24ఏళ్ల కనిష్టానికి భారత్ జీడీపీ..!

by Shamantha N |
24ఏళ్ల కనిష్టానికి భారత్ జీడీపీ..!
X

న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదించుకుపోయినట్టు సోమవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు చూస్తే తెలుస్తోంది. గడచిన 24 ఏళ్లలో ఇది కనిష్ఠమని జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా పరిమిత ఆర్థిక కార్యకలాపాలు జీడీపీ గణాంకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5.2 శాతం వృద్ధి నమోదు కాగా, ప్రస్తుతం కరోనాతో ప్రతికూలతను చవి చూసింది. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం దాదాపు రూ. 21 లక్షల కోట్ల ఉద్దీపనలు విడుదల చేసినా దేశవ్యాప్తంగా వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రజల జీవనోపాధి తీవ్ర స్థాయిలోనే దెబ్బతిన్నాయి.

వ్యవసాయం ఒకటే బెటర్​..

1996లో జీడీపీ లెక్కలు ప్రారంభించినప్పటి నుంచి ఈ ఆర్థిక వత్సరం తొలిసారి అతి దారుణమైన క్షీణత నమోదైంది. స్థూల విలువ జోడింపు(గ్రాస్​ వాల్యూ యాడెడ్​-జీవీఏ) 22.8 శాతం క్షీణించింది. తయారీ రంగం 39.3 శాతం, మైనింగ్ 23.3 శాతం తగ్గింది. స్థూల స్థిర మూలధన నిర్మాణం(గ్రాస్​ ఫిక్స్డ్​​ క్యాపిటల్​ ఫార్మేషన్​ – జీఎఫ్‌సీఎఫ్) 52.9 శాతం, విద్యుత్ రంగం 7 శాతం, నిర్మాణ కార్యకలాపాలు 50.3 శాతం కుదించుకుపోయాయని గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మాత్రం 3.4 శాతం వృద్ధి చెందాయని పేర్కొంది.

పలు దేశాల్లో అదే పరిస్థితి..

జీడీపీ నమోదులో ఒక్క భారత్​ మాత్రమే కాకుండా మర్నిని దేశాల ఆర్థిక వ్యవస్థ దారుణమైన విలువలను చేసుకున్నాయి. ఒక్క చైనా (China) మాత్రం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 3.20 శాతం వృద్ధి సాధించగా, యూకే (Uk) ఆర్థిక వ్యవస్థ 21.7 శాతం, ఫ్రాన్స్ (France) 13.8 శాతం, ఇటలీ(Italy) 12.4 శాతం, కెనడా(Canada) 12 శాతం, జర్మనీ(Jermany) 10.10 శాతం, అమెరికా (America) 9.10 శాతం, జపాన్ (Japan) 7.6 శాతం క్షీణించాయి.

ఏజెన్సీ అంచనాలకు దగ్గరగా..

అధికారిక గణాంకాలు పలు ఏజెన్సీల అంచనాలకు దగ్గరగానే నమోదయ్యాయి. ఏజెన్సీలన్నీ తొలి త్రైమాసికంలో జీడీపీ 15 శాతం నుంచి 45 శాతం వరకు క్షీణిస్తుందని అంచనా వేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆర్థికవేత్తలు జీడీపీ 16.5 శాతం, కేర్ రేటింగ్స్ ఏజెన్సీ 20.2 శాతం, బార్క్‌లేస్ 25.5 శాతం, గోల్డ్‌మన్ శాచ్స్ 45 శాతం తగ్గిపోతుందని అంచనా వేశాయి. పలు రేటింగ్ ఏజెన్సీలు రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య విధాన కమిటీ(MPC) కొవిడ్ కారణంగా ఎటువంటి అంచనాలను ఇవ్వకుండా ఈ ఏడాది జీడీపీ వృద్ధిని నెగెటివ్‌గా నిర్ణయించింది.

కొవిడ్ దెబ్బ..

కొవిడ్ వ్యాప్తి, లాక్‌డౌన్ ఆసియాలోని ఇతర దేశాల కంటే భారత్‌పైనే ఆర్థిక నష్టం ప్రభావం అధికంగా చూపించిందని క్యాపిటల్ ఎకనామిక్స్‌లోని ఆర్థికవేత్త షిలాన్ షా చెప్పారు. కరోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్ దేశాల తర్వాత భారత్ మూడో స్థానంతో ఉంది. దేశంలో సుమారు మూడు నెలల పాటు ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. అన్‌లాక్ దశలోనూ వివిధ నగరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. రవాణా వ్యవస్థ భారీగా దెబ్బతింది, హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికీ సగానికిపైగా మూసే ఉన్నాయి. సేవల రంగం, తయారీ, రిటైల్ అమ్మకాలు ఊహించని స్థాయిలో కుచించుకుపోయాయి. లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారని షా పేర్కొన్నారు. మార్చి త్రైమాసికంలో 3.1 శాతం వృద్ధితో పోలిస్తే జూన్ త్రైమాసికంలో జీడీపీ 21 శాతం క్షీణించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ అభీక్ బారువా అంచనా వేశారు.

Advertisement

Next Story