళాయే

by Shyam |   ( Updated:2021-02-11 00:04:38.0  )
గ్రేటర్ మేయర్ ఎన్నికకు వేళాయే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానే వచ్చింది.. జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలి కొలువు దీరే సమయం రానే వచ్చింది. గురువారం కొత్త కార్పొరేటర్లతో సభ కొలువుదీరనుంది. దీంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి కొత్త కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అది పూర్తయిన తర్వాత హాజరైన సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారులకు విధుల కేటాయింపుతో పాటు పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త కార్పొరేటర్లు, మేయర్ ఎన్నికలకు బల్దియా ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి తొలి మహిళా మేయర్ గా ఎన్నికకానున్నారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎన్నికల పరిశీలకుడిగా సందీప్ కుమార్ సుల్తానియా వ్యవహరించనున్నారు. డిసెంబర్‌లో జీహెచ్ఎంసీ 150 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 56 మంది, బీజేపీకి 48 మంది, ఎంఐఎం నుంచి 44, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ఎన్నికయ్యారు.

వీరిలో ఒక బీజేపీ కార్పొరేటర్ ఇటీవల మరణించారు. దీంతో ప్రస్తుతం 149 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీరితో పాటు బల్దియా పరిధిలో 44 మంది ఎక్స్ అఫిషీయో సభ్యులు నమోదు చేసుకున్నారు. దీంతో గురువారం నిర్వహించనున్న మేయర్ ఎన్నికలో పాల్గొనే ఓటర్ల సంఖ్య 193కు చేరుకుంది. మేయర్ ఎన్నిక సమయానికి అందులో సగం సభ్యులు అంటే 97 మంది సభలో ఉండాల్సి ఉంటుంది. 97 మంది హౌస్ లో ఉంటేనే మేయర్ ఎన్నిక కోరం ఉన్నట్లు ప్రిసైడింగ్ అధికారి నిర్ధారించి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారు. లేదంటే మరో గంట వేచి ఉండి కోరం ఏర్పడే అవకాశాన్ని కల్పిస్తారు. అప్పటికీ 97 మంది సభ్యులు పూర్తి కాలేదంటే మేయర్ ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు.

కీలకంగా ఎక్స్ అఫిషియో సభ్యులు

జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 44 మంది ప్రజా ప్రతినిధులు ఎక్స్ అఫిషీయో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. వీరిలో 15 మంది ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కార్పొరేటర్లతో కలిపి 193 మంది సభ్యుల్లో 97 మంది ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే కార్పొరేటర్లలో ఎంతమంది సమావేశానికి వస్తారన్నది ప్రశ్నగా మారింది. అమవాస్య రోజు ప్రమాణ స్వీకారం చేసేందుకు తాము ఆసక్తిగా లేమని ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో 97 మంది సమావేశానికి హాజరైతేనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. హాజరైన సభ్యుల నుంచి చేతులెత్తడం ద్వారా కొత్త మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఒకే నామినేషన్ వస్తే ఎకగ్రీవంగా ఎన్నికను పూర్తి చేస్తారు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు ఉన్న ఎక్స్ అఫిషియో సభ్యులు మేయర్ ఎన్నికలో కీలకంగా మారనున్నారు.

సాగేదిలా..

పాత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగిసింది. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జీహెచ్ఎంసీ చట్టం సెక్షన్ 88 (బి) ప్రకారం ఎన్నికల సంఘం గెజిట్ ప్రకటించింది. ఉదయం 10:45 నిమిషాల్లోపు కౌన్సిల్ సభ సభ్యులు హాల్‌లోకి చేరుకోవాలి. ఉదయం 11 గంటలకు ప్రిసైడింగ్ అధికారి, పరిశీలనాధికారి సభలోకి వస్తారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో అదే సమయం నుంచి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ప్రమాణ పత్రాలను ఇవ్వడం, కార్పొరేటర్లతో సంతకాలు చేయించే ప్రక్రియ మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతుంది.

ఆ సమయానికి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభమవుతుంది. అయితే ఆ సమయానికి సభలో 97 మంది సభ్యులు తప్పకుండా ఉండాలి. లేదంటే ప్రిసైడింగ్ అధికారి మరో గంట సమయం ఎన్నికను వాయిదా వేసేందుకు అధికారం ఉంది. పార్టీల విప్‌ను ప్రిసైడింగ్ అధికారి తీసుకుంటారు. లేదా సభ్యుల్లో ఎవరైనా తాము మేయర్ పోటీలో ఉన్నట్టు అధికారికి ఆసక్తిని చెబుతారు. అభ్యర్థులకు చేతులెత్తడం ద్వారా సభ్యులు ఓట్లేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది సభ్యుల మద్దతు వచ్చిన వారిని విజేతగా ప్రకటించి, నియామక పత్రం అందిస్తారు.

పార్టీల వారీగా సీటింగ్

బల్దియాలో ప్రమాణ స్వీకార సభలో అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపులు పూర్తిచేశారు. మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఉపయోగించుకుంటున్న అధికారులు, సిబ్బంది మినహా మిగిలిన ఇతర విభాగాల వారు ఇంటి నుంచే విధుల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. పిలిచినప్పుడు ఆఫీసుకు వచ్చేలా అందుబాటులో ఉండాలని సూచించారు. సభలో పాల్గొనేందుకు పార్టీల వారీగా సీటింగ్ కేటాయించారు. టీఆర్ఎస్‌ భాగంలో ముందు వరుసలో ఎక్స్ అఫిషీయో సభ్యులు, వారి వెనకాల కార్పొరేటర్లు కూర్చుంటారు. బీజేపీ, ఎంఐఎం సభ్యులు కూర్చునేందుకు ప్రత్యేకంగా మార్కింగ్ చేశారు.

సభ్యులకు సహకరించిందేకు సీటింగ్‌ సూచించేందుకు ప్రత్యేకంగా ఆఫీసర్లను కేటాయించారు. 15 మంది సీనియర్ ఆఫీసర్స్‌తో పాటు150 వరకూ అధికారులు, సిబ్బంది వివిధ బాధ్యతలను ఎన్నికల్లో నిర్వర్తించనున్నారు. వీరితో పాటు సుమారు 500 మంది పోలీసులు జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ బందోబస్తు నిర్వహించనున్నారు. అనుమతించిన పాస్‌లు కలిగిన వ్యక్తులను నిర్ధారించుకున్న బల్దియా భవనంలోకి, నిర్దేశిత ప్రాంతంలోకి వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story